ధోనీ ఎందుకిలా?

ధోనీ ఎందుకిలా?
x
Highlights

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి విమర్శకులకు టార్గెట్ గా మారాడు. ఏడాది ఏడాదికీ పడిపోతున్న స్ట్రయిక్ రేట్...

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి విమర్శకులకు టార్గెట్ గా మారాడు. ఏడాది ఏడాదికీ పడిపోతున్న స్ట్రయిక్ రేట్ పసలేని బ్యాటింగ్ తో ధోనీ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కే అలంకరణగా మారాడంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. గత 15 సంవత్సరాలుగా భారత క్రికెట్ కు అసాధారణ సేవలు అందించిన మహేంద్రసింగ్ ధోనీలో మహిమ తగ్గిందా? అసలు ఎందుకిలా?

జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ ఎటాకింగ్ బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన మొనగాడు. భారీషాట్లు గొప్ప స్ట్రయిక్ రేట్ తో మ్యాచ్ ను విజయవంతంగా ముగించడంలో తనకుతానే సాటిగా నిలిచిన ఒకే ఒక్కడు. అంతేకాదు భారత్ కు టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంక్ తో పాటు టీ-20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, ఐసీసీ మినీ ప్రపంచకప్ లు అందించిన ఏకైక కెప్టెన్.

ఇన్ స్టంట్ వన్డే క్రికెట్ తో పాటు ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో సైతం దూకుడుగా ఆడుతూ పరుగులు వెల్లువెత్తించిన వీరబాదుడు బ్యాట్స్ మన్. అయితే ఇదంతా అందమైన గతం. టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత కెప్టెన్ విరాట్ కొహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రిల అండదండలతో భారతజట్టులో కొనసాగుతూ వస్తున్న ధోనీ ప్రస్తుతం క్రికెట్ విమర్శకులకు మాత్రమే కాదు విశ్లేషకులకు సైతం కేంద్రబిందువుగా మారాడు. 36 ఏళ్ల వయసులో స్థాయికి తగ్గట్టుగా స్ట్రయిక్ రేట్ తో బ్యాటింగ్ చేయలేకపోతున్న ధోనీ 2019 ప్రపంచకప్ వరకూ జట్టులో తన స్థానాన్ని నిలుపుకోగలడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

2004లో బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా వన్డే అరంగేట్రం చేసిన నాటినుంచి ఇటీవలి సౌతాఫ్రికా సిరీస్ లోని ఆఖరి వన్డే వరకూ ధోనీకి మొత్తం 318 మ్యాచ్ లు ఆడిన అపారఅనుభవం ఉంది. అంతేకాదు 10 శతకాలు, 67 అర్థశతకాలతో సహా మొత్తం 9 వేల 967 పరుగులు సాధించిన ఘనతా ఉంది. తన కెరియర్ లో అత్యుత్తమంగా 88.40 స్ట్రయిక్ రేట్ తో అరివీరభయంకర బ్యాట్స్ మన్ గా గుర్తింపు తెచ్చుకొన్న ధోనీ బ్యాటింగ్ లో గత ఏడాదికాలంగా పసతగ్గినట్లుగా గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. స్ట్రయిక్ రేట్ సైతం 88.40 నుంచి 81కు పడిపోయింది. గత ఏడాది న్యూజిలాండ్ సిరీస్ లో ధోనీ నత్తనడక బ్యాటింగ్ తో టీమిండియా ఓ మ్యాచ్ లో పరాజయం చవిచూడాల్సి ఉంది.

అంతేకాదు సౌతాఫ్రికాతో ఇటీవలే ముగిసిన ఆరుమ్యాచ్ ల వన్డే, ప్రస్తుత మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ల్లో ఇప్పటి వరకూ ఆడిన నాలుగు ఇన్నింగ్స్ లో ధోనీ 10, 42, 13, 16 పరుగుల స్కోర్లు సాధించాడు.
న్యూవాండరర్స్ స్టేడియంలో సఫారీలతో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ లో సైతం ధోనీ మొత్తం 11 బాల్స్ ఎదుర్కొని 2 బౌండ్రీలతో 16 పరుగులకు అవుటయ్యాడు.

ప్రస్తుత ధోనీ బ్యాటింగ్ లో నాటిదూకుడు నటరాజ భంగిమలో కొట్టే షాట్లు తన ట్రేడ్ మార్క్ హెలీకాప్టర్ షాట్లు మచ్చుకైనా కనిపించడం లేదు. క్రీజులో నిలదొక్కుకోడానికి నాన్ స్ట్రయికర్ కు అండగా
నిలవటానికీ మాత్రమే ప్రాధాన్యమిస్తున్నట్లుగా ధోనీ ఆటతీరు కనిపిస్తోంది. ఆత్మరక్షణ ధోరణితోనే ఆడుతున్న ధోనీని చూసి ఏంటీ ఇలా ఆడుతున్నాడంటూ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

గతంలో మాస్టర్ సచిన్ టెండుల్కర్ సైతం తన కెరియర్ చివరి భాగంలో ఇదే తరహా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు అదే పరిస్థితి ధోనీకి సైతం ఎదురయ్యింది. వయసు పెరిగే కొద్దీ సహజసిద్ధమైన దూకుడు తగ్గి పరిస్థితులకు తగ్గట్టుగా ఆచితూచి ఆడే ధోరణి వస్తుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. దానికి సచిన్ మాత్రమే కాదు ధోనీ సైతం ఏమాత్రం మినహాయింపు కాదు.

ప్రస్తుత టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కొహ్లీ, అజింక్యా రహానే, మనీష్ పాండే లాంటి సూపర్ హిట్టర్లు ఉన్నారు. వారిలో ఏ ముగ్గురు నిలదొక్కుకొన్నా ధోనీ వరకూ బ్యాటింగ్ రావడం కష్టమే. అయినా క్లిష్టసమయాలలో తనజట్టుకు మెరుపువేగంతో పరుగులు అందించడంలో ధోనీ తరచూ విఫలమవుతున్నాడు. ఇదే టీమ్ మేనేజ్ మెంట్ ను ఆందోళనకు గురిచేస్తోంది. ఏదిఏమైనా వికెట్ కీపర్ గా స్థాయికి మించి రాణిస్తున్న ధోనీ తన అపారఅనుభవంతో జట్టును గెలుపు బాటలో నడిపిస్తున్నాడు. కీలక సమయాలలో ఇటు కెప్టెన్ కొహ్లీకి అటు యువబౌలర్లకు విలువైన సలహాలు ఇస్తూ కొండంత అండగా నిలుస్తున్నాడు.

బ్యాటింగ్ లో పసతగ్గినా స్ట్రయిక్ రేట్ పడిపోయినా ఇప్పటికిప్పుడే భారతజట్టులో ధోనీ చోటుకు వచ్చిన ముప్పేమీ లేదు. అయితే ధోనీ లాంటి ఆటగాడు విమర్శకులకు పని చెప్పకుండా ఉండాలని అభిమానులు టీమ్ మేనేజ్ మెంట్ సైతం కోరుకొంటోంది. ఎవరు ఏమన్నా భారత క్రికెట్ కు ధోనీ అందించిన సేవలు అమూల్యం, అపురూపం. ధోనీ లేని భారత క్రికెట్ ను ఇప్పటికిప్పుడే ఊహించడం అసాధ్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories