Top
logo

పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్

పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్
X
Highlights

పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్. పిల్లలు మోసే బ్యాగుల బరువు తలుచుకుని బాధపడే తల్లిదండ్రులకు కూడా శుభవార్త....

పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్. పిల్లలు మోసే బ్యాగుల బరువు తలుచుకుని బాధపడే తల్లిదండ్రులకు కూడా శుభవార్త. పిల్లల పుస్తకాల బరువు తగ్గించే దిశగా కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. స్కూలు బ్యాగుల మోత పరిమితి తగ్గిస్తూ సర్క్యులర్‌ లో జారీ చేసింది. అంతేకాదు 1, 2వ తరగతుల చిన్నారులకు హోంవర్క్‌ ఇవ్వొద్దని కూడా మానవ వనరుల అభివృద్ధి శాఖ స్పష్టం చేసింది.

1, 2 తరగతులకు 1.5 కిలోలు...3, 5 తరగతులకు 2 నుంచి 3 కేజీలు...3 : 10 వ తరగతికి 5 కిలోలు...ఇప్పుడు చెప్పిన లెక్కలన్నీ స్కూలు బ్యాగు బరువుకు సంబంధించినవి. అవును చిన్నారులపై స్కూలు బ్యాగుల మోత తగ్గించే దిశగా కేంద్ర మానవ వనరుల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూలు బ్యాగుల బరువుకు పరిమితి విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఒకటి, రెండో తరగతి విద్యార్థుల బ్యాగు బరువు కిలోన్నర లోపు మాత్రమే ఉండాలని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. అలాగే 3 నుంచి 5 తరగతి వరకు 2 నుంచి 3 కిలోలు, 6, 7 తరగతులకు 4 కిలోలు, 8, 9 తరగతులకు 4.5 కిలోలు, పదో తరగతి విద్యార్థులకు 5 కేజీల కంటే ఎక్కువ బరువు ఉండకూడదని స్పష్టమైన ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

స్కూలు బాగుల బరువు తగ్గించడమేకాదు చిన్నారులపై ఒత్తిడి తగ్గించే చర్యలు చేపట్టారు. ఒకటి, రెండో తరగతుల విద్యార్థులకు ఎలాంటి హోంవర్క్‌ ఇవ్వొద్దని కూడా హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ స్పష్టంగా చెప్పింది. అసలు క్లాస్ 1, 2 విద్యార్థులకు భాషలకు సంబంధించిన సబ్జెక్ట్‌తో పాటు లెక్కలు మాత్రమే బోధించాలని తేల్చి చెప్పింది. అలాగే మూడు నుంచి ఐదో తరగతి వరు భాషలకు సంబంధించిన సబ్జెక్టులతో పాటు సైన్స్ , మ్యాధ్స్ సబ్జెక్టులు ఉండాలని కేంద్ర మానవ వనరుల శాఖ తాజా సర్క్యులర్‌లో చెప్పింది. అంతేకాదు అదనపు పుస్తకాలు, ఇతర మెటీరియల్ తీసుకురావాల్సిందిగా పిల్లలపై ఒత్తిడి తీసుకు రాకూడదని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని పాఠశాలలు హోంవర్క్, స్కూల్ బ్యాగుల బరువుకు సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలని ఆదేశించింది.

2015లో కూడా బ్యాగుల బరువు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. అయితే ఈ ఆదేశాలు అమలుకాలేదు. కానీ గత మేలో మద్రాస్ హైకోర్టు పాఠశాల విద్యార్థుల బ్యాగుల బరువు నియంత్రణపై ఆదేశాలు జారీచేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ స్కూలు బ్యాగుల బరువు తగ్గించే చర్యలు చేపట్టింది.

Next Story