రోజువారీ కూలీ రాజప్ప... సంపాదన చూస్తే కట్టప్ప కూడా షాక్ అవ్వాల్సిందే..!

రోజువారీ కూలీ రాజప్ప... సంపాదన చూస్తే కట్టప్ప కూడా షాక్ అవ్వాల్సిందే..!
x
Highlights

పొట్టకూటి కోసం వలస వచ్చిన ఓ రోజువారీ కూలీ... గుట్టుచప్పుడు కాకుండా కోట్లకు పడగలెత్తిన వైనమిది... ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో తన వార్షికాదాయం రూ.40...

పొట్టకూటి కోసం వలస వచ్చిన ఓ రోజువారీ కూలీ... గుట్టుచప్పుడు కాకుండా కోట్లకు పడగలెత్తిన వైనమిది... ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో తన వార్షికాదాయం రూ.40 లక్షలుగా పేర్కొనడంతో అధికారులే షాక్ అయ్యారు. అయితే అతడిపై పోలీసులు నిఘా పెట్టడంతో అసలు విషయం కాస్తా బయటపడింది. వివరాల్లోకి వెళితే...దక్షిణ కర్ణాటకలోని చామ్‌రాజ్‌నగర్‌ జిల్లాకు చెందిన పేద రాజప్ప చాలా ఏళ్ల కిందటే బెంగళూరు నగరానికి వలస వచ్చాడు. భవన నిర్మాణంలో రోజు కూలీగా పనిచేస్తూ పొట్టపోసుకుంటూ కాలం గడిపేవాడు. రాజప్ప సొంత ఊరు గంజాయి సాగుకు చాలా ఫేమస్‌. ఇంటికి వెళ్లినప్పుడల్లా సరదాగా కొంత గంజాను తీసుకొచ్చి తక్కువ ధరకే తోటి కూలీలకు ఇచ్చేవాడు. క్రమంగా వారంతా ఆ మత్తుపదార్థానికి బానిసలయ్యారు. గంజాయి సప్లయర్‌గా రాజప్పకు డిమాండ్‌ పెరిగింది. ఒకప్పుడు గ్రాముల్లో మొదలైన స్మగ్లింగ్‌ క్రమంగా టన్నులకు చేరింది. ఎడాపెడా గంజాయి అమ్మేసి కోట్లు గడించాడు రాజప్ప. ఎప్పటి నుంచో కన్నేసిన పోలీసులు.. ఇటీవలే రాజప్ప ఇంటిపై దాడిచేసి పక్కా సాక్ష్యాదారాలతో కేసు నమోదుచేశారు.

అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తిన అతడికి... నోట్లరద్దు రూపంలో ఊహించని దెబ్బ తగిలింది. దీంతో నల్లధనాన్ని చెలామణీలోకి తెచ్చుకునేందుకు వార్షికాదాయం రూ.40 లక్షలుగా చూపుతూ ఐటీ రిటర్న్ దాఖలు చేశాడు. ఇంత ఆదాయం ఎక్కడిదని అధికారులు ప్రశ్నిస్తే... తాను ఎ-కేటగిరీ కాంట్రాక్టర్‌నంటూ దొంగపత్రాలు చూపించి తప్పించుకున్నాడు. అయితే అతడి వ్యవహారంపై పోలీసులకు ఉప్పందడంతో... నిఘా పెట్టారు. బెంగళూరులో అత్యంత సంపన్నులు నివసించే ప్రాంతంలో ఉంటున్న అతడిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఇంట్లో సోదాలు నిర్వహించి మొత్తం 27 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల అంచనా ప్రకారమే కిలో గంజాయి రూ.40 వేలుగా చెబుతున్నారు. కాగా రాజప్పను తమదైన శైలిలో విచారించిన పోలీసులు... అతడు చెప్పిన వివరాలన్నీ ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమర్పించారు. ప్రస్తుతం అతడి అనుచరుల కోసం విస్తృత గాలింపు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories