logo
సినిమా

‘కిరాక్‌ పార్టీ’ మూవీ రివ్యూ

Highlights

టైటిల్ : కిరాక్‌ పార్టీ జానర్ : యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ తారాగణం : నిఖిల్ సిద్ధార్థ్‌, సిమ్రాన్‌ పరీన్జా,...

టైటిల్ : కిరాక్‌ పార్టీ
జానర్ : యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : నిఖిల్ సిద్ధార్థ్‌, సిమ్రాన్‌ పరీన్జా, సంయుక‍్త హెగ్డే
సంగీతం : బి. అజనీష్‌ లోక్‌నాథ్‌
దర్శకత్వం : శరన్‌ కొప్పిశెట్టి
నిర్మాత : రామబ్రహ్మం సుంకర

రొటీన్ కమర్షియల్ చిత్రాలను పక్కన పెట్టి సరికొత్త కథలను ఎన్నుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్న హీరో నిఖిల్. తాజాగా కన్నడలో ఘన విజయం సాధించిన ‘కిరిక్ పార్టీ’ అనే సినిమాను ‘కిరాక్ పార్టీ’ అనే పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ : కృష్ణ (నిఖిల్ సిద్ధార్థ్) మెకానికల్‌ ఇంజనీరింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంట్‌. తన ఫ్రెండ్స్‌తో కలిసి కాలేజ్‌ లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తుంటాడు. కాలేజ్‌ బంక్‌ కొట్టడం, గొడవలు చేయటం ఇదే కృష్ణ లైఫ్‌. ఆ సమయంలో సీనియర్‌ మీరాను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఎలాగైన తనకు దగ్గరకావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా తన లైఫ్‌ తాను ఎంజాయ్‌ చేసే కృష్ణను మీరా కూడా ఇష్టపడుతుంది. కానీ అనుకోండా ఓ ప్రమాదంలో మీరా చనిపోతుంది. మీరాను ప్రాణంగా ప్రేమించిన కృష్ణ, పూర్తిగా మారిపోతాడు. కాలేజ్‌ లో అందరితో గొడవపడుతూ రౌడీలా మారిపోతాడు. మూడేళ్లు గడిచిపోతాయి. కృష్ణ గ్యాంగ్‌ ఫైనల్‌ ఇయర్‌కు వస్తుంది. కృష్ణ హీరోయిజం చూసి జూనియర్‌ సత్య (సంయుక్త హెగ్డే) కృష్ణను ఇష్టపడుతుంది. ఎలాగైన కృష్ణను మామూలు మనిషిగా మార్చాలని, జీవితంలోని కొన్ని చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ముందుకు సాగాలని గుర్తు చేయాలనుకుంటుంది. మరి సత్య ప్రయత్నం ఫలించిందా..? కృష్ణ మీరాను మర్చిపోయి సత్యకు దగ్గరయ్యాడా..? ఈ కాలేజ్‌ లైఫ్‌ కృష్ణకు ఎలాంటి అనుభవాలను ఇచ్చింది..? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే: హ్యాపీ డేస్‌, త్రీ ఇడియట్స్‌, ప్రేమమ్‌ ఈ లక్షణాలన్నీ కథలో కన్పిస్తుంటాయి. వాటి నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథలా అనిపిస్తుంది. దర్శకుడు దాదాపు కన్నడ మాతృకను ఫాలో అయిపోయాడు. తొలి సగం కాలేజీ సన్నివేశాలతో సరదాగా గడిచిపోతుంది. జూనియర్లు, సీనియర్ల మధ్య గొడవలు, ర్యాగింగ్‌కు ఫ్రెండ్‌షిప్‌కు సంబంధించిన సన్నివేశాలు కాలేజీ కుర్రాళ్లకు బాగా నచ్చుతాయి. మీరా(సిమ్రన్‌) అనే పాత్ర ఎంట్రీతో కథలో ఎమోషనల్‌ టచ్‌ వస్తుంది. విశ్రాంతికి ముందు వచ్చే సన్నివేశాలన్నీ కాస్త భావోద్వేగంగా సాగుతాయి. కృష్ణ పాత్ర రెబెల్‌గా మారడానికి ఆయా సన్నివేశాలే కారణమవుతాయి. ద్వితీయార్థం మొత్తం నిఖిల్‌లోని హీరోయిజాన్ని బయటికి తీసే ప్రయత్నం చేశారు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఎక్కువై వినోదం ప్రాధాన్యత తగ్గింది. పతాక సన్నివేశాలకు ముందు కథ మళ్లీ గాడీలోకి వస్తుంది. కృష్ణ తన లక్ష్యం తెలుసుకుంటాడు. క్లైమాక్స్ హ్యాపీడేస్‌ను తలపిస్తుంది. స్నేహితులంతా ఒక్కటైపోవడం, వాళ్ల మధ్య గొడవల్ని పక్కన పెట్టడం ఇవన్నీ ఎమోషనల్‌గా టచ్‌ చేసేవే. మొత్తానికి దర్శకుడు ఒక కథను కాలేజీ కుర్రాళ్లకు నచ్చేలా తెరకెక్కించగలిగారు.

నటీనటులు : కృష్ణ పాత్రలో నిఖిల్ మంచి నటన కనబరిచాడు. స్టూడెంట్‌ గా తనకు అలవాటైన ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌ తో మెప్పించటంతో పాటు సెకండ్‌ హాఫ్‌లో మెచ్యూర్డ్‌ గా కనిపించి ఆకట్టుకున్నాడు. లుక్‌ విషయంలోనూ మంచి వేరియేషన్‌ చూపించాడు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో పాటు క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ లో నిఖిల్ నటన చాలా బాగుంది. సినిమా సినిమాకు మంచి పరిణతి కనబరుస్తున్నాడు నిఖిల్‌. ఫస్ట్‌హాఫ్ లో హీరోయిన్‌ గా కనిపించిన సిమ్రాన్‌ హుందాగా కనిపించింది. సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. మరో హీరోయిన్‌ సంయుక్త హెగ్డే బబ్లీ గర్ల్ గా కనిపించి సెంకడ్‌హాఫ్‌ లో జోష్ నింపే ప్రయత్నం చేసింది. బ్రహ్మాజీది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో మంచి కామెడీ పండించాడు. ఫ్రెండ్స్ పాత్రలో కనిపించిన నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించి మెప్పించారు.సాంకేతికంగా చూస్తే కథలో వైవిధ్యమేమీ లేదు. కొన్ని సన్నివేశాలను అల్లిన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది. పాటలు సందర్భానికి తగ్గట్టుగా ఉన్నాయి. నేపథ్య సంగీతానికి మంచి మార్కులు పడతాయి. ద్వితీయార్థం నెమ్మదించింది. నిడివి కూడా ఎక్కువే. అక్కడ కూడా వినోదం ఉండేలా చూసుకుంటే బాగుండేది. కెమెరా, సంభాషణలు, స్క్రీన్‌ప్లే ఇలా ఏ రకంగా చూసుకున్నాకొత్తదనం లోపించినట్లు కనిపించింది.

Kirrack Party Movie Review - Sakshi

బలాలు:

+ కాలేజీ సన్నివేశాలు

+ క్లైమాక్స్‌

+ నిఖిల్‌ నటన

బలహీనతలు:

- పాత సినిమా ఛాయలు

- ద్వితీయార్థం

Next Story