logo
సినిమా

బిగ్ బి బండారం త్వరలోనే బయటకు..: సప్నా భవ్నానీ

బిగ్ బి బండారం త్వరలోనే బయటకు..: సప్నా భవ్నానీ
X
Highlights

హాలీవుడ్ లో లైంగిక వేధింపులపై మొదలైన ‘మీ టూ’ ఉద్యమం భారత్ లో అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ఎంతో మంది ప్రముఖలు...

హాలీవుడ్ లో లైంగిక వేధింపులపై మొదలైన ‘మీ టూ’ ఉద్యమం భారత్ లో అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ఎంతో మంది ప్రముఖలు పేర్లు మీటూ వ్యవహారంలో బయటకు వస్తుండటం, ఇది ఉద్యమ రూపం దాల్చడంతో ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఆరోపణలపై నలుగురు రిటైర్డ్ జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం రెడీ అయినట్టు కేంద్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్పష్టం చేశారు. మీటూ వ్యవహారంలో నమోదయ్యే కేసులన్నింటినీ కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు.

మీటూ వ్యవహారం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. అన్ని రంగాలను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, గేయ రచయిత వైరముత్తు, నవలా రచయిత చేతన్ భగత్, టాటా మోటార్స్ ఉన్నతాధికారి సురేశ్ రంగరాజన్, దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ పలువురు మహిళలు బయటికొచ్చారు. ఈ నేపథ్యంలో అన్ని వైపుల నుంచి విమర్శలు పోటెత్తడంతో కేంద్రం దిగొచ్చింది.

పని ప్రదేశాల్లోమహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మీటూ పేరుతో బాహాటంగా వెల్లడిస్తున్న క్రమంలో కేంద్రం స్పందించింది. ఈ తరహా లైంగిక దాడులు, వేధింపుల కేసులన్నింటిపైనా బహిరంగ విచారణకు పదవీవిరమణ చేసిన నలుగురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమిస్తుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ పేర్కొన్నారు. మీటూ క్యాంపెయిన్‌ ద్వారా మహిళలు తమపై జరిగిన నేరాలపై ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారని ఇటీవల కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.

పది, పదిహేనేళ్ల తర్వాత సైతం లైంగిక వేధింపుల ఫిర్యాదులను అనుమతించాలన్నారు మేనకా గాంధీ. లైంగిక వేధింపులకు ఎవరు పాల్పడ్డారనేది బాధితులకు తెలుస్తుందని అందుకే తాము ఫిర్యాదులకు ఎలాంటి కాలపరిమితి ఉండరాదని న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాశామని మంత్రి తెలిపారు. బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ పదేళ్ల కిందట ఓ సినిమా సెట్‌లో తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఊపందుకుంది.

మరోవైపు ‘మీటూ’ ఉద్యమం గురించి ఇటీవల ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని అది మనసుని కలచి వేస్తోందని ఆయన ఇంటర్వ్యూలో తెలిపారు. దీనిపై ప్రముఖ సెలబ్రిటీ హెయిర్‌ స్టయిలిస్ట్‌ సప్నా భవ్నానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో మీ నిజాలు బయటపడతాయి. నా ట్వీట్‌ చదివి మీరు కంగారులో చేతులు కొరుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే కొరుక్కోవడానికి మీకున్న గోళ్లు సరిపోవు’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. అమితాబ్‌ గురించి సప్నా ఏ నిజం బయటపెడుతుంది? అసలేం జరిగింది ఉంటుదంటూ నెటిజన్లు సప్నాకు మెసేజ్‌లు పెడుతున్నారు.

అయితే, నిజాయతీగా కొనసాగితే ‘మీ టూ’ ఉద్యమాన్ని స్వాగతిస్తానని ప్రముఖ నటుడు కమలహాసన్ పేర్కొన్నారు. లైంగిక వేధింపుల విషయాల్లో బాధితురాలే ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడాలి తప్ప, దీంతో సంబంధం లేని మూడో వ్యక్తి దానిపై కామెంట్ చేయకూడదని అభిప్రాయపడ్డారు. అలాగే, 'మీ టూ' ప్రచారంపై తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెదవి విప్పారు. 'నిజం బిగ్గరగా, చాలా స్పష్టంగా చెప్పండి' అంటూ రాహుల్ ఓ ట్వీట్‌లో 'మీ టూ' ఉద్యమానికి మద్దతిచ్చారు.

మొత్తానికి మీ టూ ఉద్యమం ఇప్పుడు హీటెక్కింది. సీనియర్ జర్నలిస్టులతో సహా సుమారు 10 మంది మహిళా జర్నలిస్టులు కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం, మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో 'మీ టూ'కు రాహుల్ సమర్ధనగా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Next Story