తన తల్లిదండ్రులను రాజకీయాల్లోకి లాగడంపై మోదీ ఆవేదన

తన తల్లిదండ్రులను రాజకీయాల్లోకి లాగడంపై మోదీ ఆవేదన
x
Highlights

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మాటల తూటాలు పేల్చారు. తన కటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగుతున్న వారిపై పంచ్ డైలాగులు విసురుతూనే ఓటర్లలో...

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మాటల తూటాలు పేల్చారు. తన కటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగుతున్న వారిపై పంచ్ డైలాగులు విసురుతూనే ఓటర్లలో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. రుణమాఫీ హామీతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్న రాహుల్ టార్గెట్‌గా విమర్శలు సంధించారు. దేశ వ్యాప్తంగా కనుమరుగవుతున్న కాంగ్రెస్‌ను రాష్ట్రం నుంచి శాశ్వతంగా సాగనంపాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు.

నాలుగేళ్ల చా‍య్ వాల పాలనను చూసి కాంగ్రెస్ వారసత్వ నేతలు తట్టుకోలేకపోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో పర్యటించిన ప్రధాని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. రోగగ్రస్ధ రాష్ట్రంగా ఉన్న మధ్యప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిన ఘనత బీజేపీదేనంటూ వ్యాఖ్యానించారు. అవినీతి రహిత పాలన సాగిస్తున్న తనపై చేసేందుకు విమర్శలు లేకపోవడంతో తన తల్లిదండ్రులను రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

అభివృద్ధి అజెండాతో తాము ముందుకు పోతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఉచిత హామీలతో రైతులను మోసం చేస్తున్నారంటూ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా అంటూ మోదీ సవాల్ విసిరారు. ప్రధానిగా ఉన్న తనను దొంగ అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మధ్యప్రదేశ్ యువకులను కూడా దొంగలంటున్నారని ఆరోపించారు. కర్నాటక ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇచ్చినా అక్కడి రైతులు, ప్రజలు విశ్వసించలేదన్నారు. దేవేగౌడతో కలిసి దొడ్డిదారిన అధికారం పీఠం ఎక్కిన తరువాత రుణమాఫీ చేయాలంటూ అడిగిన రైతులను జైల్లో పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశ చరిత్రలో రైతుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పనులు మరెప్పుడు జరగలేదన్నారు. మధ్యప్రదేశ్‌లో సాగును సంపన్నం చేసిన ఘనత శివరాజ్ సింగ్ చౌహాన్‌కే దక్కుతుందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక గోధుమల ఉత్పత్తి మూడింతలు, వరి ఉత్పత్తి ఏడింతలు పెరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో 18 శాతం వడ్డీకి అందిస్తున్న రుణాలను తాము ఉచితంగానే అందిస్తున్నామన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారని ఇలాంటి పార్టీని మధ్యప్రదేశ్‌లో అడుగు పెట్టనీయకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదేనంటూ మోడీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారానికి వచ్చేందుకు ఆ పార్టీ మాజీ ముఖ్యమంత్రే బయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

నోట్ల రద్దు పేరుతో తనపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అసలు వాస్తవాన్ని తెలుసుకోవాలంటూ సూచించారు. నోట్ల రద్దు వల్లే ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా పన్నులు ఎగవేస్తున్న మూడులక్షల షెల్‌ కంపెనీలు రద్దయ్యాయన్నారు. అందుకే తనపై మాతాపుత్రులు కోపం పెంచుకున్నారా అంటూ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తీసుకున్న చర్యల ద్వారా నాలుగేళ్లలోనే 120 సెల్ తయారి సంస్ధలు భారత్‌లోకి వచ్చాయన్నారు. వీటి ద్వారా ఐదు లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ కల్పన జరిగిందన్నారు. కాంగ్రెస్ నేతల వ్యక్తిగత విమర్శలను తెరపైకి తేవడం ద్వారా మధ్యప్రదేశ్ ‌ఓటర్లలో మరోసారి మోదీ సెంటిమెంట్ రాజేశారు. యువత, రైతులు, రోజు వారి కూలీలే ఓట్లే లక్ష్యంగా మోదీ తన ప్రచారాన్ని సాగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories