మహాకూటమిలో కుదరని ఏకాభిప్రాయం...కోదండరామ్‌తో ఉత్తమ్‌ సంప్రదింపులు

మహాకూటమిలో కుదరని ఏకాభిప్రాయం...కోదండరామ్‌తో ఉత్తమ్‌ సంప్రదింపులు
x
Highlights

సీట్ల సర్దుబాటుపై మహాకూటమి నేతల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌తో నిన్న...

సీట్ల సర్దుబాటుపై మహాకూటమి నేతల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌తో నిన్న సంప్రదింపులు జరిపారు. అయితే సీట్ల విషయంలో అడుగు ముందుకు పడలేదని తెలిసింది. ఉత్తమ్‌ నల్లగొండ జిల్లా పర్యటనకు వెళ్లడంతో నిన్న సాయంత్రం జరుగుతుందనుకున్న కూటమి భేటీ వాయిదా పడింది. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ఇవాళ జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. దీంతో రేపు మహాకూటమి సమావేశం జరుగుతుందని, ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు వ్యవ హారం ఒక కొలిక్కి వస్తుందని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ శుక్రవారం ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో సమావేశమైన నేపధ్యంలో పీసీసీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా సీట్ల కేటాయింపులు పూర్తి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని రాహుల్‌ ఆదేశించటంతో సంప్రదింపులు మళ్లీ ప్రారంభించారు. సీట్ల విషయంలో టీజేఎస్‌ మళ్లీ పాత పాటే పాడుతున్నది. తమ పార్టీకి 15 సీట్లు కేటాయించాలని కోరుతున్నది. ఉత్తమ్‌తో చర్చల తర్వాత ఈ సంఖ్యను 12 కి తగ్గించుకోవటానికి కోదండరామ్‌ అంగీకరించినట్టు కాంగ్రెస్‌ వర్గాలంటున్నాయి. అయితే ఈ విషయంపై టీజేఎస్‌ నేతలు నోరు మెదపటం లేదు.

కాంగ్రెస్‌ పార్టీ 95 సీట్లకు పోటీచేస్తుందని ఉత్తమ్‌ ఇటీవల ఢిల్లీలో చేసిన ప్రకటన మహాకూటమిలో కలకలం సృష్టించింది. టీడీపీకి 14 సీట్లు కేటాయిస్తున్నట్టు ఆయన తెలిపారు. మిగిలిన 10 స్థానాలను టీజేఎస్‌, సీపీఐ పార్టీలు సరిపెట్టుకోవాలని ఆయన పరోక్షంగా సంకేతాలు పంపారు. ఉత్తమ్‌ ప్రకటనపై మూడు పార్టీల నేతలు గుర్రుగా ఉన్నారు. 14 సీట్లకు తాము అంగీకరించినట్టుగా వచ్చిన వార్తలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ ఖండించారు. తాము కోరుతున్న కీలక స్థానాలపై ముందుగా స్పష్టత రావాల్సి ఉందని ఆయన తెలిపారు.

ఉత్తమ్‌ ప్రతిపాదనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పార్టీకి రెండు మూడు స్థానాలంటూ కాంగ్రెస్‌ నేతలు ఇస్తున్న లీక్‌లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్ల సర్దుబాటు వ్యవహరాన్ని వెంటనే తేల్చకపోతే ఇవాళ సాయంత్రం జరిగే తమ పార్టీ రాష్ట్ర స్థాయి అత్యవసర సమవేశంలో కీలక నిర్ణయం తీసుకుంటామని శుక్రవారం ఆయన హెచ్చరించారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో ఇవాళ సాయంత్రం తమ పార్టీ అత్యవర సమావేశం జరుగుతుందని చాడ వెంకటరెడ్డి పునరుద్ఘాటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories