కాంగ్రెస్ 95..టీడీపీ 14..మరి టీజేఎస్‌కు ఎన్ని?

కాంగ్రెస్ 95..టీడీపీ 14..మరి టీజేఎస్‌కు ఎన్ని?
x
Highlights

మహాకూటమిలో సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయినట్టే కనిపిస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్...

మహాకూటమిలో సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయినట్టే కనిపిస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. టీడీపీతో 14 సీట్లకు సర్దుబాటు కుదిరిందని స్ఫష్టం చేశారు. టీజేఎస్, సీపీఐతో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. అభ్యర్థుల జాబితాను ఈ నెల 8 లేదా 9న ప్రకటిస్తామని తెలిపారు.

యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నివాసంలో సమావేశమైన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. తెలంగాణ ఎన్నికల బరిలో దిగే కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి సమావేశంలో చర్చించారు. 67 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారుపై చర్చ జరగ్గా.. 57 స్థానాలను ఖరారు చేసినట్టు సమాచారం. మిగతా స్థానాలన్నింటికి కూడా త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో మొత్తం అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

ఇప్పటివరకు పరిశీలించిన స్థానాల్లో అభ్యర్థుల ఖరారు ఓ కొలిక్కి వచ్చిందని, మొత్తం 95 స్థానాల్లో కాంగ్రెస్‌ బరిలో ఉంటుందని స్పష్టతనిచ్చారు. మిగతా 24 స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేస్తాయని వివరించారు. అభ్యర్థుల జాబితా మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయాలా..? వద్దా? అనే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్‌ తెలిపారు.

కూటమిలోని పార్టీలతో చర్చలు పూర్తయ్యాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని, కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఈనెల 8న మరోసారి సమావేశమై అభ్యర్థుల తుది జాబితాకు ఆమోదముద్ర వేసే అవకాశముందని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియా వెల్లడించారు. సమావేశంలో టీడీపీకి కేటాయించిన 14 సీట్లపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక టీజేఎస్ 12 స్థానాలకు పైగా కావాలని కోరుతుండగా ఎనిమిది స్థానాలు మాత్రమే ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిపై చర్చించేందుకు టీజేఎస్ చీఫ్ కోదండరాంతో రాహుల్ భేటీ కానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories