Top
logo

ఖతర్‌లో బందీగా తెలుగు మహిళ..లక్ష ఇవ్వాలని, లేదా మరో మహిళను పంపాలని డిమాండ్‌

X
Highlights

కట్టుకున్నవాడు ఖర్మానికి వదిలేశాడు.. కడుపున పుట్టిన సంతానం బాధ్యత మీద పడింది.. రెక్కలు ముక్కలు చేసుకున్నా కాలం ...

కట్టుకున్నవాడు ఖర్మానికి వదిలేశాడు.. కడుపున పుట్టిన సంతానం బాధ్యత మీద పడింది.. రెక్కలు ముక్కలు చేసుకున్నా కాలం కలిసి రాలేదు..కొండలా పెరిగిపోయిన అప్పులు.. కుటుంబం గడవడానికి నానా తిప్పలు..ఎడారి దేశాలకు వెళ్తే కష్టాలు కడతేరతాయన్న ఏజెంట్ మాట నమ్మి ఉన్నదంతా అమ్మి, అందిన కాడికి అప్పులు చేసి వెళ్లిన ఓ తెలుగు మహిళ గల్ఫ్ లో బందీ అయిపోయింది. తనను నరక కూపం నుంచి రక్షించాలని వేడుకుంటున్న మహిళపై hmtv కథనం.

సౌదీ అరేబియా, దుబాయ్‌, మస్కట్‌, ఖతర్... దేశం పేరు మార్పే తప్ప అక్కడ ఎదురయ్యే చేదు అనుభవాలు మారడం లేదు. ఏ దేశంలోనైనా పొట్ట చేత పట్టుకొని వెళ్లిన తెలుగువాళ్లు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఉపాధినిప్పిస్తామని చెప్పే గల్ఫ్‌ ఏజెంట్ల మాయమాటల్లో పడి నిండా మునుగుతున్నారు. ముఖ్యంగా ఇంటిపని, వంటిపని కోసం గల్ఫ్‌ బాట పడుతున్న మహిళల పరిస్థితి మరీ దారుణం. అడుగుపెట్టిన తొలిరోజు నుంచే నానా నరకయాతనలకు గురవుతున్నారు. జరిగిన నష్టం తెలుసుకునే లోపే.. కట్టుబానిసలుగా దుర్భర జీవితం గడుపుతున్నారు. ఆ సంకెళ్లు తెగ్గొట్టుకొనే దారి కానరాక రక్షించమని కనిపించని దేవుళ్లకు కన్నీటితో మొక్కుతున్నారు.

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ వినాయక పురానికి చెందిన సయ్యద్ ఫాతిమాను భర్త వదిలేశాడు. దీంతో కుటుంబ పోషణ భారం ఆమెపై పడింది. అవసరాల కోసం అందినకాడికి అప్పులు చేసింది. కూలి పనులతో పాటు టిఫిన్ సెంటర్ నడిపినా అప్పులు తీరలేదు. దీంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి.

ఎలాగైనా ఆప్పుల ఊబి నుంచి బయట పడాలని ఫాతిమా ఖతర్ వెళ్లేందుకు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సుభానీ అనే ఏజెంట్ ను ఆశ్రయించింది. ఉన్నదంతా ఊడ్చి బంగారం అమ్మి అప్పులు చేసి 80 వేలు ఆ దళారి చేతిలో పోసింది. ఖతర్ లో ఓ షేక్ ఇంట్లో పనికి కుదిరిన ఆమెకు ప్రత్యక్ష నరకం చూపించాడా కర్కోటకుడు. దీంతో ఫాతిమా తీవ్ర అనారోగ్యం పాలైంది.

తన పరిస్థితిని సుభానీకి వివరించి వేరే షేక్ దగ్గర పనికి చేరింది. అక్కడా అదే పరిస్థితి. నిత్యం వేధింపులు.. విరామం లేని పని..విశ్రాంతి లేకుండా పని చేయడంతో ఫాతిమా ఆరోగ్య పరిస్థితి విషమించింది. తాను ఎదుర్కొంటున్న సమస్యలను ఫోన్ ద్వారా hmtvకి చెప్పుకొంది. తనను ఆ నరకకూపం నుంచి రక్షించమంటూ కన్నీటి పర్యంతమైంది. షేక్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఫాతిమా పరిస్థితి తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఏజెంట్ సుభానీకి ఫోన్ చేశారు. లక్ష రూపాయలివ్వడమో లేక మరో ఆడమనిషి వెళ్తేనో ఫాతిమాను తిరిగి స్వదేశానికి పంపిస్తానని పెడసరం సమాధానాలు చెప్పడంతో దిక్కు తోచని పరిస్థితిలో పడ్డారు. తనను విసిగిస్తే ఫోన్ స్విచాఫ్ చేస్తానని.. దిక్కున్నచోట చెప్పుకోమంటూ బెదిరించాడా దగాకోరు.

hmtv చొరవతో స్థానిక యువజన సంఘం సభ్యులు ఫాతిమా పరిస్థితిని వివరిస్తూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు లేఖ రాశారు. ఎడారి దేశాల్లో చిక్కుపడిన ఎందరినో రక్షించిన సుష్మా.. తమ ప్రాంతానికి చెందిన ఫాతిమాను కూడా స్వగ్రామానికి చేర్చాలని కోరారు. ఖతర్ లో అమాయకంగా షేకుల చేతిలో చిక్కి శారీరకంగా, మానసికంగా అనారోగ్యం పాలైన ఫాతిమాను వెంటనే స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వారి వేడుకోళ్లు పాలకులు ఆలకించి ఫాతిమాను త్వరగా ఆమె కుటుంబసభ్యుల దగ్గరకు చేర్చాలని hmtv కోరుతోంది.

Next Story