Top
logo

జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా వెనుక ఏం జరిగింది..?

జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా వెనుక ఏం జరిగింది..?
X
Highlights

మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పును వెలువరించిన తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. సంచలన తీర్పు ప్రకటించిన...

మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పును వెలువరించిన తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. సంచలన తీర్పు ప్రకటించిన ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తీర్పు వెలువరించిన వెంటనే హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాజీనామా లేఖను పంపించారు. రాజీనామా ఆమోదించేవరకు సెలవు ఇవ్వాలని కోరారు. అయితే కీలకమైన తీర్పు ఇచ్చిన తర్వాత రాజీనామా చేయడమే ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది.

జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా వెనుక ఎం జరిగింది..అసలు ఎందుకు రాజీనామా చేశారు..?

మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే ఆ తీర్పు ఇచ్చిన నాయమూర్తి రాజీనామా అంతకంటే సంచలనంగా మారింది. తీర్పు ఇచ్చారో లేదో..వెను వెంటనే రాజీనామా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నానని లేఖలో చెప్పినా..రాజీనామా చేయడానికి గల కారణాలు ఏమిటనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తీర్పు సమయంలో వచ్చిన ఒత్తిళ్ళే కారణమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. విచారణ ప్రక్రియకు సంబంధించిన అంశాలు ఏవైనా ఆయనపై ప్రభావం చూపాయేమో అనే చర్చ న్యాయవర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.

మరోవైపు తెలంగాణలో పలువురు న్యాయమూర్తులపై కొద్ది రోజులుగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముగ్గురు జడ్జిలను ఏసీబీ అధికారులు అరెస్టులు చేసి కేసులు నమోదు చేశారు. పలువురు జడ్జీల వ్యవహారశైలి, వారు ఇచ్చిన తీర్పులపై కొన్ని ఆరోపణలు రావడం, ఈ మొత్తం వ్యవహారాన్ని హైకోర్టు పరిశీలిస్తుండగా రవీందర్ రెడ్డి రాజీనామా చేయడం న్యాయశాఖలో చర్చకు దారితీసింది. అయితే రాజీనామా ఆమోదం పొందిన తర్వాత మీడియాతో మాట్లాడతానని రవీందర్ రెడ్డి అన్నట్లు సమాచారం.

రవీందర్‌ రెడ్డి స్వస్థలం కరీంనగర్‌ జల్లా. తెలంగాణ న్యాయాధికారుల సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఏపీకి చెందిన వారిని తెలంగాణ జడ్జిలుగా నియమించొద్దంటూ తెలంగాణకు చెందిన 11 మంది న్యాయమూర్తులు ఆందోళనలు చేశారు. ఆ సమయంలో సస్పెండ్‌ అయిన 11 మందిలో ఆయన ఒకరు. రవీందర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ జుడీషియల్ అధికారుల సంఘం నాయకుడు కావడం...రెండూ నెలల్లో రిటైర్ కానున్న నేపథ్యంలో‌ తాజా ఘటన కలకలం రేపుతోంది.

Next Story