రాఫెల్‌‌పై వెనక్కి తగ్గేది లేదంటోన్న కాంగ్రెస్‌

రాఫెల్‌‌పై వెనక్కి తగ్గేది లేదంటోన్న కాంగ్రెస్‌
x
Highlights

రాఫెల్‌ వివాదంలో దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రాఫెల్‌ డీల్‌లో అనుమానించదగ్గ అంశాలేమీ లేవంటూ కేంద్రానికి క్లీన్‌‌చిట్‌ ఇచ్చిన...

రాఫెల్‌ వివాదంలో దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రాఫెల్‌ డీల్‌లో అనుమానించదగ్గ అంశాలేమీ లేవంటూ కేంద్రానికి క్లీన్‌‌చిట్‌ ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం మొత్తం ప్రక్రియపై దర్యాప్తు జరపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. దేశ రక్షణ దృష్ట్యా ఒప్పందంపై అసలు చర్చలే అవసరం లేదని వ్యాఖ్యానించింది. రాఫెల్‌ ఒప్పందంలో మోడీ సర్కార్‌ లక్ష్యంగా విమర్శల దాడి ఎక్కుపెట్టిన కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టు తీర్పుతో నిరాశ ఎదురైంది. ముఖ్యంగా రాఫెల్‌ అస్త్రంతో మోడీపై పెద్దఎత్తున విమర్శనాస్త్రాలు సంధిస్తోన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది. దేశ రాజకీయాల్లోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రాఫెల్‌ ఒప్పందంలో అనుమానించదగ్గ అంశాలేమీ లేవంటూ సుప్రీంకోర్టు క్లీన్‌‌చిట్‌ ఇచ్చింది. రాఫెల్‌ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, మొత్తం ప్రక్రియపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అంతేకాదు రాఫెల్‌ ఒప్పందంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం తేల్చిచెప్పింది. అలాగే ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్‌ విమానాల ధరలను దేశభద్రత దృష్ట్యా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దాంతో కేంద్రానికి భారీ ఊరట లభించినట్లయ్యింది.

రాఫెల్‌ వివాదంలో కేంద్రానికి క్లీన్ చిట్‌ ఇవ్వడంతో ప్రముఖ న్యాయవాది, పిటిషనర్‌ ప్రశాంత్ భూషణ్‌ తీవ్రంగా స్పందించారు. సుప్రీం తీర్పు పూర్తిగా తప్పు అంటూ వ్యాఖ్యానించారు. అయితే రాఫెల్‌ డీల్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫ్‌సెట్‌ పార్టనర్‌ రిలయన్స్‌ డిఫెన్స్‌ అధినేత అనిల్‌ అంబానీ సుప్రీం తీర్పును ఆహ్వానించారు. సుప్రీం తీర్పుతో కాంగ్రెస్‌‌పై బీజేపీ ఎదురు దాడి మొదలుపెట్టింది. సైన్యానికి, ప్రజలకు రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని అమిత్‌షా డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే రాహుల్‌... దేశం పరువు తీశారని రాజ్‌నాథ్ ఆరోపించగా, సుప్రీం తీర్పుతో తమ ప్రభుత్వ నిజాయితీ రుజువైందన్నారు రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్.

56వేల కోట్లతో 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌‌తో చేసుకున్న ఒప్పందంలో 20వేల కోట్ల మేర అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అనిల్‌ అంబానీకి లబ్ది చేకూర్చేందుకే రిలయన్స్ డిఫెన్స్‌‌ను ఆఫ్‌సెట్‌ పార్టనర్‌‌గా ఎంపిక చేశారని అంటోంది. అయితే సుప్రీం తీర్పు తమ పార్టీకి ఎదురు దెబ్బ కాదంటోన్న కాంగ్రెస్‌ నేతలు న్యాయస్థానం అన్ని అంశాలను పరిశీలించలేదని అభిప్రాయపడ్డారు. తాము ఇప్పటికీ రాఫెల్‌ వివాదంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నామంటున్నారు. మొత్తానికి రాఫెల్‌ ఒప్పందంపై బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య జరుగుతోన్న మాటల యుద్ధం సుప్రీం తీర్పుతో కొత్త మలుపు తిరిగింది. బీజేపీ ఎదురు దాడి చేస్తుంటే, కాంగ్రెస్‌ మాత్రం తమ స్టాండ్‌లో ఎలాంటి మార్పు లేదంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories