logo
జాతీయం

సరికొత్త వివాదంలో రాహుల్‌గాంధీ

Highlights

కాంగ్రెస్‌ యువసారథి రాహుల్‌గాంధీ సరికొత్త వివాదంలో ఇరుక్కున్నారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రఖ్యాత...

కాంగ్రెస్‌ యువసారథి రాహుల్‌గాంధీ సరికొత్త వివాదంలో ఇరుక్కున్నారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రఖ్యాత సోమ్‌నాథుడి దర్శనంతో మతపరమైన చర్చకు తనకు తానే దారేసుకున్నాడు. దర్శనానికి ముందు నాన్‌హిందూ రిజిస్టర్‌లో సంతకం చేయడంతో తనకు తానే స్వయంగా తాను హిందువుడిని కాదంటూ ప్రకటించుకున్నారు.

రాహుల్‌గాంధీ మరోసారి వివాదాల్లోకెక్కారు. గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ దేవాలయ దర్శనంలో భాగంగా తాను హిందువుడిని కానంటూ ఒక్క సంతకంతో తేల్చేశారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్‌నాథ్ దేవాలయంలో కూడా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయంలోని నాన్ హిందూ రిజిస్టర్‌లో తాను హిందువుణ్ని కాదంటూ సంతకం చేశారు.

నిబంధనల ప్రకారం హిందువులు కానివారు సోమ్‌నాథ్ దేవాలయాన్ని సందర్శించినపుడు, ఎంట్రీ రిజిస్టర్‌లో సంతకం చేయాలి. అది రూల్‌. అంటే తాను ఏ మతం వాడో రిజిస్టర్‌లో సంతకం చేసి ప్రకటించుకోవాలి. కానీ రాహుల్‌ తాను హిందువుణ‌్ని కాదంటూ నాన్‌ హిందూ రిజిస్టర్‌లో సంతకం చేయడంతో వివాదం రాజుకుంది.

గతంలో రాహుల్‌గాంధీ తాను హిందూ బ్రాహ్మణుడనని ప్రకటించారు. తాను భగవద్గీత చదువుతానని, శివభక్తుడినని చెప్పారు. తాజాగా ఆయన నాన్ హిందువునంటూ సంతకం చేయడంతో బీజేపీ ఆయనను వివరణ కోరింది. తాను హిందూ బ్రాహ్మణుడినని ఎందుకు చెప్పారో వివరించాలని డిమాండ్ చేసింది. అదే సమయంలో బీజేపీ ఎదురుదాడికి దిగింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి రాహుల్ గాంధీ కేథలిక్ అంటూ ఆరోపణలు గుప్పించారు.

గుజరాత్‌లోని మోర్బీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ... సోమ్‌నాథ్ దేవాలయం చరిత్రను చెప్పారు. తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ సోమ్‌నాథ్‌ దేవాలయం పునరుద్ధరణను వ్యతిరేకించారని గుర్తు చేశారు. కానీ సర్దార్‌పటేల్‌ ముందుండి సోమ్‌నాథ్‌ దేవాలయాన్ని పునరుద్ధరించారని, మొదటి నుంచి గుజరాత్‌పై కాంగ్రెస్‌కు సవతితల్లి ప్రేమేనని మోడీ మండిపడ్డారు.

Next Story