లాలూ కొడుకు విడాకుల దరఖాస్తు

లాలూ కొడుకు విడాకుల దరఖాస్తు
x
Highlights

పెళ్ళై నిండా ఆరు నెలలు కూడా కాలేదు..అప్పుడే బ్రేకప్. అవును...గత మేలో వివాహం చేసుకున్న ఓ ప్రముఖ జంట...తామిక కలసి ఉండలేమని డిసైడ్ అయ్యింది. విడాకులు...

పెళ్ళై నిండా ఆరు నెలలు కూడా కాలేదు..అప్పుడే బ్రేకప్. అవును...గత మేలో వివాహం చేసుకున్న ఓ ప్రముఖ జంట...తామిక కలసి ఉండలేమని డిసైడ్ అయ్యింది. విడాకులు కావాలంటూ భర్త కోర్టును ఆశ్రయించాడు. ఇంతకీ తెగతెంపులకు సిద్ధమైన భార్యాభర్తలు ఎవరు..? ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు...?

అత్యంత ఆర్భాటంగా వివాహం..10 వేల మంది అతిధులు..వేయి మందికి పైగా అతిరధ మహారధులు..గత మే 12న ధూం ధాంగా జరిగిన ఈ పెళ్ళి... బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌కి. ఆర్జేడీ సీనియర్‌ నాయకుడు చంద్రిక రాయ్‌ కుమార్తె ఐశ్వర్యరాయ్‌తో తేజ్‌ ప్రతాప్‌ పెళ్ళి గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్ళి అప్పట్లో ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. పశుగ్రాస కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్‌ పెరోల్‌ పై విడుదలై మరీ కుమారుడి వివాహాన్ని అట్టహాసంగా జరిపించారు. అంతేకాడు ఈ పెళ్ళికి 10 వేల మందికి పైగా అతిధులు హాజరవ్వడమే కాదు.. తినుబండారాల కోసం జరిగిన గొడవ అప్పట్లో పెద్ద న్యూస్‌గా మారింది.

ఎంతో ఘనంగా పెళ్ళి చేసుకున్న జంట ఆరు నెలల్లోనే విడాకులకు సిద్ధమయ్యారు. తనకు విడాకులు కావాలంటూ తేజ్‌ ప్రతాప్‌ యాదవ్.. పట్నా ఫ్యామిలీ కోర్టును కోరడం సంచలనంగా మారింది. తన భార్య ఐశ్వర్యరాయ్‌కి, తనకు మధ్య సఖ్యత లేదని, ఇద్దరికీ పొసగడం లేదని పిటిషన్‌లో తెలిపాడు. ఈ నేపథ్యంలో ఇద్దరం ఎక్కువకాలం కలిసి జీవించడం కష్టమని, విడాకులు మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారనే వార్తలను తేజ్‌ ప్రతాప్‌ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

తేజ్‌ ప్రతాప్‌ యాదవ్ భార్య ఐశ్వర్యా రాయ్‌ది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. ఐశ్వర్య తాత దరోగా ప్రసాద్ రాయ్‌ బీహార్ మాజీ సీఎంగా పని చేశారు. ఆమె తండ్రి చంద్రికా రాయ్ బీహార్ మంత్రిగా వ్యవహరించారు. పైగా బీహార్‌లోని చాప్రా నుంచి ఆర్జేడి టికెట్‌పై ఐశ్వర్యా రాయ్‌ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. తన భార్య రాజకీయాల్లోకి అడుగుపెట్టరని తేజ్‌ ప్రతాప్‌ స్పష్టం చేసినా పార్టీ వ్యవస్ధాపక దినోత్సవం రోజున ఆమె ఫోటోలతో కూడిన పోస్టర్లు వెలిశాయి. పెళ్ళైన అయ్యి ఆరు నెలలు కూడా కాకముందే అనూహ్యంగా తేజ్‌ ప్రతాప్‌ యాదవ్ కఠిన నిర్ణయం తీసుకోవడంపైనే ఇప్పుడు బీహార్ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories