భారత క్రికెట్లో వండర్ కోచ్, థండర్ కెప్టెన్

Highlights

భారత క్రికెట్లో విజయాలపర్వం కొనసాగుతోంది. రవి శాస్త్రి చీఫ్ కోచ్ గా, విరాట్ కొహ్లీ కెప్టెన్ గా టీమిండియా అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. భారత...

భారత క్రికెట్లో విజయాలపర్వం కొనసాగుతోంది. రవి శాస్త్రి చీఫ్ కోచ్ గా, విరాట్ కొహ్లీ కెప్టెన్ గా టీమిండియా అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడుగా రవి శాస్త్రి బాధ్యతలు చేపట్టడంతోనే విరాట్ కొహ్లీలోని అసలైన కెప్టెన్, సిసలైన బ్యాట్స్ మన్ బయటకు వచ్చాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అహో గురు ఒహో శిష్యా అనిపించుకొంటున్న రవిశాస్త్రి- విరాట్ కొహ్లీ పార్ట్నర్ షిప్ పై హెచ్ఏంటీవీ స్పెషల్ ఫోకస్.

జెంటిల్మన్ గేమ్ క్రికెట్లో విజయాలు సాధించాలంటే కుదురైన భాగస్వామ్యాలు అవసరం. బ్యాటింగైనా బౌలింగైనా పార్ట్నర్ షిప్ లు ఎంతో కీలకం అంతేకాదు జట్టును విజయపథంలో నడపాలంటే టీమ్ చీఫ్ కోచ్, కెప్టెన్ల మధ్య చక్కటి అవగాహన స్ఫూర్తిమంతమైన భాగస్వామ్యం అవసరం. ప్రస్తుత టీమిండియా విజయపరంపరను ప్రధానంగా కెప్టెన్ విరాట్ కొహ్లీ ఆటతీరు చూస్తుంటే జట్టు వెనుకా మనకు ఓ చక్కటి భాగస్వామ్యం కనిపిస్తుంది.

ఆధునిక క్రికెట్ గురించి సంపూర్ణ అవగాహన, గొప్ప వ్యూహచతురత కలిగిన మాజీ కెప్టెన్, విఖ్యాత కామెంటీటర్ రవిశాస్త్రి టీమిండియా చీఫ్ కోచ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత నుంచి జట్టు ఆటతీరు మాత్రమే కాదు నాయకుడు విరాట్ కొహ్లీ ఆటతీరు సైతం అత్యుత్తమ స్థాయికి చేరింది. రవిశాస్త్రి కోచ్ గా, కొహ్లీ కెప్టెన్ గా టీమిండియా ఆడిన 24 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా, ప్రీమియర్ బ్యాట్స్ మన్ గా విరాట్ గణాంకాలు చూస్తేనే ఎంత విజయవంతమైన భాగస్వామ్యమో మరి చెప్పాల్సిన పనిలేదు.

రవిశాస్త్రి నేతృత్వంలో టీమిండియా సారథిగా విరాట్ కొహ్లీ మొత్తం 24 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. ఇందులో ఐదుటెస్టులు, 13 వన్డేలు, ఆరు టీ-20 మ్యాచ్ లు ఉన్నాయి. వ్యక్తిగతంగా విరాట్ కొహ్లీ రికార్డు చూస్తే మొత్తం 1459 పరుగులు సాధించాడు. 213 పరుగుల అత్యధిక స్కోరుతో మొత్తం ఏడు శతకాలు బాదాడు. అంతేకాదు రికార్డుస్థాయిలో 72.95 సగటు సైతం నమోదు చేశాడు. శ్రీలంకతో ముగిసిన నాగపూర్ టెస్టులో విరాట్ కొహ్లీ 213 పరుగులతో చెలరేగిపోయాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సైతం సొంతం చేసుకొన్నాడు.

రవిశాస్త్రి ఆలోచనలు, తన ఆలోచనలు ఒక్కటే కావడం విరాట్ కొహ్లీ అసాధారణ స్థాయిలో రాణించడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ ఇద్దరి భాగస్వామ్యంలో టీమిండియా ఇప్పటి వరకూ 19 విజయాలు సాధించడమే కాదు నాలుగు పరాజయాలు చవిచూసింది. రవిశాస్త్రి- విరాట్ కొహ్లీల భాగస్వామ్యంలో విజయాల శాతం 79.16 ఉందంటే వావ్ అనుకోవాల్సిందే మరి. స్వదేశీ సిరీస్ లతో పాటు శ్రీలంక లాంటి బలహీనమైన జట్ల పైన మాత్రమే టీమిండియా ఇప్పటి వరకూ విజయాలు సాధిస్తూ వచ్చింది. అయితే 2018 సీజన్ నుంచి సౌతాఫ్రికా పర్యటనలో నేలవిడిచి సాము చేయటానికి రవి శాస్త్రి- విరాట్ కొహ్లీ టీమ్ కసరత్తులు చేస్తోంది. ఇప్పటి వరకూ ఇంటమాత్రమే గెలుస్తూ వచ్చిన టీమిండియా ఇక రచ్చ కూడా గెలవాలని టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని కాపాడుకోవాలని కోరుకొందాం.

Show Full Article
Print Article
Next Story
More Stories