కొడంగల్‌లో హైటెన్షన్..అడుగడుగునా పోలీసుల నిఘా

x
Highlights

కొడంగల్‌‌ల హై టెన్షన్ నెలకొంది. టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన...

కొడంగల్‌‌ల హై టెన్షన్ నెలకొంది. టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టిన పోలీసులు రేవంత్‌రెడ్డితోపాటు ఆయన సోదరులు తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డిలను బలవంతంగా అరెస్టు చేశారు. అక్కడి నుంచి వారిని పోలీసులు శంషాబాద్‌కు తరలించారు. తమ అనుచరుల ఇళ్లపై ఐటీ దాడులు, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలపై నిఘా, తనిఖీలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ రేవంత్‌రెడ్డి నియోజకవర్గ బంద్‌కు పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. ఇవాళ కోస్గిలో కేసీఆర్‌ సభ నేపథ్యంలో ముందస్తుగా అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు.

రేవంత్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌లో ఫైర్‌ బ్రాండ్‌ నేత. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్‌ కుటుంబంపైనా ప్రతి సందర్భంలోనూ నిప్పులు చెరిగే రేవంత్‌ ఈ ఎన్నికల్లో ప్రజా ఫ్రంట్‌ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రణాళిక వేసుకున్నారు. మరోవైపు తమకు కొరకరాని కొయ్యగా మారిన రేవంత్‌ను ఈసారి అసెంబ్లీలోనే అడుగు పెట్టనివ్వొద్దన్న పట్టుదలతో ఉన్న అధికార టీఆర్‌ఎస్‌ ఆయన పోటీ చేస్తున్న చోటనే క్లిష్టంగా మార్చడం ద్వారా నియోజకవర్గాన్ని దాటి బయటికి రాలేని పరిస్థితిని కల్పించింది. దీంతో కొడంగల్‌లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. వాస్తవానికి రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు వీలుగా రేవంత్‌ హెలికాప్టర్‌ను కూడా సిద్ధం చేసుకున్నారు. సొంత నియోజకవర్గంలో ప్రచార బాధ్యతల్ని తన తమ్ముళ్లకు అప్పగించి కొన్ని ఇతర నియోజకవర్గాల్లో పర్యటించారు కూడా. అయితే ఇంతలోనే కొడంగల్‌లో టీఆర్‌ఎస్‌ భారీ ఎత్తున కొనుగోళ్లకు దిగిందని, ఊళ్లకు ఊళ్లు కొనేస్తోందనే సమాచారం ఆయనకు అందింది. దీంతో రేవంత్‌ రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని పక్కనబెట్టక తప్పలేదు.

రేవంత్‌ను ఓడించడమే లక్ష్యంగా కొడంగల్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తమ్ముడు నరేందర్‌రెడ్డిని ఎన్నికల బరిలో దించింది. అన్నిరకాల అండదండలు అందిస్తోంది. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా పలువురు మంత్రులు, ఎంపీలు నరేందర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఇవాళ ప్రచారానికి స్వయంగా సీఎం కేసీఆర్‌ వస్తున్నారు. మరోవైపు రేవంత్‌ ప్రచారం కూడా ఉధృతంగా సాగుతోంది. ఆయన తరఫున ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చి ప్రచారం చేశారు. మొత్తంగా ఇరు పార్టీలు దేనికైనా సై అన్నట్లు ఎత్తుగడలు వేస్తుండటంతో అన్ని మండలాల్లోనూ పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎన్నికల నిఘా బృందాలు, ఐటీ శాఖ వరస దాడులు చేపట్టాయి.
ఐటీ దాడుల్లో భాగంగా కొద్దిరోజుల క్రితం టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నరేందర్‌రెడ్డి బంధువుల ఫాంహౌస్ లో భారీగా నగదు పట్టుబడింది. 51 లక్షల నగదుతోపాటు మరో 4 కోట్ల పైచిలుకుఖర్చుకు సంబంధించి లెక్కలు బయటపడ్డాయి. ఇది జరిగిన రెండ్రోజుల్లోనే రేవంత్‌ అనుచరవర్గం ఇళ్లపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు దాడులు నిర్వహించాయి. సోదాల్లో నగదుగానీ, ఇతరత్రా ఏమీ లభ్యం కాలేదు. ఈ సోదాలపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అనుచర వర్గమే లక్ష్యంగా అధికార పక్షం పోలీసులతో దాడులు చేయిస్తోందంటూ అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. దీంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, పోలీసులు, అధికార వ్యవస్థలన్నీ టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని రేవంత్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ సభలో నిరసన తెలపాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో పాటు బంద్‌కు పిలుపునివ్వడాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories