ప్రణయ్ భార్య అమృత ప్రాణాలకు ముప్పు..?

x
Highlights

మిర్యాలగూడలో కులగజ్జితో ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇప్పుడు అతడి భార్య అమృత ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందా ? ఆమెను కూడా అంతమొదించేందుకు పథకం...

మిర్యాలగూడలో కులగజ్జితో ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇప్పుడు అతడి భార్య అమృత ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందా ? ఆమెను కూడా అంతమొదించేందుకు పథకం పన్నుతున్నారా ? అమృత నివసించే ఇంటి వద్ద రెక్కీ జరిగిందా ? నిజమేనంటోంది అమృత.

మిర్యాలగూడలో కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ నెలన్నర క్రితం దారుణ హత్యకు గురయ్యాడు. భార్య అమృత, తల్లితో కలిసి వెళుతున్న అతడిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. ఈ పరువు హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రణయ్ ను కిరాయి హంతకుడితో హత్య చేయించిన అమృత తండ్రి మారుతీరావు, ఆమె బాబాయ్ తో పాటు ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై పిడి యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రణయ్‌ హంతకులు జైలుకెళ్లినా తమకు ప్రాణభయం ఉందని అమృతతో పాటు ప్రణయ్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రణయ్‌ ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఆరు నెలల గర్భంతో ఉన్న అమృత ప్రణయ్ ఇంట్లో ఉంటుంది. అత్తమామలతో కలిసి ఆమె జీవిస్తుంది. ప్రణయ్‌ ఇంటి దగ్గర పోలీసుల నిఘా ఉన్నా కూడా ఓ వ్యక్తి ఈ నెల మూడో తేది తెల్లవారుజామున గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. ముఖానికి కర్ఛీప్ కట్టుకుని ఇల్లంతా కలియ తిరిగాడు. అమృత నిద్రిస్తున్న రూమ్ కిటికీ తెరిచి చూశాడు. అలికిడి రావడంతో గోడ దూకి అతడు పారిపోయాడు. ప్రణయ్ ఇంట్లో ప్రవేశించిన అగంతకుడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డుయ్యాయి. సీసీ ఫుటేజ్ ను అమృత పోలీసులకు అప్పగించింది. అగంతకుడి రాకను ప్రణయ్ ఇంట్లోనున్న పోలీసులు కూడా గమనించారు.

తమ ఇంట్లో ప్రవేశించిన వ్యక్తి రెక్కీ నిర్వహించి వుండవచ్చని అమృత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తనతో పాటు కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందంటున్నారు. జైల్లోనున్న తన తండ్రి మారుతీరావు లేదా అతడికి మద్దతిచ్చేవారు కుట్ర చేస్తూ వుండవచ్చని చెబుతున్నారు. అమృతను కిడ్నాప్ చేయడానికి లేదా హాని తలపెట్టడానికి ప్రయత్నిస్తూ వుండవచ్చని ప్రణయ్ తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎవరిపైన కక్షలేదని, ప్రణయ్ హంతకులను శిక్షించాలనే కోరుతున్నామన్నారు. ప్రణయ్ దారుణ హత్య, ఆ తర్వాత ప్రణయ్ ఆత్మ బతికే ఉందని ఓ జంట చెప్పడం, ఇప్పుడు ముసుగు వేసుకొని ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడటం పలు అనుమానాలకు తావిస్తోంది. వరుస ఘటనల తీరు చూస్తుంటే అమృతకు ప్రాణహాని ఉందని ప్రణయ్ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories