తెలంగాణ ప్రభుత్వ అవార్డులపై సర్వత్రా ఉత్కంఠ

Highlights

ఏపీ నందులపై చెలరేగిన వివాదంతో సినిమాలకు అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కోరి అనవసర వివాదాలు ఎందుకని భావిస్తోంది. నంది అవార్డుల...

ఏపీ నందులపై చెలరేగిన వివాదంతో సినిమాలకు అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కోరి అనవసర వివాదాలు ఎందుకని భావిస్తోంది. నంది అవార్డుల తరహాలోనే సింహ అవార్డులను ఇవ్వాలని ముందు భావించినా ఇప్పడు దానికంత ప్రాధాన్యత లేదని టీ సర్కార్ భావిస్తోంది. కోరి వివాదాలు కొని తెచ్చుకోవడం ఎందుకని అవార్డుల ఆలోచననే పక్కన పెట్టింది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణలో సినీ పరిశ్రమ ప్రోత్సాహానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ వచ్చింది. సినీరంగ ప్రముఖులు కూడా మంత్రి కేటీఆర్ తో, ప్రభుత్వంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. సీఎం కేసీఆర్ కూడా రాయితీలు ప్రకటించి, సినిమాలపై తన అభిప్రాయాలు చెబుతూ టాలీవుడ్ కి దగ్గరయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పలుసార్లు సినీ పెద్దలతో సమావేశమై సమస్యలపై చర్చించారు. పరిశ్రమకి అనుకూలంగా కొన్ని పాలసీలు కూడా ప్రకటించారు.

పరిశ్రమ అంతా హైదరాబాద్ లోనే ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ ప్రోత్సాహకంలో భాగంగా అవార్డులు ఇస్తేనే బాగుంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల తరహాలో తెలంగాణ సర్కార్ కూడా పురస్కారాలు ఇవ్వనుందని చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ అవార్డులు ఎప్పుడు ఇస్తారు, ఏ పేరుతో ఇస్తారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గత దసరాకే సినిమా అవార్డులు ఇవ్వాలని భావించారు. కానీ సీఎం కేసీఆర్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో వాయిదా పడిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

సీఎం కేసీఆర్ కూడా ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. తెలంగాణా అవార్డుల పేరు ఖరారుకు ప్రభుత్వ సలహాదారు రమణాచారి నేతృత్వంలో కమిటీ నియమించారు. ఈ కమిటీ రెండు, మూడు సార్లు సమావేశమై కొన్ని పేర్లను పరిశీలిస్తోంది. సింహ, పాలపిట్ట, నెమలితో పాటు పలు పేర్లు చర్చించారు. వీటిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సింహా పేరుకే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడేళ్ళ తర్వాత నంది అవార్డులను ఒకేసారి ప్రకటించింది. ఈ అవార్డులపై వివాదం కూడా తలెత్తింది. నంది అవార్డుల ప్రకటనతో తెలంగాణ అవార్డులపై చర్చ మొదలైంది. దీంతో అనవసర వివాదాల్లోకి వెళ్లకుండా ఆ ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేయడమే ఉత్తమమని భావిస్తున్నట్టు తెలిసింది. అదీ కాకుండా తెలంగాణ సినిమాలు అనుకున్నా మేరకు రావడం లేదని అందుకోసం ఇప్పటికిప్పడు సినిమా అవార్డులు ఇవ్వడం సరికాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదీ కాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశాకే ఇతర కార్యక్రమాలను చేపడుతుందని సచివాలయ హైయ్యర్ అఫిషిల్స్ అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories