logo
జాతీయం

రాష్ట్రపతి దంపతులకు గుడిలో అవమానం...!

రాష్ట్రపతి దంపతులకు గుడిలో అవమానం...!
X
Highlights

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన సతీమణి సవిత పట్ల పూరీ జగన్నాథ ఆలయ సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన ఘటన...

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన సతీమణి సవిత పట్ల పూరీ జగన్నాథ ఆలయ సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడునెలల క్రితం కోవింద్ దంపతులు ఆలయాన్ని దర్శించినప్పుడు అక్కడ ఆలయ విధుల్లో ఉన్న ఆలయ సేవకులు కొందరు వారిని నెట్టివేసినట్లు వచ్చిన వార్తలపై పూరీ జిల్లా యంత్రాంగం బుధవారం విచారణ చేపట్టింది. మార్చి 18న రాష్ట్రపతి కోవింద్ దంపతులు పూరీ జగన్నాథ ఆలయ దర్శనానికి వెళ్లారు. గర్భగుడి సమీపంలో కొందరు ఆలయ సేవకులు రాష్ట్రపతి మార్గాన్ని అడ్డుకుని, దేశ ప్రథమ మహిళను ముందుకు నెట్టారు. ఈ ఘటనపై మార్చి 19న రాష్ట్రపతి భవన్ అధికారులు పూరీ జిల్లా కలెక్టర్ అరవింద్ అగర్వాల్‌కు సమాచారం అందించారు. దీనిపై మార్చి 20న అధికారులు జగన్నాథ ఆలయ నిర్వాహకుల (ఎస్‌జీటీఏ) సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశం మినిట్స్ వివరాలు తాజాగా బయటకురావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన రోజు ప్రముఖుల దర్శనానికి ఇబ్బంది కలుగకుండా రోజువారీ భక్తులను ఉదయం 6.35 గంటల నుంచి 8.40 వరకూ శ్రీవారి దర్శనానికి అనుమతించలేదు. కోవింద్, ఆయన సతీమణితో పాటు కొందరు సర్వెటర్లు, ప్రభుత్వ అధికారులను మాత్రమే గుడిలోకి అనుమతించారు. ఆలయం లోపల చాంబర్‌లో ఉండే రత్నసింహాసనాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రపతి వెళ్లినప్పుడు సర్వెటర్ ఒకరు ఆయనకు చోటు కేటాయించలేదని, ఇతర దేవతా విగ్రహాలను దర్శించుకునేందుకు రాష్ట్రపతి దంపతులు వెళ్లినప్పుడు వారిని నెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు సెర్విటర్లకు నోటీసులు పంపాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు.

రాష్ట్రపతి దంపతులకు చేదు అనుభవం ఎదురైందన్న వార్తలపై కాంగ్రెస్ నేత సురేష్ కుమార్ రౌత్రే ఘాటుగా స్పందించారు. ఇంత ఇబ్బందికర వాతావరణం ఎందుకు తలెత్తిందో అర్ధం కావడం లేదని, జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. ఇంతవరకూ సాధారణ భక్తులే సెర్విటర్లు పెట్టే ఇబ్బందులకు గురవుతుండగా, ఇప్పుడు రాష్ట్రపతి, ఆయన కుటుంబాన్ని కూడా వాళ్లు ఇబ్బందులకు గురిచేసినట్టు కనిపిస్తోందని అన్నారు. కాగా, రాష్ట్రపతి, ఆయన సతీమణి ఆలయం లోపల కొంత ఇబ్బందికి గురైనట్టు ఎస్‌జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్, ఐఏఎస్ అధికారి ప్రదీప్తా కుమార్ మొహాపాత్ర అంగీకరించారు. ఈ విషయాన్ని ఆలయ మేనేజింగ్ కమిటీతో కొద్ది రోజుల క్రితమే సంప్రదించామని, ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని ఆయన చెప్పారు. కలెక్టర్ విచారణ చేపట్టారని, ఆలయం యంత్రాంగం కూడా దర్యాప్తు జరుపుతోందని రాజ్యసభ ఎంపీ, బీజేడీ ప్రతినిధి ప్రతాజ్ కేశరి దేవ్ తెలిపారు. కాగా, దీనిపై స్పందించేందుకు కలెక్టర్ అగర్వాల్ మాత్రం అందుబాటులోకి రాలేదు. టెంపుల్ సర్విటర్ల దురుసు ప్రవర్తనపై సుప్రీంకోర్టు సైతం ఈనెల 8న తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ భక్తులు ఎలాంటి వేధింపులకూ గురికాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Next Story