పోలీసుల దాష్టీకం.. కారుకు రక్తపు మరకలంటుతాయని..!

x
Highlights

పోలీసుల నిర్లక్ష్యంగా కారణంగా ఇద్దరు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో...

పోలీసుల నిర్లక్ష్యంగా కారణంగా ఇద్దరు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని హాస్పిటల్‌కు తరలించాల్సిన పోలీసులే.. కళ్ల ముందు ప్రాణాలు పోతున్నా చూస్తుండిపోయారు. తమ టయోటా వాహనానికి రక్తం మరకలు అంటుతాయనే కారణంతో ఆసుపత్రికి తరలించేందుకు నిరాకరించారు. దీంతో సకాలంలో చికిత్స అందకపోవడంతో ఇద్దరు టీనేజర్ల ప్రాణాలు గాల్లో కలిశాయి. యూపీలోని సహరాన్‌పూర్‌లో ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్. ఇద్దరు టీనేజ్ కుర్రాళ్లు..అర్పిత్ ఖురానా, సన్నీ గార్గ్ బండి మీద ఇంటికి వెళ్తున్నారు. అయితే.. వాళ్లు వెళ్తున్న బైక్ అదుపు తప్పి పోల్‌ను డీకొంది. దీంతో వాళ్లు రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలో పడిపోయారు. ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం అయింది. వీళ్లను గమనించిన స్థానికులు వెంటనే 100 నెంబర్‌కు కాల్ చేశారు. దీంతో రాత్రిపూట పెట్రోలింగ్ చేసే వాహనం వచ్చింది. ముగ్గురు పోలీసులు ఉన్నారు అందులో. అప్పటికే ఇద్దరు కుర్రాళ్లకు తీవ్రంగా రక్త స్రావం అయింది. అయినప్పటికీ.. ఆ పోలీసులు వాళ్లను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి నిరాకరించారు. దీంతో షాక్ అయిన స్థానికులు ఎందుకు వాళ్లను ఆసుపత్రికి తీసుకెళ్లట్లేదని నిలదీశారు.

'వాళ్లను పెట్రోలింగ్ వాహనంలో తీసుకెళ్తే.. కారుకు మొత్తం రక్తం మరకలు అంటుతాయి. అందుకే మేము వాళ్లను ఈ కారులో హాస్పిటల్‌కు తీసుకెళ్లం' అని నొక్కి చెప్పారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆ కుర్రాళ్లను చూసినా వాళ్లకు దయ, కరుణ లాంటివేమీ కలగలేదు. అంతలోనే లోకల్ పోలీస్ స్టేషన్ వాహనం సంఘటనా స్థలానికి చేరుకున్నది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ఆసుపత్రిలో చేర్పించడం అప్పటికే లేటవడం వల్ల ఇద్దరు కుర్రాళ్లు మృతి చెందారు.

స్థానికులు అటుగా వెళ్తున్న వాహనాలను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరూ ఆపలేదు. వారు కూడా ఎవరి కన్నబిడ్డలే కదా.. కాపాడండి ప్లీజ్ అని ఒకరు పోలీసులను బతిమాలారు. కానీ ఖాకీలు కరగలేదు. పోలీస్ స్టేషన్ నుంచి మరో వాహనాన్ని రప్పించారు. కానీ ఆ లోగానే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ తతంగాన్ని వీడియో తీయగా.. అది వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదానికి గురైన వారికి సాయం అందించకుండా ఉండిపోయిన ముగ్గురు పోలీసుల్ని హెడ్ కానిస్టేబుల్ ఇంద్రపాల్ సింగ్, కానిస్టేబుళ్లు పంకజ్ కుమార్, మనోజ్ కుమార్‌గా గుర్తించారు. మానవత్వం లేకుండా వ్యవహరించిన ఆ ముగ్గురు పోలీసులపై చర్యలు తీసుకుంటామని డీఐజీ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories