నియోజకవర్గానికి ఐదుగురు అభ్యర్ధులతో కూడిన జాబితా

నియోజకవర్గానికి ఐదుగురు అభ్యర్ధులతో కూడిన జాబితా
x
Highlights

అధికారమే లక్ష్యంగా మహాకూటమితో జట్టుకట్టిన కాంగ్రెస్ కు కష్టాలు తప్పడం లేదు. ఓ వైపు పొత్తుల తిప్పలు కొనసాగుతుండగానే సొంత పార్టీలో రోజురోజుకు...

అధికారమే లక్ష్యంగా మహాకూటమితో జట్టుకట్టిన కాంగ్రెస్ కు కష్టాలు తప్పడం లేదు. ఓ వైపు పొత్తుల తిప్పలు కొనసాగుతుండగానే సొంత పార్టీలో రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తులు అధిష్టానాన్ని కలవరపరుస్తున్నాయి. చూస్తూ కూర్చుంటే పరిస్దితులు చేయి దాటుతాయని భావించిన అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది. చర్చలు జరిపేందుకు రావాలంటూ అసంతృప్తులకు రాయబారం పంపింది.

మహాకూటమి పొత్తుల్లో భాగంగా 28 స్ధానాలు మిత్రపక్షాలకు కేటాయించిన కాంగ్రెస్ నేతలు మిగిలిన స్ధానాల్లో గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించిన అగ్రనేతలు స్క్రీనింగ్‌ కమిటీకి ఐదు అభ్యర్ధులతో కూడిన జాబితాను అందజేశారు. వీరి నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసిన కమిటీ సభ్యులు మిగిలిన వారి నుంచి వ్యక్తమయ్యే నిరసనలను పరిగణలోకి తీసుకోవాలంటూ అధిష్టానానికి సూచించింది. ఇదే సమయంలో మిత్రపక్షాలుగా ఉన్న టీజేఎస్‌, సీపీఐ తాము పోటీ చేసే స్ధానాలపై పట్టు విడవకపోవడం, సీట్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ ఉండటంతో కాంగ్రెస్ నేతలకు అంతుచిక్కడం లేదు. మిత్రపక్షాలను ఓ వైపు బుజ్జగిస్తూనే పార్టీలోని అసంతృప్తుల జాబితాను అధిష్టానికి అందజేశారు. దీంతో ఢిల్లీ నేతలు నేరుగా అసంతృప్తులతో మాట్లాడుతూ ఢిల్లీ రావాలంటూ కబురు పంపుతున్నారు.

ప్రస్తుతానికి అసంతృప్తితో ఉన్న 21 మంది నేతలకు ఢిల్లీ నుంచి కబురు అందినట్టు సమాచారం. వీరంతా ఈ రోజు ఢిల్లీ చేరుకుని అగ్రనేతలతో చర్చించనున్నారు. 2004లో కూడా పొత్తుల తోనే అధికారంలోకి వచ్చామని ఇప్పుడు కూడా పార్టీపై ప్రజల్లో సానుకూల స్పందన ఉందని ఇలాంటి సమయంలో అనవసర వివాదాలు వద్దంటూ అసంతృప్త నేతలకు అధిష్టాన దూతలు హితవు పలుకుతున్నారు. అధికారంలోకి వస్తే అన్నిరకాలుగా న్యాయం చేస్తామంటూ భరోసానిస్తున్నారు.

స్ర్కీనింగ్ కమిటీ, ఏలక్షన్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ ‌రెడ్డితో పాటు పలువురు అగ్రనేతలు ఢిల్లీ చేరుకున్నారు. హైకమాండ్ ముఖ్య నేతలతో అసంతృప్తులపై కూడా వీరు చర్చించనున్నారు. దీంతో పాటు అభ్యర్ధుల జాబితా విడుదల చేసే అంశంపై కూడా చర్చలు జరగనున్నాయి. అధినేత రాహుల్‌ గాంధీ ఆమోద ముద్ర ఈ నెల 9న పూర్తి స్ధాయి జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories