హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో భారీ వర్షం
x
Highlights

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఏరులై పారుతోంది. ఇళ్లలోకి వర్షపు...

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఏరులై పారుతోంది. ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చిచేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, బేగంపేట, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో కిలోమీటర్ల మేర భారీగా స్తంభించింది.

అలాగే, కోఠి, బేగంబజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, హిమయత్‌నగర్‌, హైదర్‌గూడ, లక్డీకాపూల్‌, సుల్తాన్‌బజార్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, సనత్‌నగర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి, మియాపూర్, కొండాపూర్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం వర్షం కురవడంతో పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు తడిసి ముద్దయ్యారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై వర్షపునీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

జూబ్లీహిల్స్‌ రెహ్మత్‌నగర్‌లో భారీవర్షం కారణంగా నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మాదాపూర్ ప్రాంతంలో రోడ్లపై దాదాపు రెండు, మూడు అడుగుల మేర వరదనీరు రోడ్లపై నిలిచిపోయింది. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతోంది. కుత్బుల్లాపూర్‌లో భారీవర్షం కురిసింది. జీడిమెట్ల, సూరారం, షాపూర్‌ నగర్, గండి మైసమ్మ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై పెద్దఎత్తున వర్షం నీరు చేరింది. దీంత ఎటూ పోయే మార్గం లేక వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

హైదరాబాద్లో కురిసిన భారీ వర్షంపై జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో డిజాస్టర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు రంగంలోకి దిగాయి. పాత భవనాలను ఖాళీ చేయాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు అధికారులు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories