రైతులకు ఎన్నికల కోడ్ కష్టాలు...అన్నదాతలకు పంటసాయం బంద్‌

రైతులకు ఎన్నికల కోడ్ కష్టాలు...అన్నదాతలకు పంటసాయం బంద్‌
x
Highlights

రైతులకు ఎన్నికల కోడ్ కష్టాలు వచ్చాయి. ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో దాదాపు ఐదు లక్షల మంది అన్నదాతలకు రైతుబంధు పథకం కింద అందాల్సిన పంట సాయం...

రైతులకు ఎన్నికల కోడ్ కష్టాలు వచ్చాయి. ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో దాదాపు ఐదు లక్షల మంది అన్నదాతలకు రైతుబంధు పథకం కింద అందాల్సిన పంట సాయం ఆగిపోయింది. పట్టాదారు పాసు పుస్తకాలు అందకపోవడంతో 3 లక్షలమందికి నగదు బదిలీ నిలచిపోగా కొత్త లబ్ధిదారులను చేర్చవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో 2 లక్షల మంది కొత్తవారిని పక్కనపెట్టారు. వీరందరికీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పంట సాయం అదని పరిస్థితి నెలకొంది.

గత ఖరీఫ్ సీజన్‌లో రైతుబంధు పథకం కింద ఎకరాకు నాలుగు వేల చొప్పున ప్రభుత్వం చెక్కులు అందచేయగా ఈసారి బ్యాంకు ఖాతాల ద్వారా నగదు బదిలీ చేయలని ఎన్నికల సంఘం ఆదేశించడం రైతులకు శాపంగా మారింది. గత సీజన్‌లో పట్టాదారు పాసు పుస్తకాలు అందని వారికి కూడా అధికారులు చెక్కులు అందచేశారు. అయితే ఇప్పటికీ 2.90 లక్షల మందికి పాసుపుస్తకాలు అందలేదు. బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ కావాలంటే పట్టాదారు పాసు పుస్తకాలు తప్పనిపరి కావడంతో 2.90 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో పంట సాయం డబ్బు జమ కాలేదు. దీంతో వీరంతా వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గత ఖరీఫ్‌లో చెక్కు ఇచ్చి రబీలో ఎందుకు నగదు జమ చేయరంటూ నిలదీస్తున్నారు.

ప్రస్తుత రబీలో రైతుబంధు నగదు బదిలీ కావాలంటే అన్నదాత దగ్గర పట్టాదారు పాసుపుస్తకం తప్పనిపరి, లేదంటే తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం అయినా చేసి ఉండాలనే నిబంధనను వ్యవసాయశాఖ అమలు చేస్తోంది. పాసుపుస్తకం , డిజిటల్‌ సంతకం లేనివారికి భూమి యజమాని ధ్రువీకరణ పత్రాన్ని తహసీల్దార్లు అందచేయాలని వ్యవసాయశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే తహసీల్దార్లు ఎన్నికల పనులు పనుల్లో బిజీగా ఉండడంతో రైతులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలేదు. దీంతో కొందరు రైతులు తహసీల్దార్ కార్యాలయాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు.

అంతేకాదు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో రైతుబంధు పథకంలో కొత్త లబ్ధిదారులను చేర్చవద్దని ఈసీ ఆదేశించింది. దీంతో ఈసారైనా తమకు పంటసాయం డబ్బు అందుతుందని ఆశగా చూస్తున్న అన్నదాతలకు ఆ అవకాశం లేకుండా పోయింది. మొత్తం 2 లక్షల మందికి కొత్త రైతులను వ్యవపాయ శాఖ పక్కనపెట్టింది. ఇలా మొత్తం 4.90 లక్షల మంది రైతులకు 4 వేల చొప్పున నగదు బదిలీ నిలిచిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories