logo
జాతీయం

అలోక్ వర్మ 19 లోగా స్పందించాలి..: సుప్రీం

అలోక్ వర్మ 19 లోగా స్పందించాలి..: సుప్రీం
X
Highlights

సీబీఐ డైర‌క్ట‌ర్ అలోక్ వ‌ర్మ‌పై సెంట్ర‌ల్ విజిలెన్స్ క‌మిష‌న్ ఇచ్చిన రిపోర్ట్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ...

సీబీఐ డైర‌క్ట‌ర్ అలోక్ వ‌ర్మ‌పై సెంట్ర‌ల్ విజిలెన్స్ క‌మిష‌న్ ఇచ్చిన రిపోర్ట్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఆ నివేదిక అసంబ‌ద్ధంగా ఉంద‌ని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయ‌ప‌డింది. సీవీసీ ఇచ్చిన నివేదిక‌ను అలోక్ వ‌ర్మ‌కు ఇవ్వాల‌ని సుప్రీం తెలిపింది. ఆ త‌ర్వాత ఆ నివేదిక‌లో ఉన్న అంశాల‌పై అలోక్ వ‌ర్మ‌ మ‌ళ్లీ కోర్టును ఆశ్ర‌యించాల‌ని సుప్రీం త‌న తీర్పులో పేర్కొంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో కేంద్ర విజిలెన్స్ కమిషన్ దర్యాప్తు చేపట్టింది. అలోక్ వర్మపై అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు సీవీసీ అందజేసింది. ఆ నివేదిక కాపీని సీల్డ్ కవర్ లో అలోక్ వర్మకు సుప్రీంకోర్టు అందజేసింది. దీనిపై నవంబర్‌ 19 లోగా స్పందించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అలోక్ వర్మ తనన స్పందనను కూడా సీల్డ్ కవర్ ద్వారా తమకు అందజేయాలని తెలిపింది.

ఈ నివేదిక ద్వారా పలు అభిప్రాయాలు వెలిబుచ్చిందని, వాటిలో కొన్ని అంశాలపై ఇంకా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. అలోక్ వర్మ తన సమాధానం ఇచ్చిన అనంతరం తదుపరి విచారణ నవంబర్ 20న జరుపుతామని, ఈ నివేదికను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలకు కూడా అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉండగా, సీవీసీ నివేదికను తనకు కూడా ఇవ్వాలన్న రాకేశ్ ఆస్థానా అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోమారు మద్దతుగా నిలిచారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పటి నుంచి అలోక్ వర్మ తనకు తెలుసని, ఎంతో నిజాయతీ పరుడైన ఆయనకు అన్యాయం జరిగిందని అన్నారు.

Next Story