logo

తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు

తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. నారాయణ పేట్, ములుగుకు జిల్లా స్థాయి హోదా కల్పించనున్నారు. దీంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కి చేరుకోనుంది. అలాగే కొత్తగా 6 మండలాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ అంశాలతోపాటు, ఎన్నికల హామీలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని ములుగును జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

గత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో తెలంగాణలోని పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజించారు. తాజాగా మరో రెండు జిల్లాలు ఏర్పాటుతో తెలంగాణలోని జిల్లాల సంఖ్య 33కు చేరుతుంది. 12 మండలాలతో నారాయణ పేట జిల్లా, 9 మండలాలతో ములుగు జిల్లా ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్లను కొత్త రెవిన్యూ డివిజన్ గా అవతరించబోతుంది. అలాగే కొత్తగా ఆరు మండలాలను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.నల్గొండ జిల్లాలోని గట్టుప్పల్, భూపాలపల్లి జిల్లా పరిధిలోని మల్లంపల్లి, బాన్సువాడ నియోజకవర్గంలోని చందూరు, మెస్రా, మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఇనుగుర్తి, సిద్ధిపేట నియోజకవర్గంలోని నారాయణ్ రావు పేట్ లను మండలాలుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ప్రస్తుతం జనగామ జిల్లాలోనున్న గుండాల మండలాన్ని యదాద్రి భువనగిరి జిల్లాలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రెవిన్యూ శాఖ అధికారులకు ఆదేశించారు.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top