తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ రాజీనామా కలకలం

తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ రాజీనామా కలకలం
x
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ దేశాయ్‌ ప్రకాశ్‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి,...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ దేశాయ్‌ ప్రకాశ్‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణకు సంబంధించి జరిగిన పరిణామాలే ప్రకాశ్‌రెడ్డి రాజీనామాకు కారణమని సమాచారం. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కేసు ఇవాళ విచారణకు రానున్న నేపథ్యంలో ప్రకాశ్‌రెడ్డి రాజీనామా చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ దేశాయి ప్రకాశ్‌రెడ్డి రాజీనామా వ్యవహారం కలకలం రేపుతోంది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బహిష్కరణకు సంబంధించిన కీలకమైన కేసు హైకోర్టు విచారణలో ఉండగా ప్రకాశ్‌రెడ్డి పదవి వదులుకోవడం సంచలనంగా మారింది. అయితే ప్రభుత్వ తీరుతో మనస్తాపానికి గురై ప్రకాశ్‌రెడ్డి అడ్వకేట్‌ జనరల్‌ పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.

హైకోర్టులో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ బహిష్కరణ కేసును ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి తరఫున ప్రకాశ్‌రెడ్డి వాదించారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా జరిగిన ఘటనలకు సంబంధించిన ఒరిజినల్‌ వీడియో ఫుటేజీని ఈ నెల 27లోగా సమర్పించాలని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. అందుకు అడ్వకేట్‌ జనరల్‌ అంగీకరించడం వివాదానికి దారి తీసింది. సీసీ ఫుటేజీ ఇస్తామంటూ ప్రకాశ్‌రెడ్డి న్యాయస్థానానికి హామీ ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా అలా ఎలా హామీ ఇస్తారని నిలదీయడంతో ఏజీ నొచ్చుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే, ఈనెల 23న జరిగిన విచారణకు కూడా అడ్వకేట్‌ జనరల్‌ హాజరు కాలేదని తెలుస్తోంది.

అంతేకాదు...కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణ కేసు వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వేను రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రభుత్వం ప్రకాశ్‌రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తనతో సంప్రదించకుండానే ప్రభుత్వం ఎమ్మెల్యే బహిష్కరణ కేసును హరీశ్‌ సాల్వేకు అప్పగించాలని నిర్ణయించడంతో ప్రకాశ్‌రెడ్డి మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ప్రకాశ్ రెడ్డి గతేడాది జులై 18 నుంచి అడ్వకేట్‌ జనరల్‌ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అయితే ప్రకాశ్ రెడ్డి రాజీనామాను ఆమోదించాలా? వద్దా అనే అంశంలో గవర్నర్‌ నిర్ణయం వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories