యువ‌తి శీలానికి వెల‌క‌ట్టిన పెద్ద‌లు

x
Highlights

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. న్యాయం కోసం వెళ్లిన ఓ యువతి శీలానికి పెద్దలు వెలకట్టారు. తల్లిదండ్రులు లేని యువతిని ఓ యువకుడు నమ్మించి ప్రేమపేరుతో...

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. న్యాయం కోసం వెళ్లిన ఓ యువతి శీలానికి పెద్దలు వెలకట్టారు. తల్లిదండ్రులు లేని యువతిని ఓ యువకుడు నమ్మించి ప్రేమపేరుతో గర్భవతిని చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడు. దీంతో పెద్దలను ఆశ్రయిస్తే.. శీలానికి వెలకట్టారు. 2లక్షల 25వేలు ఇప్పిస్తామని సలహా ఇచ్చారు. అందుకు నిరాకరించిన యువతి మోసం చేసిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని పోలీసులను ఆశ్రయించింది.

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని రామకృష్ణాపూర్‌కు చెందిన శైలజ చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయింది. జిల్లా కేంద్రంలోని భగవంతంవాడలో అద్దెకు నివాసముంటోంది. భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తుండటంతో ఆమెకు ఎడ్లవాడకు చెందిన తాపీమేస్త్రీ చౌదరి శంకర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లిచేసుకుంటానని నమ్మించిన శంకర్.. ఆమెను లొంగదీసుకున్నాడు. ఇప్పుడామె గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన శైలజ పెళ్లి చేసుకోవాలని శంకర్‌పై ఒత్తిడి తెచ్చింది. దీంతో 8నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు శంకర్.

ఎట్టకేలకు శంకర్ పనిచేస్తున్న చోటకు వెళ్లి అతన్ని శైలజ నిలదీసింది. తనను పెళ్లి చేసుకునేందుకు శంకర్ నిరాకరించాడు. దీంతో 8వ నెల గర్భవతి కావడంతో తనకు న్యాయం చేయమని పెద్దలను ఆశ్రయించింది. న్యాయం చేయాల్సిన పెద్ద మనుషులు శంకర్‌కు వత్తాసు పలికి శైలజ శీలానికి వెలకట్టారు. 2లక్షల 25వేలు తీసుకుని, అబార్షన్ చేయించుకుని తనదారి తాను చూసుకోవాలని తీర్పు చెప్పారు.

డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకోని శైలజ.. శంకర్‌తో పెళ్లి జరిపించాలని మొండికేయడంతో పెద్దలు ఆమెను బెదిరించారు. లక్షరూపాయలు చేతిలో పెట్టి అబార్షన్ చేయించుకోమన్నారు. దీంతో ఆస్పత్రికి వెళ్తే అబార్షన్ చేయడం కుదరదని, ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. శంకర్‌తో పెళ్లి జరిపించాలని, అతనికి మద్దతునిచ్చిన పెద్దలపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతోంది. శైలజ ఫిర్యాదుపై స్పందించిన మంచిర్యాల ఏసీపీ గౌసే బాబా.. నిందితుడితోపాటు, పెద్దమనుషులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories