రివ్యూ: కృష్ణార్జున యుద్ధం

రివ్యూ: కృష్ణార్జున యుద్ధం
x
Highlights

స‌మ‌ర్ప‌ణ‌: వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి నిర్మాణ సంస్థ‌: షైన్ స్క్రీన్స్‌ న‌టీన‌టులు: నాని, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ , బ్ర‌హ్మాజీ, దేవ‌ద‌ర్శిని,...

స‌మ‌ర్ప‌ణ‌: వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి
నిర్మాణ సంస్థ‌: షైన్ స్క్రీన్స్‌
న‌టీన‌టులు: నాని, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ , బ్ర‌హ్మాజీ, దేవ‌ద‌ర్శిని, నాగినీడు త‌దిత‌రులు
కూర్పు: స‌త్య.జి
సంగీతం: హిప్ హాప్ త‌మిళ‌
చాయాగ్ర‌హణం: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
క‌ళ‌: సాహి సురేశ్‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మేర్ల‌పాక గాంధీ

హీరోలకు ఒక్క హిట్ పడితేనే ఉబ్బితబ్బిబవుతారు. ఆనందానికి అవదులే లేనట్టు గాల్లో తేలిపోతుంటారు. అలాంటిది నాచురల్ స్టార్ నాని..ఒకటి కాదు ,రెండు కాదు ఏకంగా ఎనిమిది హిట్లు కొట్టాడు. అవి కూడా బ్యాక్ టు బ్యాక్. ప్రజెంట్ మరే హీరోకు లేని ఘనతను సాధించిన నాని తొమ్మిదో హిట్ కు సందడి మొదలెట్టాడు. హిట్ అనే పదానికి కేరాఫ్ గా మారిపోయాడు నాచురల్ స్టార్ నాని. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మొదలైన నాని జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. వైవిధ్యమైన స్టోరీలతో ప్రజెంట్ టాలీవుడ్ లో మరే హీరోకు లేని సక్సెస్ రేటును కంటీన్యూ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది విజయాలను ఖాతాలో వేసుకున్న నాని, తొమ్మిదో హిట్ కు రెడీ అయ్యాడు. కృష్ణార్జునయుద్ధం సినిమాతో రణరంగలోకి దిగాడు. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభిన‌యం చేయ‌డం. కృష్ణ‌, అర్జున్ అనే రెండు విభిన్న‌మైన పాత్ర‌ల‌తో నాని చేయ‌బోయే యుద్ధం ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తిని ముందు నుండి అంద‌రిలో క్రియేట్ అయ్యింది. ఇప్ప‌టికే జెండాపై క‌పిరాజు, జెంటిల్‌మ‌న్ చిత్రాల్లో నాని ద్విపాత్రాభిన‌యం చేసి ఉన్నాడు. అందులో జెండాపై క‌పిరాజు ప్లాప్ అయితే జెంటిల్‌మ‌న్ హిట్ అయ్యింది. మ‌రి మూడోసారి నాని ద్విపాత్రాభిన‌యం చేసిన కృష్ణార్జున‌యుద్ధం ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటుందో తెలుసుకోవాలంటే క‌థేంటో ఓ లుక్కేద్దాం..

క‌థ‌: కృష్ణ (నాని) చిత్తూరుజిల్లా అక్కుర్తి గ్రామంలోని యువ‌కుడు. పొలాల్లో ప‌క్షులు పంట‌ను నాశ‌నం చేయ‌కుండా పంట‌ల‌కు కాపు కాస్తుంటాడు. నాట‌కాలంటే పిచ్చి. అలాగే ఊర్లోని అమ్మాయిల‌కు ల‌వ్ ప్ర‌పోజ్‌లు చేస్తుంటాడు. వారి ద‌గ్గ‌ర తిట్లు చీవాట్లు తింటుంటాడు. ఓ సంద‌ర్భంలో గ్రామ స‌ర్పంచ్‌(నాగినీడు) త‌న త‌ల్లిన తిట్టాడ‌ని.. అత‌ని కాల‌ర్ ప‌ట్టుకుంటాడు. మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పే మ‌న‌స్త‌త్వం ఉన్న కృష్ణ స‌ర్పంచ్ మ‌న‌వ‌రాలు రియా(రుక్స‌ర్ మీర్‌)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. క్ర‌మంగా కృష్ణ మంచిత‌నం చూసి రియా కూడా త‌న‌ని ప్రేమిస్తుంది. కృష్ణ పేద‌వాడు కావ‌డం ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో ఆమె తాత‌య్య ఆమెను హైద‌రాబాద్ పంపేస్తాడు. ఈ క‌థ‌కు స‌మాంత‌రంగా ప్రాగ్‌(యూర‌ప్‌)లో అర్జున్(నాని) పెద్ద రాక్‌స్టార్‌. అర్జున్‌కి అమ్మాయిల‌ను ముగ్గులోకి దించే ప్లేబోయ్ మ‌న‌స్తత్వం ఉంటుంది. ఓ సందర్భంలో సుబ్బ‌ల‌క్ష్మి(అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌)ను చూసి ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే సుబ్బ‌ల‌క్ష్మి మాత్రం అర్జున్ ప్రేమ‌ను అంగీక‌రించ‌దు. ఆమె హైద‌రాబాద్ బ‌య‌లుదేరుతుంది. ఒక ప‌క్క రియా.. మ‌రో ప‌క్క సుబ్బ‌ల‌క్ష్మిని ఎవ‌రో కిడ్నాప్ చేస్తారు. వారిని వెత‌కుతూ కృష్ణ‌, అర్జున్‌లు హైద‌రాబాద్ చేరుకుంటారు. ఇంత‌కు కృష్ణ‌, అర్జున్‌లు క‌లుస్తారా? సుబ్బ‌ల‌క్ష్మి, రియాలు ఎమ‌వుతారు? చివ‌ర‌కి క‌థ ఎన్ని మ‌లుపులు తిరుగుతుంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: చాలా సింపుల్‌గా సాగే క‌థ ఇది. తొలి స‌గ భాగం స‌న్నివేశాల్లో హాస్యం ఉంటే.. ద్వితీయార్థంలో అస‌లు క‌థ ఉంటుంది. ఆరంభ స‌న్నివేశాలు సాదాసీదాగా అనిపించినా, క‌థ ముందుకు న‌డుస్తున్న కొద్దీ, కృష్ణ పాత్ర, అత‌ని అల్ల‌రి, అత‌ను ప‌లికే చిత్తూరు యాస న‌వ్వులు పంచుతుంది. మ‌రోప‌క్క రాక్‌స్టార్ అర్జున్ ప్లేబాయ్‌గా సంద‌డి చేస్తుంటాడు. ఆ పాత్ర‌లో నాని పెద్ద‌గా ఆక‌ట్టుకోడు. బ్ర‌హ్మాజీ(బ్ర‌హ్మాజీ) సంగీతం అంటే చెవి కోసుకునే సుబ్బ‌ల‌క్ష్మి పిన్ని(దేవ‌ద‌ర్శి‌ని) నేపథ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు న‌వ్వులు పంచుతాయి. వ‌ట్టి వినోద‌మేనా? అనుకుంటున్న క్ర‌మంలో క‌థ ఓ మ‌లుపు తిరుగుతుంది. ఇద్ద‌రు హీరోయిన్‌లు, హీరోలు ఒకే విధ‌మైన స‌మ‌స్య‌లో చిక్కుకుంటారు. దీంతో క‌థ హైద‌రాబాద్‌కు చేరుకుని, త‌ర్వాత ఏంట‌నే ఆస‌క్తి రేకెత్తిస్తుంది. అయితే ఆ ఆస‌క్తికి త‌గ్గ‌టుగా ద్వితీయార్థంలో బ‌లం లేక‌పోవ‌డం సినిమాకు కాస్త ప్ర‌తికూలం. తాము ప్రేమించిన అమ్మాయిల‌ను హీరోలు ర‌క్షించ‌డ‌మే అస‌లు క‌థ‌. ప్ర‌థ‌మార్ధంతో పోలిస్తే వినోదం పాళ్లు త‌గ్గ‌డంతో పాటు, క‌థ‌లోనూ పెద్ద‌గా విష‌యం లేక‌పోవ‌డంతో సినిమా కాస్త సాగ‌దీత‌గా అనిపిస్తుంది. ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కూ కృష్ణ పాత్ర‌లో నాని త‌న‌దైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించ‌డం సినిమాకు క‌లిసొచ్చే విష‌యం.

ఎవ‌రెలా చేశారంటే: నాని రెండు పాత్ర‌ల్లో ఒదిగిపోయినా, కృష్ణ‌గానే ఎక్కువ‌గా న‌చ్చుతాడు. ఊళ్లో త‌న స్నేహితుల‌తో క‌లిసి పండించిన వినోదం ఆద్యంతం న‌వ్వులు పంచుతుంది. క‌థానాయిక‌లు ఇద్ద‌రూ అందంగా క‌నిపించారు. ప‌రిధి మేర‌కు న‌టించారు. ప్ర‌థ‌మార్ధంలో బ్ర‌హ్మాజీ, నాని స్నేహితులుగా క‌నిపించిన న‌టులు, సుబ్బ‌ల‌క్ష్మి పిన్నిగా న‌టించిన దేవ‌ద‌ర్శిని, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు న‌వ్వులు పంచారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కెమెరా యూర‌ప్‌తో పాటు, చిత్తూరు జిల్లా ప‌ల్లెటూరి అందాల‌ను చాలా అందంగా చూపించింది. హిప్‌హాప్ త‌మిళ స్వ‌ర‌ప‌రిచిన మూడు పాట‌లు బాగున్నాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. క‌థానాయకుల పాత్ర‌ల‌ను స‌మాంత‌రంగా న‌డిపించిన విధానం, కామెడీ విష‌యంలో ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం క‌నిపిస్తుంది. ద్వితీయార్ధంపై మ‌రిన్నిక‌స‌ర‌త్తులు చేసి బ‌లంగా చూపించి ఉండాల్సింది.
బ‌లాలు:
+నాని న‌ట‌న‌
+ ప్ర‌థ‌మార్ధంలో వినోదం
+ పాట‌లు
బ‌ల‌హీన‌త‌లు:
- క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డం
- ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు

Show Full Article
Print Article
Next Story
More Stories