logo
సినిమా

‘శ్రీనివాస కళ్యాణం‌’ మూవీ రివ్యూ

‘శ్రీనివాస కళ్యాణం‌’ మూవీ రివ్యూ
X
Highlights

టైటిల్ : శ్రీనివాస కళ్యాణం బ్యాన‌ర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ న‌టీన‌టులు: నితిన్, రాశీ ఖన్నా,నందితా...

టైటిల్ : శ్రీనివాస కళ్యాణం
బ్యాన‌ర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
న‌టీన‌టులు: నితిన్, రాశీ ఖన్నా,నందితా శ్వేత‌, పూన‌మ్‌కౌర్‌, జ‌య‌సుధ‌, ఆమ‌ని, సితార‌, సీనియ‌ర్ న‌రేశ్‌, ప్ర‌కాష్‌రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌దిత‌రులు
సంగీతం: మిక్కీ జె మేయర్
కెమెరా: స‌మీర్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: సతీష్ వేగేశ్న‌
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి అనిత‌
నిర్మాత‌లు: దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్

పెళ్లి అనే కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకూ చాలా సినిమాలే వచ్చాయి. వీటిలో కొన్ని సూపర్ హిట్ చిత్రాలుగా నిలవగా మరికొన్ని ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. పెళ్లి మీద ఎన్ని సినిమాలొచ్చినా ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. కారణం ఈసారి కొత్తగా తెరపై ఏం చూపిస్తారనే ఆసక్తి. ఇప్పుడు అదే ఆసక్తి ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంపై ప్రేక్షకులకు ఉంది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం చిత్ర యూనిట్‌కు ఉంది. మరి చిత్ర యూనిట్ చెబుతున్నట్టు ఈ సినిమాలో కంటెంట్ ఉందా..? ప్రేక్షకులకు నచ్చే విధంగా కొత్తగా ఏం చూపించారు..?

కథ: చిన్నప్పటి నుండి తన నానమ్మ చెప్పే మాటలు వింటూ పెరుగుతాడు వాసు(నితిన్). ఉమ్మడి కుటుంబంలో పెరగడంతో ప్రతి విషయంలో పద్దతిగా ఉంటాడు వాసు. చండీఘర్ లో ఉద్యోగం చేసే సమయంలో అతడికి శ్రీ(రాశిఖన్నా)తో పరిచయం ఏర్పడుతుంది. వాసు ప్రవర్తన, పద్ధతులు నచ్చి శ్రీ అతడిని ప్రేమిస్తుంది. వాసు కూడా ఆమె ప్రేమను అంగీకరిస్తాడు. హైదరాబాద్ లో పేరు గాంచిన వ్యాపారవేత్త ఆర్.కె(ప్రకాష్ రాజ్) చిన్నకూతురు శ్రీ. రిచ్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన శ్రీకి వాసు కుటుంబం మీద కూడా మంచి ఒపీనియన్ ఉంటుంది. అదే విషయాన్ని తన తండ్రికి చెబుతుంది. ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకుంటారు. కానీ శ్రీ తండ్రి ఆర్.కె కి పెళ్లి, సాంప్రదాయాలంటే ఇష్టం ఉండదు. తన కూతురు ప్రేమించిందనే ఒక్క కారణంతో వాసుని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ పెళ్లికి ముందే వాసుని ఓ అగ్రిమెంట్ మీద సంతకం చేయమని అడుగుతాడు. ఆ అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి అయిన తరువాత విడిపోవాలని అనిపిస్తే ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదదు. ఇష్టం లేకపోయినా.. వాసు తన ప్రేమ మీద నమ్మకంతో ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాడు. మరి ఆ అగ్రిమెంట్ వీరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది..? శ్రీ, వాసులు ఒక్కటయ్యారా..? తమ పెళ్లితో ఇరు కుటుంబాలు సంతోషంగానే ఉన్నారా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ ; శతమానం భవతి సినిమాతో యూత్‌ ఆడియన్స్‌ను కూడా ఫ్యామిలీ సినిమాకు కనెక్ట్ చేసిన దర్శకుడు సతీష్‌ వేగేశ్న. మరోసారి ఈ దర్శకుడి నుంచి దిల్ రాజు బ్యానర్‌లో సినిమా వస్తుందంటే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అయితే ఆ అంచనాలు అందుకోవటంలో సతీష్ ఫెయిల్‌ అయ్యారు. పెళ్లి నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు, ఆ కథను మనసును తాకేలా తెరకెక్కించలేకపోయారు. ఫస్ట్‌ హాఫ్ హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు కాస్త ఆసక్తి కరంగా అనిపించినా సెకండ్‌ హాప్‌లో లో పెళ్లి పనులు మొదలైన తరువాత కథనం మరింత నెమ్మదించింది. పెళ్లింట్లో కామెడీ, ఎమోషన్స్‌ మరింతగా పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఎక్కువగా పెళ్లి గొప్పతనాన్ని చెప్పడానికి సమయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రచయితగా సతీష్ ఆకట్టుకున్నారు. పెళ్లి మంత్రాల్లోని అంతరార్థం చెప్పే డైలాగ్స్‌తో పాటు ‘వద్దనుకుంటూ వెళ్లిపోతే అనుబంధాలు.. వదులుకుంటూ వెళ్లిపోతే సాంప్రదాయాలు మిగలవ్‌’ లాంటి డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. మిక్కీ జే మేయర్‌ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఒక్క పెళ్లి పాట తప్ప మరే పాట మెప్పించేలాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫి పెళ్లి వేడుకకు మరింత అందం తీసుకువచ్చింది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

నటీనటులు : కుటుంబ బంధాలు సాంప్రదాయల విలువ తెలిసిన కుర్రాడిగా నితిన్‌ బరువైన పాత్రలో కనిపించాడు. తన లవర్‌ బాయ్ ఇమేజ్‌ను కాపాడుకుంటూనే ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మెప్పించాడు. శ్రీదేవి పాత్రలో రాశిఖన్నా ఒదిగిపోయింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. పద్మావతిగా నందిత శ్వేతకు ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. ఫస్ట్‌ హాఫ్‌లో అల్లరి అమ్మాయిగా అలరించిన నందిత సెంకడ్‌ హాఫ్‌లో ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మెప్పించింది. బిజీ బిజినెస్‌మేన్‌గా ప్రకాష్ రాజ్‌ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, జయసుధ, సితార, విద్యుల్లేఖ రామన్‌, ప్రవీణ్ ఇలా అంతా రొటీన్‌ పాత్రల్లో కనిపించారు.

Next Story