logo
జాతీయం

కాంగ్రెస్‌ కూటమికి గవర్నర్ షాక్...

కాంగ్రెస్‌ కూటమికి గవర్నర్ షాక్...
X
Highlights

జమ్ము కశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న మూడు పార్టీల కూటమికి గవర్నర్ సత్య పాల్ మాలిక్ ఊహించని...

జమ్ము కశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న మూడు పార్టీల కూటమికి గవర్నర్ సత్య పాల్ మాలిక్ ఊహించని షాక్ ఇచ్చారు. హఠాత్తుగా అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ రద్దు ప్రధాని మోడీ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీతో బీజేపీ పొత్తు తెంచుకున్న అనంతరం జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన విధించారు. మరో నెల రోజుల్లో గవర్నర్ పాలన ముగుస్తుండగా, కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీల మద్దతుతో జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. గవర్నర్‌కు ఆమె లేఖ రాశారు.

ఎన్.సీ, కాంగ్రెస్, పీడీపీలు కలిసి సర్కార్ ను ఏర్పాటు చేస్తాయని మెహబూబా ముఫ్తీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు గవర్నర్ సత్య పాల్ మాలిక్ ప్రకటించారు. గవర్నర్ నిర్ణయం ఆ మూడు పార్టీలకు షాక్ కలిగించింది. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 87. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ మార్క్ 44. నేషనల్ కాన్ఫరెన్స్ , కాంగ్రెస్, పీడీపీ కూటమికి కలిపి 55 మంది శాసన సభ్యుల సంఖ్యా బలముంది. ప్రభుత్వం ఏర్పాటుకు తగిన బలం ఉంది. విపక్ష కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కొద్ది గంటల్లోనే గవర్నర్ అసెంబ్లీని రద్దు చేశారు.

జమ్ము కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ సత్య పాల్ మాలిక్ తీసుకున్న నిర్ణయంపై పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ నేతలు విరుచుకు పడ్డారు. మూడు పార్టీల కూటమికి పూర్తి సంఖ్యాబలం ఉన్నా అసెంబ్లీని రద్దు చేయడం చట్ట విరుద్ధమన్నారు పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ. విపక్ష కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. జమ్ము కశ్మీర్ విపక్ష పార్టీలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటై ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్న సమయంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.

Next Story