logo
సినిమా

‘రా..రా..’ మూవీ రివ్యూ

‘రా..రా..’ మూవీ రివ్యూ
X
Highlights

చిత్రం: రా..రా నటీనటులు: శ్రీకాంత్‌, నజియా, వేణు, చమ్మక్‌ చంద్ర, అలీ, పృథ్వీ, షకలక శంకర్‌ తదితరులు.. సంగీతం:...

చిత్రం: రా..రా
నటీనటులు: శ్రీకాంత్‌, నజియా, వేణు, చమ్మక్‌ చంద్ర, అలీ, పృథ్వీ, షకలక శంకర్‌ తదితరులు..
సంగీతం: ర్యాప్‌ రాక్‌ షకీల్‌
ఎడిటింగ్‌: శంకర్‌
నిర్మాత: ఎం.విజయ్‌
దర్శకత్వం: శంకర్‌
బ్యానర్: విజి చెరీష్‌‌ విజన్స్‌
విడుదల తేదీ: 23-02-2018

ప్రస్తుత జనరేషన్‌లో శ్రీకాంత్ యాక్టింగ్‌కు టాలీవుడ్‌లో ఓ మార్కు ఉంది. విలనిజం, కామెడీ, హీరోయిజం, క్యారెక్టర్ ఆర్టిస్టుగా శ్రీకాంత్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 100కుపైగా చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న శ్రీకాంత్ తొలిసారి రా రా అనే ఓ హారర్, కామెడీ చిత్రంలో నటించాడు. హారర్, కామెడీ చిత్రంలో శ్రీకాంత్ అభిమానులను, ప్రేక్షకుడిని మెప్పించాడా అనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ : రాజ్‌కిరణ్‌ ( శ్రీకాంత్‌) తండ్రి ( గిరిబాబు) ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్‌. గిరిబాబు తీసిన వంద సినిమాల్లో ఒక్కటి తప్పా మిగిలినవన్నీ హిట్‌ సినిమాలు తీసిన గొప్ప దర్శకుడిగా గిన్నిస్‌ బుక్‌లో రికార్డు కెక్కుతాడు. అతని కొడుకు (శ్రీకాంత్‌) డైరెక్టర్‌ కావాలనుకుంటే నిర్మాతలు క్యూ కడతారు. అయితే తీసిన ప్రతి సినిమా బెడిసికొడుతుంది. చివరకు ఒక సినిమాను గిరిబాబు ప్రొడ్యూస్‌ చేస్తాడు. సినిమా రిజల్ట్‌ రివర్స్‌ కావడంతో గుండె ఆగి చనిపోతాడు. అది చూసి శ్రీకాంత్‌ తల్లికి గుండెపోటు వస్తుంది. ఆమెను బతికించుకోవాలంటే తనకు సంతోషంగా ఉండే పని చేయమని డాక్టర్స్‌ రాజ్‌కిరణ్‌కు సలహా ఇస్తారు. తల్లి సంతోషంగా ఉండాలంటే కనీసం ఒక్క హిట్‌ సినిమా తీస్తే చాలనుకుంటాడు. అయితే హిట్‌ సినిమా తీయడాని​కి రాజ్‌కిరణ్‌ పడ్డ కష్టాలేంటీ? సినిమా తీసే ప్రయత్నంలో దెయ్యాలతో వచ్చిన ఇబ్బందులేమిటీ? అసలు దెయ్యాలుండే ఇంటికి రాజ్‌కిరణ్‌ ఎందుకు వెళ్లాడు? సినిమా ఎవరితో తీశాడు? అది హిట్టా లేక ఫట్టా ? వీటికి సమాధానాలే రా..రా.. సినిమా.

ఎలాఉందంటే: మనుషులు దెయ్యాల్ని భయపెట్టడం పాయింట్‌తో ఈ సినిమా సాగుతుంది. అయితే ఆ కొత్త పాయింట్‌ను దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది. మనుషుల్ని చూసి దెయ్యాలు భయపడే సన్నివేశాల్ని వినోదబరితంగా తీర్చిదిద్దాల్సింది పోయి, వెటకారంగా మలిచారు. దాంతో ఏ సన్నివేశం కూడా తెరపై పండలేదు. లెక్కలేనంత మంది నటులు ఉన్నప్పటికీ సన్నివేశ రూపకల్పనలో బలం లేకపోవడంతో వాళ్లంతా తేలిపోయారు. మధ్యలో పృథ్వీ వచ్చి కాస్తంత ఉపశమనం కల్గిస్తాడు. తొలిసగంలో కథేమీ సాగదు. కేవలం సన్నివేశాల్ని అతికించుకుంటూ వెళ్లిపోయారంతే. ద్వితీయార్ధంలో రెండో దెయ్యం గ్యాంగ్‌ ప్రవేశిస్తుంది. అక్కడి నుంచైనా కథ మలుపు తిరగాల్సి ఉంది. దెయ్యం ఫ్లాష్‌బ్యాక్‌, ఆ తర్వాత దెయ్యాలతో తీసిన సినిమా.. ఇవ్వనీ కృతకంగా కనిపిస్తాయి. దెయ్యాలతో సినిమా తీయడం అనే పాయింట్‌ బాగున్నా అప్పటికే నీరసమైన సన్నివేశాలు చూసి ప్రేక్షకుడికి విసుగు వస్తుంది. అటు వినోదం, ఇటు హారర్‌ ఎలిమెంట్స్‌ రెండూ తెలిపోవడంతో ‘రా..రా’ దీనికి న్యాయం చేయలేకపోయింది. హాస్యనటులు ఎక్కువ మంది ఉండటం, శ్రీకాంత్‌ లాంటి కథానాయకుడు తొలిసారి హారర్‌ సినిమా తీయడం మాత్రమే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

నటీనటులు : తనను తాను నిరూపించుకోవడానికి గత చిత్రాల మాదిరిగానే ఈసినిమాలో కూడా శ్రీకాంత్‌ అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ సినిమాలో శ్రీకాంత్‌ తన నటనతో మెప్పించాడు. అయితే, ఆయనకు మాత్రం టైమ్‌ కలిసి రావడం లేదనే చెప్పాలి. ఇక నజియా, సీతా నారాయణలు కూడా తమ పరిధి మేరకు ప్రేక్షకులను అలరించారు. కమెడియన్స్‌గా నటించిన వేణు, పోసాని, రఘుబాబు, రఘు కార్మంచి, షకలక శంకర్‌, వేణు, పృథ్వీ, గెటప్‌ శ్రీను బాగానే నవ్వించారు. కథ, కథనాలు చాలా సాధారణంగా ఉన్నాయి. సాంకేతిక బృందం పనితీరు అలానే అనిపిస్తుంది. చందమామ పాట ఒకటి ఆకట్టుకునేలా ఉంది. ఆ పాటలో గ్రాఫిక్స్‌ కూడా నచ్చుతాయి. సినిమా అంతా అంతే శ్రద్ధతో కొనసాగి ఉంటే బాగుండేది.
ప్లస్‌ పాయింట్స్‌
శ్రీకాంత్‌ నటన
కామెడీ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌
కథలో సీరియస్‌నెస్‌ లేకపోవడం
అతికించినట్టు అనిపించే సీన్స్‌

Next Story