మానవజీవితంలో పుట్టుక ఎంత విలక్షణమైనదో పెళ్లి అంతే సలక్షణమైన ఘట్టం. సామాన్యుల నుంచి మాన్యుల వరకూ జీవితంలో వివాహం అనేది ఓ మధురజ్ఞాపకం. కొందరు ప్రేమ...
మానవజీవితంలో పుట్టుక ఎంత విలక్షణమైనదో పెళ్లి అంతే సలక్షణమైన ఘట్టం. సామాన్యుల నుంచి మాన్యుల వరకూ జీవితంలో వివాహం అనేది ఓ మధురజ్ఞాపకం. కొందరు ప్రేమ వివాహాలు చేసుకొంటే మరికొందరు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్లు చేసుకోడం సాధారణ విషయమే. అయితే క్రీడారంగంలో అహరహం శ్రమిస్తూ దేశకీర్తిప్రతిష్టలకోసం పాటుపడే క్రీడాకారులు సైతం పెళ్లికి ఏమాత్రం మినహాయింపు కాదు. దేశాలు, రాష్ట్రాలు, క్రీడలు, రంగాలకు అతీతంగా నిలిచిన క్రీడాప్రముఖుల ప్రేమాట పెళ్లిబాటపై స్పెషల్ స్టోరీ.
పెళ్లి రెండక్షరాల మాట మాత్రమే కాదు. ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాల అపూర్వకలయిక. మనిషి పుట్టుక కు మాత్రమే కాదు వివాహానికీ ఎంతో ప్రాధాన్యముంది. పెళ్ళంటే మూడుముళ్ళు ఏడడుగులు మాత్రమే కాదు. యువతీయువకులు వివాహబంధంతో ఒక్కటై జీవనయానం సాగించే మధురఘట్టం. కష్టసుఖాలను, ఆటుపోట్లను ఎదుర్కొంటూ సాగించే సాహసయానం. వివాహం మానవజీవితంలో మాత్రమే కాదు దేశం కోసం అహరహం శ్రమించే క్రీడాకారుల జీవితంలోనూ ఓ ప్రధాన భాగమే.
క్రీడలే ఆశగా, శ్వాసగా జీవితంగా భావించే క్రీడాకారులు సైతం ప్రేమకు, పెళ్లికి ఏమాత్రం అతీతులుకారు. పురుష, మహిళా క్రీడాకారులు కలసి సాధన చేయటం, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనటం మామూలు విషయమే. అయితే కలసి సాగించే ప్రయాణంలోనే ఒకరి భావాలు ఒకరికి నచ్చడం, భావోద్వేగాలను పంచుకోడం ద్వారా దగ్గరయ్యే క్రీడాకారులు లేకపోలేదు.
జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల మధ్య మాత్రమే కాదు వివిధ దేశాల క్రీడాకారుల మధ్య స్నేహం చిగురించడం అదికాస్త ప్రేమగా పెళ్లిగా మారిన సందర్భాలు ఉన్నాయి. క్రీడలకు మాత్రమే కాదు ప్రేమకు, పెళ్లికి హద్దులు, సరిహద్దులు లేవని కులాలు, మతాలు, భాషాభేదాలు అసలే లేవని తెలుగుతేజం, భారత గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ జీవితాన్ని చూస్తేనే తెలుస్తుంది. అంతర్జాతీయ చదరంగ పోటీలలో పాల్గొనే సమయంలో పరిచయమైన సెర్బియా గ్రాండ్ మాస్టర్ నదెద్జాను జీవితభాగస్వామిగా చేసుకోడమే కాదు తెలుగు సాంప్రదాయ వివాహం చేసుకోడం ద్వారా హరికృష్ణ ప్రేమకు, పెళ్లికి సరికొత్త నిర్వచనం చెప్పాడు.
