logo
సినిమా

‘తేజ్‌ ఐ లవ్‌ యు’ మూవీ రివ్యూ

‘తేజ్‌ ఐ లవ్‌ యు’ మూవీ రివ్యూ
X
Highlights

సినిమా పేరు: తేజ్‌ ఐ లవ్‌ యూ న‌టీన‌టులు: సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌,...

సినిమా పేరు: తేజ్‌ ఐ లవ్‌ యూ

న‌టీన‌టులు: సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు.

కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్

క‌ళ‌: సాహి సురేశ్

సంగీతం: గోపీ సుందర్‌

ఛాయాగ్ర‌హ‌ణం: అండ్రూ.ఐ

మాటలు: డార్లింగ్‌ స్వామి

సహ నిర్మాత: వల్లభ

నిర్మాత: కె.ఎస్‌.రామారావు

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌

సంస్థ‌: క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్

‌విడుద‌ల‌: 6 జూన్ 2018

టాలీవుడ్‌లో మెగా మేనల్లుడిగా సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కెరీర్ ఆరంభించి వరుస విజయాలతో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకొన్నారు. అయితే ఇటీవల కాలంలో తేజ్‌కు విన్నర్, ఇంటిలిజెంట్ చిత్రాలు నిరాశను కలిగించాయి. దాంతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తొలిప్రేమ దర్శకుడు కరుణాకరన్ డైరెక్షన్‌లో, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌‌తో జతకట్టి తేజ్ ఐ లవ్ యూ చిత్రంతో అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు తేజ్ సిద్ధమయ్యారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జూలై 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి ధరమ్ తేజ్‌కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలుసుకోవడానికి తేజ్ ఐ లవ్ యూ చిత్ర కథలోకి వెళ్లాల్సిందే.

క‌థ‌: తేజ్ (సాయిధ‌ర‌మ్ తేజ్‌) చిన్న‌ప్పుడే ఒక మ‌హిళ ప్రాణాన్ని కాపాడే క్ర‌మంలో ఓ నేరం చేస్తాడు. ఏడేళ్లు జైలు శిక్ష అనుభ‌విస్తాడు. త‌న ప్రాణాన్ని కాపాడేందుకే అలా చేశాడ‌ని తెలుసుకొన్న ఆ మ‌హిళ తేజ్‌కి స‌హాయం చేయాల‌నుకుంటుంది. అందుకోసం త‌న పేరిట ఉన్న కొంత ఆస్తిని తేజ్‌ పేరిట రాయమని తన భ‌ర్త‌కి చెబుతుంది. కానీ భ‌ర్త త‌న మాట విన‌క‌పోవ‌డంతో ఆఖ‌రి కోరిక‌గా కూతురు నందిని (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్‌)కి చెబుతుంది. దాంతో త‌న త‌ల్లి కోరిక‌ని నెర‌వేర్చేందుకు లండ‌న్ నుంచి వ‌స్తుంది నందిని.
వ‌చ్చాక అనుకోకుండా తేజ్‌కి ద‌గ్గ‌ర‌వుతుంది. ఆ త‌ర్వాత అత‌న్ని మ‌న‌స్ఫూర్తిగా ప్రేమిస్తుంది. ఆ విష‌యం తేజ్‌తో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గానే నందిని ఓ ప్ర‌మాదానికి గుర‌వుతుంది. ఆ ప్ర‌మాదం త‌ర్వాత ఏం జ‌రిగింది? న‌ందినిలో ఎలాంటి మార్పు వ‌చ్చింది? వాళ్లిద్ద‌రి ప్రేమ ఏమైంది? త‌న త‌ల్లిని కాపాడింది కూడా తేజే అనే విష‌యం నందినికి తెలిసిందా లేదా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

