బావా నువ్వు సూపర్

x
Highlights

ఇద్దరి మధ్యా విభేదాలన్నారు. రెండు వర్గాలున్నారు. ప్రచ్చన్న యుద్ధమన్నారు. రాబోయే కాలంలో కాబోయే సీఎం కోసం పోటీ అన్నారు. ఎన్నికల్లో గులాబీదళం చీలిపోవడం...

ఇద్దరి మధ్యా విభేదాలన్నారు. రెండు వర్గాలున్నారు. ప్రచ్చన్న యుద్ధమన్నారు. రాబోయే కాలంలో కాబోయే సీఎం కోసం పోటీ అన్నారు. ఎన్నికల్లో గులాబీదళం చీలిపోవడం ఖాయమని విపక్షాలు జోస్యం చెప్పాయి. పోతూపోతూ బావబామర్దుల మధ్య బాంబేశారు కొండా సురేఖ. కానీ అలాంటి ప్రచారాన్ని వారిద్దరూ తిప్పికొట్టారు. అవన్నీ ఒట్టి మాటలేనని కొట్టిపారేశారు. ఒకే వేదికపై పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు. ఒకరి గెలుపును మరొకరు ఆకాంక్షించుకున్నారు.

తన్నీరు హరీష్‌ రావు. కల్వకుంట్ల తారక రామారావు. కొంతకాలంగా వీరిద్దరిపై ఎలాంటి ప్రచారం సాగుతోందో అందరికీ తెలుసు. ఎన్నికల తర్వాత కేటీఆర్‌ను సీఎంను చేస్తారని, హరీష్‌ను పక్కనపెడతారని ఒక ప్రచారమైతే, అసలు సిద్దిపేట నుంచి హరీష్‌ను తప్పించి కేసీఆర్‌ పోటీ చేస్తారని మరో ప్రచారం. పార్టీలో కేటీఆర్‌ కంటే సీనియరైన హరీష్‌కు, కేసీఆర్ ప్రాధాన్యత తగ్గిస్తున్నారన్న చర్చ సాగుతుంటే, చంద్రబాబు తరహాలో హరీష్‌ కూడా తిరుగుబాటు చేస్తారని విపక్షాలు అప్పుడే జోస్యం చెప్పి, కార్యకర్తల్లో గందరగోళం పెంచేందుకు రాయి విసిరాయి.

దీనికితోడు మొన్న రాజకీయాలపై హరీష్‌ వైరాగ్యంగా మాట్లాడటం కూడా, ప్రత్యర్థి పక్షాలకు ఆయుధంగా మారింది. కొండా సురేఖ కూడా తాను హరీష్ వర్గమైనందుకే, టికెట్‌ కేటాయించలేదని బాంబు వేశారు. కేటీఆర్‌ను సీఎం చేసేందుకే, ఆయనవర్గానికే టిక్కెట్లిస్తున్నారని ఆరోపించారు. ఇలా హరీష్‌-కేటీఆర్ ల గురించి రకరకాల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. టీఆర్ఎస్‌ను చీల్చేందుకు, కార్యకర్తల్లో కన్‌ఫ్యూజన్‌ పెంచేందుకు విపక్షాలు, ఎన్నికల్లో దీన్నొక అస్త్రంగా ప్రయోగిస్తున్నాయి. బహుశా వీటన్నింటికీ సమాధానం చెప్పాలనుకున్నారో, విమర్శకుల నోళ్లు మూయించాలనుకున్నారేమో కానీ, హరీష్‌, కేటీఆర్‌లు ఒకే వేదికపైకి వచ్చారు. పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు కూడా.

ఒకరి నియోజకవర్గం అభివృద్దిపై మరొకరి అభినందనలు. పోటీ పదవులపై కాదు, అభివృద్దిలోనేనని చాటిచెప్పే మాటలు. తాము సీఎం కావాలన్న గొడవ లేదు, కేవలం కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న సంకల్పమే ఇద్దరిలోనూ ఉందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. మొన్న శాసన మండలి ఒక రోజు సమావేశంలోనూ, ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. తాజాగా స్వయంగా కేటీఆర్‌ ఇంటికే హరీష్ వెళ్లి, సిరిసిల్ల కార్యకర్తలతో మాట్లాడుతూ, కేటీఆర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏమాత్రం భేషజాలు లేకుండా ఒకరిని ఒకరు పొగుడుకున్నారు బావాబామర్దులు. ప్రత్యర్థులకు విమర్శలు చేసే ఛాన్స్‌ ఇవ్వకుండా, ఒకే వేదిక పంచుకున్నారు. కార్యకర్తల్లో గందరగోళానికి తెరదించడానికి అభినందనలు చేసుకున్నారు. ఇకనైనా ప్రతిపక్షాలు తమ కుటుంబంలో చిచ్చురేపకుండా, మాటలు తగ్గించుకోవాలని సంకేతాలిచ్చారు కేటీఆర్, హరీష్.

Show Full Article
Print Article
Next Story
More Stories