కరుణానిధి పరిస్థితి విషమం...చెన్నైలో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు

కరుణానిధి పరిస్థితి విషమం...చెన్నైలో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు
x
Highlights

డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్య పరిస్ధితి ఇంకా విషమంగానే ఉంది. కరుణానిధి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన వైద్యులు చికిత్సకు కరుణానిధి...

డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్య పరిస్ధితి ఇంకా విషమంగానే ఉంది. కరుణానిధి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన వైద్యులు చికిత్సకు కరుణానిధి సహకరిస్తున్నారని ... ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండటం వల్ల అవయవాలు పూర్తి స్ధాయిలో పని చేయడం లేదని తెలిపారు. ప్రస్తుతానికి కృత్రిమ శ్వాస అందిస్తున్నామని ప్రకటించారు. రెండు రోజులుగా కావేరి ఆసుపత్రి దగ్గరే ఉంటున్న డీఎంకే నేతలు పరిస్ధితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కరుణానిధి భార్య రాజాత్తి అమ్మాళ్‌, కుమారులు అళగిరి, స్టాలిన్‌, మనవలు, మనవరాళ్లు ఆస్పత్రిలోనే ఉన్నారు.

కరుణానిధి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న కార్యకర్తలు పెద్ద ఎత్తున కావేరి ఆసుపత్రి దగ్గరకు చేరుకుంటున్నారు. వేలాదిగా వచ్చిన అభిమానులను నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. మరో వైపు సామాజిక మాధ్యమాల్లో కరుణానిధి ఆరోగ్యంపై ఊహాగానాలు వినిపిస్తూ ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కరుణానిధి ఆరోగ్య పరిస్దితిపై వస్తున్న వార్తలను తట్టుకోలేక చెన్నైలో ఓ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చూసి ఆందోళన చెందవద్దని కరుణానిధి కుటుంబ సభ్యులు అభిమానులు, పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కరుణానిధి కోలుకుంటున్నారని అత్యుత్తమ వైద్యుల సమక్షంలో చికిత్స జరుగుతోందని డిఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. ఆసుపత్రి ఆవరణలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించ వద్దంటూ అభిమానులను కోరారు.

ఓ వైపు అభిమానుల ఆందోళనలు కొనసాగుతుండగానే కావేరి ఆసుపత్రి పరిసరాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల సెలవులను రద్దు చేసిన ప్రభుత్వం చెన్నైలో హై అలర్డ్ ప్రకటించింది. మరో వైపు కావేరి ఆసుపత్రి పరిసరాల్లో ఉన్న డీఎంకే కార్యకర్తలను బలవంతంగా బయటకు పంపిన పోలీసులు ఆసుపత్రి నుంచి కరుణానిధి ఇంటికి వెళ్లే దారిలో భారీగా బలగాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా డీఎంకే ప్రధాన కార్యాలయం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. తమిళనాడు సీఎం పళనిస్వామి సైతం తన సేలం పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని చెన్నై చేరుకున్నారు. కాసేపట్లో కావేరి ఆసుపత్రికి చేరుకోనున్న ఆ‍యన కరుణానిధిని స్వయంగా పరామర్శించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories