logo
జాతీయం

ఎద్దుల బండి ఎక్కండి

Highlights

బుల్లెట్‌ రైలు ఎక్కడం ఇష్టం లేనివాళ్లు ఎద్దుల బండి ఎక్కొచ్చని ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌ను ఉద్దేశించి...

బుల్లెట్‌ రైలు ఎక్కడం ఇష్టం లేనివాళ్లు ఎద్దుల బండి ఎక్కొచ్చని ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు వల్ల ఎవరికీ ఎటువంటి ప్రయోజనం లేదని కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలకు మోదీ దీటైన సమాధానం ఇచ్చారు. గుజరాత్‌లోని భారుచ్‌, సురేంద్రనగర్‌, రాజ్‌కోట్‌ జిల్లాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన... పలు అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రె్‌సపై నిప్పులు చెరిగారు. ‘అన్నింటినీ వ్యతిరేకించడమే కాంగ్రెస్‌ రాజకీయం. గుజరాత్‌లో చేపడుతున్న బుల్లెట్‌ ట్రైన్‌ను కూడా ఇలాగే గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు. బుల్లెట్‌ ట్రైన్‌ వద్దనుకొనే వాళ్లు... ఎద్దుల బండిలో వెళ్లండి’ అని వ్యాఖ్యానించారు. బుల్లెట్‌ ట్రైన్‌తో కలిగే ఉపయోగాలను ఈ సందర్భంగా మోదీ వివరించారు.

‘ఈ ప్రాజెక్టు వల్ల భారుచ్‌ జిల్లాకు, ఈ ప్రాంతానికి ఎంత ప్రయోజనం కలుగుతుందో తెలుసా? సిమెంటు, ఉక్కు, ఇతరత్రా ముడిసరుకులు, కార్మికులు ఎక్కడ నుంచి వస్తారు? భారత్‌ నుంచి కాదా? వీరిని ఉపయోగించుకునేది... జపాన్‌. అంటే... ఇది పెద్ద ఒప్పందం కాదా?’ అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు కోసం కాంగ్రెస్‌ చొరవ తీసుకోదని, తాము చేపడుతుంటే ఓర్వలేక పోతున్నారని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ గురించి గుజరాత్ ప్రజలకు బాగా తెలుసు. కాంగ్రెస్ తన రంగులను ఎప్పటికప్పుడు మారుస్తుంది. సోదరుల మధ్య గోడ కడుతుంది. ఒక కులంతో మరో కులానికి.. ఒక మతంతో మరో మతానికి మధ్య చిచ్చుపెడుతుంది అని విమర్శించారు. హార్దిక్ పటేల్, జిగ్నేశ్ మేవానీ, అల్పేశ్ ఠాకూర్ వంటి కుల నాయకులతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవడంపై మాట్లాడుతూ వారు (కాంగ్రెస్) మిమ్మల్ని కొట్లాటల్లో నిమగ్నమయ్యేలా చేస్తారు. మీరు ఒకవేళ చనిపోయినా కాంగ్రెస్ నాయకులు మలాయ్ తింటారు. అయితే గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఈ రోగాలన్నీ నయమైపోయాయి అని పేర్కొన్నారు.

Next Story