తండ్రిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన కొడుకు

x
Highlights

మద్యం మత్తులో విచక్షణారహితంగా తనను కొడుతున్నాడంటూ ఓ కుమారుడు తన తండ్రిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఘటన కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో...

మద్యం మత్తులో విచక్షణారహితంగా తనను కొడుతున్నాడంటూ ఓ కుమారుడు తన తండ్రిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఘటన కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. జమ్మికుంట నగర పంచాయతీ పరిధిలోని మోత్కులగూడెంకు చెందిన మొలుగూరు శ్రీనివాస్‌ తాగుడుకు బానిసగా మారాడు. మేస్త్రీ పని చేస్తూ చేతికి వచ్చిన డబ్బులతో తాగుడుకు ఖర్చు చేస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య, కుమారుడిపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం శ్రీనివాస్‌ భార్య రమ్య, పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో కూలి పని చేసేందుకు వెళ్లింది.

కుమారుడు శశికుమార్‌ పాఠశాల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చాడు. అప్పటికే నిషాలో ఉన్న తండ్రి.. కొడుకును చూసి కోపంతో ఊగిపోయాడు. ఇంట్లో ఉన్న రూ.3 వేలు తీశావా అంటూ కర్రకు కారం రాసి విపరీతంగా చితక్కొట్టాడు. దీంతో బాలుడి ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. తాను డబ్బులు తీయలేదని కొడుకు ఎంత చెప్పినా వినకుండా తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. దెబ్బలకు తాళలేక విలవిల్లాడుతున్న శశికుమార్‌ను పెద్దమ్మ వచ్చి విడిపించింది. రాత్రి ఇంటికొచ్చిన తల్లికి విషయం విలపించాడు.

అనంతరం జమ్మికుంట పోలీసు స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేశాడు. మా నాన్నతో ఎప్పటికైనా అమ్మకు, తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. తల్లి రమ్యను కూడా రోజూ కొడుతూ చంపేస్తానని బెదిరిస్తాడని తెలిపాడు. తాను తండ్రితో ఉండనని తన అక్క శ్వేత కస్తూర్బా పాఠశాలలో 9వ తరగతి చదువుతోందని, తానూ అక్కడే ఉండి చదువుకుంటానని సీఐని వేడుకున్నాడు. తనను నిత్యం ఏదో కారణంతో కొడతాడని రమ్య విలపించింది. కుమారుని గాయాలను చూసి తల్లడిల్లింది. బాలుడి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు. ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అయితే తాను ఇంట్లో పెట్టిన రూ.3 వేలను కుమారుడు శశికుమార్‌ దొంగతనం చేయటంతో కొట్టానని శ్రీనివాస్‌ తెలిపాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories