logo
సినిమా

దగ్గుబాటి ఫ్యామిలీని సంప్రదించకుండానే ఆఫర్‌ ఎలా ఇచ్చాడు?

X
Highlights

పూటకో పురాణం చెబుతూ టాలీవుడ్‌ను కుదిపేస్తున్న శ్రీరెడ్డి వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఏదో రకంగా...

పూటకో పురాణం చెబుతూ టాలీవుడ్‌ను కుదిపేస్తున్న శ్రీరెడ్డి వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఏదో రకంగా ఇండస్ట్రీని కెలుకుతూ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో తెరపైకి ఎక్కే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ... తెరచాటున చాలా వ్యవహారమే చేసినట్టు లీకైన ఆడియో టేప్‌ కలకలం సృష్టిస్తోంది. ఇంతకీ వివాదం ఎక్కడ మొదలైంది? ఎందుకు మొదలైంది? వర్మ పవన్‌కల్యాణ్‌నే ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు? వర్మ చేస్తున్నదంతా వసూళ్ల కోసమేనా?

ఇండస్ట్రీలో వివాదాస్పద దర్శకుడిగా, తెలివైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్‌గోపాల్‌ వర్మ అనూహ్యంగా వివాదంలో ఇరుక్కుపోయాడు. ఎవరిని టార్గెట్‌ చేద్దామనుకున్నాడో ఎందుకు టార్గెట్‌ చేద్దామనుకున్నాడో కానీ క్యాస్టింగ్‌ కౌచ్‌పై టాలీవుడ్‌ను షేక్‌ చేస్తున్న శ్రీరెడ్డికి ఏకంగా ఐదు కోట్ల రూపాయల ఆఫర్‌ ఇచ్చాడు. ఇప్పటిదాకా చేసిన రచ్చ చాలు రభస ఇంకా పెరగకముందే ఫుల్‌స్టాఫ్‌ పెట్టాలంటూ ఆఫర్‌ ఇవ్వడం అది బయటకు రావడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. శ్రీరెడ్డి ఇష్యూలో తలదూర్చిన రాంగోపాల్‌వర్మ ఐదు కోట్ల డీల్ కూడా మాట్లాడినట్టు ఆయనే చెప్పారు.

దగ్గుబాటి ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఓ పేరుంది. ఆ మాటకొస్తే సమాజంలో ఓ నేముంది. నిజానికి శ్రీరెడ్డి టార్గెట్‌ చేసింది కూడా సురేష్‌ ఫ్యామిలీనే. ఆయన కుమారుడు అభిరామ్‌ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తనను అన్ని విధాలుగా వాడుకున్నాడన్నది శ్రీరెడ్డి ఆరోపణ. అదే వర్మకు ఆయుధమైందా? ఐదు కోట్ల ఆఫర్‌ ఇప్పిస్తానని చెప్పి వర్మ బ్రోకరిజానికి పాల్పడ్డడా? ఇదే విషయంపై టాలీవుడ్‌ చెవులు కొరుక్కుంటోంది.

ఒకటి కాదు రెండు కాదు... ఐదు కోట్ల భారీ ఆఫర్‌కు శ్రీరెడ్డి నో చెప్పిందని చెప్పారు వర్మ. ఇది తనకు పెద్ద షాక్‌లాందని కూడా చెప్పారు. ఎందుకంటే అంత పెద్ద ఆఫర్‌ను వదలుకోవడానికి చాలా దమ్ముండాలంటారు వర్మ. టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై తనకు కూడా ఓ బ్యాడ్‌ ఒపినీయన్‌ ఉందన్న వర్మ శ్రీరెడ్డిని టార్గెట్‌ చేస్తూ ఆమెను ముందుండి నడిపించారా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

పరిశ్రమకు చెందిన కొంతమంది శ్రీరెడ్డికి అనుకూలంగా, కొంతమంది వ్యతిరేకంగా ఉన్నా శ్రీరెడ్డికి మొదటి నుంచీ రామ్‌గోపాల్‌వర్మ తనదైన శైలిలో మద్దతిస్తూనే ఉన్నారు. శ్రీరెడ్డి ఝాన్సీ లక్ష్మీబాయిలా పోరాడిందంటూ రెండు రోజుల క్రితం ట్వీట్‌ చేసిన ఆర్జీవీ తర్వాత అశోక చక్రవర్తితో పోల్చారు. ఆ తర్వాత డీసెంట్‌ అమౌంట్‌ ఇప్పిస్తా... సైలెంట్‌గా ఉండమంటూ ఆఫర్‌ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే శ్రీరెడ్డితో దగ్గుబాటి ఫ్యామిలీకి రాజీకుదర్చడానికి రాయబారిగా మారారా? బ్రోకర్‌ అవతారం ఎత్తారా? అన్న ప్రశ్నలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.