జర్నలిస్ట్ గా మారిన భారత మాజీ చెస్ ప్లేయర్ నిఖిలేష్ సైతం కొలంబియా గ్రాండ్ మాస్టర్ ఏంజెలో కు తన ప్రేమను చాటి వేలికి ఉంగరం తొడగటం ద్వారా సంచలనం సృష్టించాడు. చదరంగ క్రీడకు చెందిన ఈ రెండుజంటలను చూస్తే ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు భారత బ్యాడ్మింటన్ క్రీడలోనూ మనకు ప్రేమజంటలు ఎక్కువగానే కనిపిస్తాయి. ప్రేమను వివాహబంధంగా మార్చుకొన్నవారే అధికంగా ఉన్నారు.
ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్, భారత ప్రస్తుత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాజీ ఒలింపియన్ పీవీవీ లక్ష్మిని తన జీవితభాగస్వామిగా చేసుకొని ఇద్దరు బిడ్డలతో పండంటి కాపురానికి యజమానిగా మారాడు. మహిళా డబుల్స్ స్పెషలిస్ట్ గుత్తా జ్వాల- సింగిల్స్ విజేత చేతన్ ఆనంద్ ల బంధం పెళ్లి వరకూ వెళ్ళినా చివరకు లవ్ ఆల్ గానే ముగిసిపోయింది. మరో డబుల్స్ స్పెషలిస్ట్ సిక్కీ రెడ్డి సైతం పురుషుల డబుల్స్ ఆటగాడు సుమీత్ రెడ్డిని వివాహమాడి తన పతకాల వేటను విజయవంతంగా కొనసాగిస్తోంది. గత పదేళ్లుగా ప్రేమలో ఉన్న మరో బ్యాడ్మింటన్ జోడీ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ సైతం వివాహబంధంతో ఒక్కటయ్యారు.
జాతీయ క్రీడ హాకీ, అథ్లెటిక్స్ అంశాలలో సైతం మనకు ప్రేమజంటలు కనిపిస్తాయి. ప్రేమను పెళ్లిగా మార్చుకొని హాయిగా జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. ట్రిపుల్ ఒలింపియన్, భారత హాకీ మాజీ కెప్టెన్ ముఖేశ్ కుమార్ ఉత్తరప్రదేశ్ కు చెందిన మహిళా హాకీ ప్లేయర్ నిధి ఖుల్లర్ ను పెళ్ళాడి సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. మహిళల లాంగ్ జంప్ లో ప్రపంచ కాంస్య విజేత అంజూ సైతం సహ అథ్లెట్ బాబీనే వివాహం చేసుకొని ఎన్నో విజయాలను సొంతం చేసుకోగలిగింది.
భారత అనధికారిక జాతీయక్రీడ క్రికెట్ ను చూస్తే క్రికెట్ స్టార్లకు సినీహీరోయిన్లతో ప్రేమ పెళ్లి ఎక్కువగా కనిపిస్తాయి. నాటితరం పటౌడీ నుంచి నేటితరం విరాట్ కొహ్లీ వరకూ సినిమా, క్రీడారంగాల కలయికే కనిపిస్తుంది. భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ ఆరోజుల్లోనే బాలీవుడ్ హీరోయిన్ షర్మిలా ఠాగోర్ ను జీవితభాగస్వామిగా చేసుకొన్నారు. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కొహ్లీ బాలీవుడ్ భామ అనుష్కశర్మను పెళ్ళాడి తన జీవితాన్ని సాఫల్యం చేసుకొన్నాడు. భారత లంబూ ఫాస్ట్ బౌలర్ , ఆరున్నర అడుగుల ఇశాంత్ శర్మ సైతం ఆరడుగుల భారత బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిమాసింగ్ ను తన అర్ధాంగిగా చేసుకొని వావ్ అనిపించాడు. టేబుల్ టెన్నిస్, కుస్తీ లాంటి క్రీడల్లోనూ ప్రేమజంటలు అత్యంత అరుదుగా కనిపిస్తాయి. ఇదంతా చూస్తుంటే డాక్టర్లను డాక్టర్లు, యాక్టర్లను యాక్టర్లు పెళ్లాడటం ఎంత సహజమో క్రీడాకారులను క్రీడాకారులు జీవితభాగస్వాములుగా చేసుకోడం అంతే సహజమని ప్రత్యేకంగా చెప్పాలా మరి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire