సంచలనం సృష్టిస్తున్న వర్మ లెటర్

సంచలనం సృష్టిస్తున్న వర్మ లెటర్
x
Highlights

అందాల నటి శ్రీదేవి మరణవార్త విన్నప్పటి నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఆవేదనను ట్వీట్స్, ఫేస్‌బుక్ పోస్టుల ద్వారా ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూనే...

అందాల నటి శ్రీదేవి మరణవార్త విన్నప్పటి నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఆవేదనను ట్వీట్స్, ఫేస్‌బుక్ పోస్టుల ద్వారా ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. శ్రీదేవి మ‌ర‌ణం వ‌ర్మని ఎంత‌గా క‌లిచి వేస్తుందో అవి కళ్లకు కడుతున్నాయి. తాజాగా, ‘శ్రీదేవి అభిమానులకు నా ప్రేమలేఖ’ పేరిట ఫేస్ బుక్‌‌లో వర్మ ఓ సంచలన పోస్ట్ చేశాడు. అందులో శ్రీదేవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు రహస్యాలను ప్రస్తావించాడు. ఈ లేఖను బయటపెట్టాలా? వద్దా? అని తనలో తాను ఎంతో మధనపడ్డానని, ఎందుకంటే, కొన్ని పేర్లను బయటపెట్టాల్సి వస్తోందని వర్మ తెలిపాడు. ఎందరో అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి కొందరికి మాత్రమే సొంతం కాదని బలంగా నమ్మానని, అందుకే ఆమె అభిమానులందరూ వాస్తవాలు తెలుసుకొనాల్సి ఉందని వర్మ తన లేఖలో చెప్పారు.

శ్రీదేవి అంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పిచ్చి ఆరాధన. తన దేవత మరణాన్ని వర్మ తట్టుకోలేక పోతున్నారు. శ్రీదేవి మృతికి బాధపడుతూ వర్మ ట్వీట్లు పెట్టాడు. తాజాగా మై లవ్ లెటర్ టు శ్రీదేవి ఫ్యాన్స్ అని ఆయన ఫేస్ బుక్‌లో ఓ లేఖను విడుదల చేశాడు. అందులో పలు సంచలన విషయాలు ఇలా ఉన్నాయి. కోట్లాది మీలాంటి అభిమానులు నమ్మినట్టే ఆమె ఎంతో అందమైన, ఆకర్షణీయమైన మహిళ అని నేను కూడా ఎప్పటికీ నమ్ముతాను. ఆమె ఈ దేశంలో అతిపెద్ద సూపర్ స్టార్ అని, 20 ఏళ్ల పాటు సిల్వర్ స్క్రీన్‌ను రారాణి లాగా ఏలిందని మనందరికి తెలుసు. అయితే అదంతా కథలో ఓ భాగం మాత్రమే. శ్రీదేవి మరణం నాకు ఎంత దిగ్భ్రాంతి, ఆవేదన కలిగించినా చావుపుట్టుకలు ఎంత అనూహ్యంగా, క్రూరంగా, సున్నితంగా, మిస్టీరియస్‌గా ఉంటాయనే ఒక దుర్మార్గమైన సత్యాన్ని మరోసారి గుర్తు చేసింది.

ఆమె మరణం తర్వాత మీ అందరి కంటే ఎక్కువగా నేను ఎన్నో విషయాలు చెప్పాలి. ఇప్పుడు చాలా మంది చెబుతున్నట్లు ఆమె ఎంత అందమైనది, ఎంత గొప్ప నటి, ఆమె మరణం తమకు వ్యక్తిగతంగా ఎంత నష్టమని భావిస్తున్నది, శ్రద్ధాంజలుల వంటివి నేను చెప్పను. ఎందుకంటే క్షణక్షణం, గోవిందా గోవిందా చిత్రాలు తీసేటపుడు ఆమెను దగ్గర నుంచి చూసి పరిశీలించే అవకాశం నాకు లభించింది. సెలబ్రిటీల వాస్తవ వ్యక్తిగత జీవితం మిగతా ప్రపంచం చూసే జీవితానికి పూర్తిగా భిన్నమైందని చెప్పడానికి శ్రీదేవి జీవితమే చక్కని ఉదాహరణ అనిపించింది.

చాలా మందికి శ్రీదేవి జీవితం అన్ని రకాలుగా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. అందమైన మొహం, గొప్ప ప్రతిభ, ఇద్దరు అందమైన కూతుళ్లతో చక్కని కుటుంబం. బయటి నుంచి చూసేవాళ్లు అసూయపడి తమకూ ఇలాంటి జీవితమే కావాలని కోరుకొనే జీవితం. కానీ ఒక వ్యక్తిగా శ్రీదేవి ఆనందంగా ఉందా? ఆమె సంతోషకరంగా జీవితాన్ని గడిపిందా?

ఆమెను కలిసినప్పటి నుంచి ఆమె జీవితం ఏంటో నాకు తెలుసు. ఆమె తండ్రి మరణించనంత వరకు ఆకాశంలో ఎగిరే పక్షిలా స్వేచ్ఛగా గడిచిన ఆమె జీవితం, తల్లి అతి జాగ్రత్త కారణంగా పంజరంలో బందీ కావడం నేను నా కళ్లారా చూశాను. ఆ రోజుల్లో క‌థానాయిక‌ల‌కు బ్లాక్ మ‌నీ రూపంలోనే నిర్మాత‌లు చెల్లింపులు చేసేవారు. ఇన్‌కం ట్యాక్స్ రెయిడ్స్ భయంతో శ్రీ‌దేవి తండ్రి తన బంధుమిత్రుల్ని న‌మ్మి ఆస్తుల విష‌యంలో సంబంధాలు పెట్టుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత వారంతా శ్రీదేవిని మోసం చేశారు. దానికి తోడు శ్రీదేవి తల్లి అమాయకంగా చట్టపరమైన చిక్కులున్న ఆస్తుల్లో తప్పుగా పెట్టుబడులు పెట్టడం కూడా దెబ్బ కొట్టింది. ఇవన్నీ కలిసి శ్రీదేవి జీవితంలోకి బోనీ కపూర్ వచ్చేనాటికి ఆమెది దాదాపుగా చేతిలో చిల్లిగవ్వ కూడా లేని దీన స్థితి.

స్వయంగా అతనే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడు. అప్పుడు అతను చేసిందల్లా ఒకదాని వెంట ఒకటిగా వచ్చిపడుతున్న కష్టాలతో ఏడ్చే ఆమెకు ఓదార్పుగా నిలవడం మాత్రమే. అమెరికాలో శ్రీ‌దేవి త‌ల్లికి రాంగ్ సైడ్ బ్రెయిన్‌ స‌ర్జరీ చేయ‌డం వ‌ల్ల ఆమె మ‌తిస్థిమితం కోల్పోయారు. అదే సమయంలో శ్రీదేవి చెల్లెలు శ్రీలత ఓ పొరుగింటి అబ్బాయితో లేచిపోయి పెళ్లి చేసుకుంది. చనిపోవడానికి ముందు రాజేశ్వరి ఆస్తులన్నిటిని శ్రీదేవి పేరు మీద మార్పించారు. మానసిక స్థితి సరిగా లేని తన తల్లితో శ్రీదేవి వీలునామా రాయించుకుందని శ్రీలత కోర్టులో కేసు పెట్టింది.

అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆరాధించే మహిళ.. నిజజీవితంలో చేతిలో రూపాయైనా లేని ఏకాకిగా మిగిలింది. అప్పుడు ఆమె వెంట ఉన్నదల్లా బోనీ కపూర్ మాత్రమే. తమ కుటుంబంలో చిచ్చు పెడుతోందని బోనీ తల్లి రోడ్డెక్కింది. బోనీ మొదటి భార్య మోనా కాపురంలో నిప్పులు పోశావని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లాబీలో పబ్లిగ్గా అందరి ముందు కడుపులో గుద్దింది. ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’చిత్రీకరణ జరిపిన కొద్దిపాటి సమయంలో తప్ప శ్రీదేవికి ఎప్పుడూ నచ్చిన జీవితం లేదు. ఆమె ఎప్పుడూ జీవితం పట్ల అసంతృప్తితో రగిలిపోయిన మహిళ. భవిష్యత్తు గురించి అభద్రత, వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఊహించనిమలుపులు సూపర్ స్టార్ జీవితంలో చెరగని మచ్చలుగా మిగిలిపోయాయి. దాంతో సున్నిత మనస్కురాలైన శ్రీదేవికి ఎప్పుడూ మనశ్శాంతి అనేది లేకుండా పోయింది.
జీవితంలో ఆమె ఎన్నో గండాలు దాటాల్సి వచ్చింది. బాల నటిగా ఎంతో చిన్నవయసులో తెరపైకి రావడంతో కాలం ఆమెకు జీవితంలో సహజమైన వేగంతో ఎదిగే అవకాశం ఇవ్వలేదు. బయటి జీవితం నుంచి ప్రశాంతత కంటే ఎక్కువగా అంతర్గత మానసిక ఆందోళనలు వేధించేవి. దీంతో ఆమె తనను తాను గమనించుకోవడం తప్పనిసరిగా మారింది.

చాలా మందికి ఆమె అత్యంత అందమైన మహిళ. కానీ ఆమెకు ఆమె అందంగా కనిపించేదా? నిజమే కనిపించేది. కానీ ప్రతి నటికి వయసనేది ఓ పీడకల. ఆమె దానికి అతీతురాలేం కాదు. చాలా ఏళ్లుగా ఆమె తరచూ కాస్మెటిక్ సర్జరీలు చేయించుకొనేది. వాటి పర్యవసానాలు స్పష్టంగా కనిపించేవి.