మొత్తానికి టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది శ్రీరెడ్డి. తెలుగు అమ్మాయిల‌కు అవ‌కాశాలు ఇవ్వకుండా, క‌మిట్‌మెంట్ ఇస్తేనే, కాంప్రమైజ్ అయితేనే అవ‌కాశాలు ఇస్తున్నార‌ని, మ‌రికొంద‌రైతే వాడుకుని ప‌క్కన ప‌డేస్తున్నార‌ంటూ టాలీవుడ్‌ను టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి ఎక్కడ త‌మ పేరు బ‌య‌ట‌పెడ్తుందో అన్న భయం, ఒకరకమైన ఆందోళన టాలీవుడ్‌ పెద్దల్లోనూ కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లోనే దూకుడు పెంచిన శ్రీరెడ్డి ఇండస్ట్రీలో పెద్దలుగా చలమాణి అవుతున్న వారిలో చాలా మంది అమ్మాయిలు ప‌క్కలోకి త‌ప్పితే మ‌రే దానికి ప‌నికి రారన్న ఫీలింగ్‌లో ఉన్నారంటూ వాయిస్‌ పెంచేస్తోంది.

అసలు వర్మ టార్గెట్‌ ఏంటి? టాలీవుడా? పవన్‌కల్యాణా? టార్గెట్‌ టాలీవుడ్‌ అయితే పవన్‌కల్యాణ్‌పై మాత్రమే శ్రీరెడ్డిని ఎందుకు ఉసిగొల్పాడు. పవన్‌పై అర్జున్‌రెడ్డి సినిమా డైలాగ్‌ ఉపయోగించమని తానే చెప్పానన్న వర్మ ఆ మాటను ఎందుకు వాడారు? అంటే మొదటి నుంచి కూడా శ్రీరెడ్డి ఎపిసోడ్‌కు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అంతా రాంగోపాల్ వర్మయేనా? అసలు నిజాలేంటి?

పొలిటికల్‌ ఫీల్డ్‌లో ఉన్న పవన్‌ను తిడితేనే నీకు అంటే శ్రీరెడ్డికి మైలేజ్‌ వస్తుందని చెప్పానన్నాడు వర్మ. అంటే క్లియర్‌గా రాంగోపాల్‌వర్మే శ్రీరెడ్డితో పవన్‌కల్యాణ్‌ను తిట్టమని చెప్పినట్టు తేలిపోయింది. ఇది చినికి చినికి గాలి వానగా మారడం టాలీవుడ్‌ను షేక్‌ చేయడంతో రాంగోపాల్‌వర్మ దిగిరాక తప్పలేదు. చేసిన తప్పును అంగీకరించకా తప్పలేదు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను తిడితేనే శ్రీరెడ్డి చేస్తున్న ఉద్యమం పెద్ద ఎత్తున అందరిలోకి వెళ్తుందన్నదే తన ఉద్దేశం కానీ పవన్‌ను తిట్టిపోయడం తనకేం సరదా కాదంటారు వర్మ. అందుకే వ్యక్తిగతంగా పవన్‌కల్యాణ్‌కు, అభిమానులను క్షమించమని కోరాడు.

అటు- శ్రీరెడ్డి ఎపిసోడ్‌పై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. సినీ ఇండస్ట్రీ లేకుండా టీవీల్లేవు టీవీల్లేకుండా సినీ పరిశ్రమ లేదన్నారు తమ్మారెడ్డి. శ్రీరెడ్డిలాంటి వాళ్లకు కనీసం స్క్రోలింగ్‌ కూడా పెట్టొద్దని సూచించారు. మొత్తానికి శ్రీరెడ్డి ఇష్యూ టాలీవుడ్‌ను షేక్‌ చేస్తుంటే... శ్రీరెడ్డిలో వర్మ ఎపిసోడ్‌.. ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Next Story