నటీనటులు ; ఇన్నాళ్లు మాస్‌ యాక్షన్ హీరో రోల్స్‌ లో మెప్పించిన సాయి ధరమ్‌ తేజ్‌ తొలిసారిగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటించాడు. తనదైన ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌, కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. నటన పరంగా ఆకట్టుకున్నా లుక్స్‌ పరంగా ఇంకాస్త వర్క్ అవుట్‌ చేస్తే బాగుండేది. తెర మీద తేజ్‌ చాలా బొద్దుగా కనిపించాడు. అంతేకాదు గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాల్లో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లను ఇమిట్‌ చేసే ప్రయత్నం చేశాడు. హీరోయిన్‌ నందిని పాత్రలో అనుపమా పరమేశ్వరణ్ ఒదిగిపోయింది. తనకున్న హోమ్లీ ఇమేజ్‌ను పక్కన పెట్టి మోడ్రన్‌ లుక్‌లోనూ అదరగొట్టింది. జయప్రకాష్, పవిత్రా లోకేష్‌ల నటన కంటతడిపెట్టిస్తుంది. 30 ఇయర్స్‌ పృథ్వీ, వైవా హర్షలు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.

విశ్లేష‌ణ‌: తేజ్.. ఐ ల‌వ్యూ అన‌గానే మంచి ల‌వ్ స్టోరీ అనే ఫీలింగ్ అనిపించింది. దానికి తోడు క‌రుణాక‌ర‌న్ ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నార‌న‌గానే త‌ప్ప‌కుండా ఎంతో కొంత తేజ్‌కి క్రేజ్ వ‌చ్చింది. అయితే హీరో, హీరోయిన్ల మ‌ధ్య ఏదో డీల్ కుద‌ర‌డం, అది న‌చ్చ‌క‌పోయినా, లోప‌ల ఎక్క‌డో న‌చ్చుతున్నా.. పైకి న‌చ్చ‌న‌ట్టు క‌నిపిస్తూ మ‌రొక‌రు ఆ డీల్ కోసం కృషి చేయ‌డం, తీరా ప్రేమ‌ను చెప్పుకోవాల్సిన స‌మ‌యంలో దానికి ఆటంకం క‌ల‌గ‌డం, చివ‌రికి హీరో, హీరోయిన్లు ఇద్ద‌రూ త‌మ ప్రేమ‌తో ఒక‌టి కావ‌డం అనేది కొత్త కాదు. చెల్లెలిని న‌చ్చిన‌వాడికిచ్చి పెళ్లి చేసి, అది ఇంట్లో వాళ్ల‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో ఇంటికి దూరంగా ఉండ‌టం కూడా కొత్త కాదు. ప్రేయ‌సి మీద గుండెల నిండా ప్రేమ ఉన్నా, అది ఆమెకు ఎక్క‌డో న‌చ్చ‌దో అనే ఏకైక కార‌ణంగా, ఆమెను ఇబ్బందిపెట్ట‌డం ఇష్టంలేకుండా ప్ర‌వ‌ర్తించే హీరోలు మ‌న‌కు కొత్త‌కాదు. పోనీ అది పాత విష‌య‌మే అయినా, ద‌ర్శ‌కుడు ఎక్క‌డా కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్న‌మూ చేయ‌లేదు. క్లైమాక్స్ సీన్ కూడా రొటీన్‌గానే అనిపించింది. గోపీసుంద‌ర్ స్వ‌ర‌ప‌రిచిన పాట‌లు కూడా మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేలా లేవు. స్టార్టింగ్ సాంగ్‌లో `స్నేహితుడు`లోని `మ‌న ఫ్రెండ‌ల్లే..` పాట‌లోని ట్యూను వినిపిస్తుంది. చిరంజీవి, నాగ‌బాబుని తేజ్ అక్క‌డ‌క్క‌డా ఇమిటేట్ చేయ‌డం అభిమానుల‌కు న‌చ్చుతుంది. అనుప‌మ త‌న పాత్ర‌లో బాగానే న‌టించింది. తేజ్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ పాత్ర‌ల్లో న‌టించిన‌వారంద‌రూ బాగా చేశారు. వైవా హ‌ర్ష‌కు కొన్నాళ్ల గ్యాప్ త‌ర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ ప‌డింది. అనీష్ కురువిల్ల ష‌రా మామూలు పాత్ర‌లో క‌నిపించారు. క‌థ‌లో ట్విస్టులు లేక‌పోవ‌డం, ఎంపిక చేసుకున్న స‌మ‌స్య‌ను కూడా లోతుగా చూపించ‌క‌పోవ‌డం వంటివాటివ‌ల్ల సినిమా అనాసక్తిగా, నిదానంగా సాగిన‌ట్టు అనిపిస్తుంది.

Next Story