ఆమె ఎప్పుడూ కొంచెం ముభావంగా ఉండేది. కానీ అది తనలో ఏం జరుగుతోందో ఎవరైనా గుర్తించేస్తారేమోననే భయం కారణంగా ఆమె తన చుట్టూ నిర్మించుకున్న ఓ సైకలాజికల్‌ గోడ కారణంగా వచ్చింది. తన అభద్రతలు ఎవరికైనా తెలిసిపోతాయేమోననే ఆందోళన ఆమెను ఎప్పుడూ వెంటాడుతుండేది. అయితే అది ఆమె తప్పు కాదు. చాలా చిన్న వయసులో సంపాదించుకున్న పేరుప్రతిష్ఠలు ఆమెకు స్వతంత్రంగా జీవించే అవకాశాన్ని ఇవ్వలేదు. వాస్తవానికి ఆమె చేయగలదు? ఏం చేయాలని కోరుకుంటోందనే విషయం ఆమెకే తెలియదు. మేకప్ వేసుకోవడం, తనది కాని జీవితం జీవించడం.. కెమెరా ముందే కాదు వెనక కూడా అదే పరిస్థితి. తన నిజమైన వ్యక్తిత్వాన్ని దాచేసుకొనేందుకు సైకలాజికల్ మేకప్ వేసుకొని తిరిగేది. ఆమె ఎప్పుడూ తన తల్లిదండ్రులు, బంధువులు, భర్త, పిల్లలకు అనుగుణంగా తనను తాను మలచుకొంది. చాలా మంది స్టార్ తల్లిదండ్రుల పిల్లల మాదిరిగా తన పిల్లలను అంగీకరిస్తారో లేదోననే భయం ఆమెను వెన్నాడింది.

శ్రీదేవి ఒక మహిళ శరీరంలో చిక్కుకొన్న పసిపిల్ల. వ్యక్తిగా సరళమైనదే. కానీ జీవితంలో ఎదురైన చేదు అనుభవాల కారణంగా ప్రతీది అనుమానించే స్వభావం. ఇది మంచి జోడి కాదు. ఆమె మరణంపై వస్తున్న ఊహాగానాలను పక్కనపెడితే నేను మిగతావారికి చెప్పినట్టు మాటవరసకు రెస్ట్ ఇన్ పీస్ అనను. ఎందుకంటే శ్రీదేవి తన జీవితంలో మరణించి చివరికి నిజంగానే ప్రశాంతంగా నిద్రిస్తుందనేది నా బలమైన నమ్మకం. నా వ్యక్తిగత అనుభవం మేరకు ఆమె ప్రశాంతంగా ఉండేది కెమెరా ముందు యాక్షన్ తర్వాత కట్ చెప్పడానికి ముందు మాత్రమే. ఎందుకంటే ఆ సమయంలో ఆమె అదే సమయంలో జీవితంలోని క్రూరమైన వాస్తవికతను మరచి తనదైన ఊహాలోకంలో విహరించే సమయం అదే. అందుకే ఇప్పటి నుంచి ఆమె ఎప్పటికీ ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె తనను బాధ కలిగించే వాటి నుంచి దూరంగా సుదూరంగా గడపనుంది.

రిప్ శ్రీదేవి, కానీ నీకు ఇంత బాధ కలిగించినందుకు ఈ ప్రపంచం ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేదని మాత్రం నేను నీకు హామీ ఇస్తున్నా. అభిమానులమైన మేము, నీ సన్నిహితులం నీకు ఎప్పుడూ బాధ కలిగించాం. చిన్ననాటి నుంచి మా కోసం నిన్ను కష్టపెట్టాం. కానీ నువ్వు మాత్రం మాకు ఆనందం, సంతోషాన్నిచ్చావ్. ఇది న్యాయం కాదని తెలుసు. కానీ ఇప్పుడు తెలుసుకొనే సరికి చాలా ఆలస్యమైంది. నువ్వో పక్షిలా మారి స్వర్గలోకంలో విహరిస్తున్నట్టు, కళ్లలో నిజమైన శాంతి, సంతోషాలతో తిరుగుతున్న దృశ్యాలను నేను చూడగలుగుతున్నాను. నాకు పునర్జన్మల మీద నమ్మకం లేదు. కానీ ఇప్పుడు వాటిని నిజంగా నమ్మాలనిపిస్తోంది. ఎందుకంటే నీ అభిమానులం వచ్చే జన్మలో మరోసారి నిన్ను చూడాలని కోరుకుంటున్నాం. అప్పుడైనా మేం మా అభిమానంలో కొన్ని మార్పులు చేసుకొని నిన్ను కోరుకొనే అర్హత సాధించాలని భావిస్తున్నాను. మాకు మరొక్క అవకాశాన్నివ్వు శ్రీదేవి ఎందుకంటే మేమందరం నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాం. ఇలా నేను ఎంతైనా రాస్తూ ఉండగలను. కానీ నా కన్నీళ్లను మాత్రం ఆపుకోలేకపోతున్నాను-ఆర్జీవీ.

Show Full Article
Print Article
Next Story
More Stories