ఎన్నికల వేళ అంబరాన్ని అంటుతున్న పార్టీల హామీలు.. అమలు సాధ్యమయ్యేనా!

ఎన్నికల వేళ అంబరాన్ని అంటుతున్న పార్టీల హామీలు.. అమలు సాధ్యమయ్యేనా!
x
Highlights

అధికారం కోసం ఆకాశానికి నిచ్చెనలేసేస్తున్నాయి పార్టీలు. పథకాల అమలుకు అయ్యే ఖర్చుతో సంబంధం లేకుండా ఒకరిని మించి ఒకరు ఉదారంగా ఉచితాలు పంచేస్తున్నారు....

అధికారం కోసం ఆకాశానికి నిచ్చెనలేసేస్తున్నాయి పార్టీలు. పథకాల అమలుకు అయ్యే ఖర్చుతో సంబంధం లేకుండా ఒకరిని మించి ఒకరు ఉదారంగా ఉచితాలు పంచేస్తున్నారు. భారీభారీ మినహాయింపులిచ్చేస్తున్నారు లక్ష కోట్ల బడ్జెట్ అయ్యే ఈ హామీలు అసలు ఆచరణ సాధ్యమేనా? కీలక పథకాలపై ఏ పార్టీ హామీలెలా ఉన్నాయ్? అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుగా ఉంది తెలంగాణలో ఎన్నికలెదుర్కొంటున్న పార్టీల తీరు. ఒక్కో పార్టీ ఓటర్లను ఆకట్టుకోడంలో నేల విడిచి సాము చేసేస్తోంది. తాము గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఒకే ఒక్క అవకాశం ఇమ్మంటూ బతిమలాడేస్తున్నాయి. పార్టీలన్నీ మేనిఫెస్టోల మాయాజాలంతో జనాలను ఎలాగోలా ఆకర్షించాలని తపనపడుతున్నాయి అందుకే ఒకరి మేనిఫెస్టో రిలీజ్ అయ్యాక అది చూసి తమ మేనిఫెస్టోలో మార్పులు చేర్పులు, అదనపు హంగులు తగిలించి ఓటర్ల ముందుంచాయి. ఇక ప్రజాఫ్రంట్ లో పార్టీలన్నీ ఉమ్మడిగా ఓ మేనిఫెస్టో వ్యక్తిగత ఓటు బ్యాంకులను కాపాడుకోడానికి విడి విడిగా మరో మేనిఫెస్టో రిలీజ్ చేశాయి.

ఒకే ఒక్కడుగా ఎన్నికల బరిలో నిలిచిన టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ ను ఓడించడానికి ఆ పార్టీ మేనిఫెస్టోలోని పథకాలను తీసుకుని వాటి బడ్జెట్ అమాంతం పెంచేసింది కాంగ్రెస్ కేసిఆర్ మానస పుత్రికలుగా చెప్పుకునే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పెన్షన్లు, మాఫీలపైనే అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి రైతు రుణ మాఫీని టీఆరెస్ లక్ష రూపాయలే ఉంచితే కాంగ్రెస్ దాన్ని రెండు లక్షలకు పెంచేసింది. బిజెపి కూడా రైతు రుణ మాఫీ రెండు లక్షలు ఇస్తామంది. ఇక రైతులకు బోర్ వెల్, అగ్రికల్చరల్ పంప్ సెట్లు ఇస్తామన్నది బిజెపి అదనపు వాగ్దానం. రైతు బంధు పేరుతో ఎకరాకు అయిదు వేలిస్తామంటూ కేసిఆర్ చెబుతుంటే ప్రజాఫ్రంట్ కనీస మద్దతు ధర పెంచుతామంటూ వాగ్దానం చేసింది. అలాగే పంట కొనుగోలు కేంద్రాలను పెంచుతామంది.ఇక గత ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వాగ్దానం చేసిన టీఆరెస్ ఆ హామీని పూర్తిగా నెరవేర్చ లేకపోయింది. అందుకని మళ్లీ అధికారమిస్తే పూర్తి చేస్తామంది. అయితే కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తు దారులందరికీ ఏడాదికి 50 వేలు అద్దె కింద చెల్లిస్తామని ఇళ్లు కట్టే వరకూ ఈ సౌలభ్యం ఉంటుందని ప్రకటించింది. ఇక బిజెపి కూడా ఇదే వాగ్దానం చేసింది. లబ్దిదారులందరికీ ఇళ్ల నిర్మాణం అయ్యే వరకూ నెల నెలా అద్దె చెల్లిస్తామని స్పష్టం చేసింది. అసలీ పథకానికి అయ్యే ఖర్చుపై ఏ పార్టీకైనా అవగాహన ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయ్. టిఆర్ఎస్ కి గ్రౌండ్ లెవెల్ లో ఎదురైన ఇబ్బందులపై ఏ పార్టీ దృష్టిపెట్టలేదు. చాలా చోట్ల స్థల సేకరణే సమస్యగా మారింది. కానీ ఏ పార్టీ ఈసమస్యకి పరిష్కారం ఆలోచించినట్లు లేదు.లబ్దిదారులెందరు? వారికి నెల నెలా అయిదు వేల చొప్పున ఇళ్లు కట్టే వరకూ ఇవ్వడమంటే అయ్యే పనేనా? దీనికి అదనంగా ఎంత సొమ్ము అవుతుంది అన్న అంశాలను పార్టీలు ఆలోచించినట్లు కనపడదు.

ఇక మేనిఫెస్టోలో మరో కీలక అంశం పెన్షన్లు టీఆరెస్ ఆసరా పెన్షన్లను వెయ్యి నుంచి 2,016కు పెంచింది. దీనికి దీటుగా కాంగ్రెస్ కుటుంబంలో వృద్ధ దంపతులిద్దరికీ కలిపి నాలుగు వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. టీఆరెస్ డీఎస్సీ నోటిఫికేషన్ పై నోరు మెదపలేదు కానీ అటు ప్రజాఫ్రంట్ ఇటు బిజెపి కూడా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్నాయి. నిరుద్యోగభృతిని టీఆరెస్ రెండు వేలు ప్రకటించగా ప్రజాఫ్రంట్, బిజెపి మూడు వేలు ఇస్తామన్నాయి. ఇక ప్రభుత్వోద్యోగాల పోటీ పరీక్షలకు ఫీజులుండవు ఇంటర్వ్యూలుండవు, కేవలం రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నది బిజెపి అదనపు వాగ్దానం.డిగ్రీ విద్యార్ధులకు ఉచిత ల్యాప్ టాప్, సైకిల్, స్కూటీలపై సబ్సిడీ ఇస్తామనీ, ఆటో డ్రైవర్లకు కొత్త ఆటోలిస్తామనీ బిజెపి వాగ్దానం చేసింది. సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోడానికి ఏడాదికి లక్ష ఆవులను ఉచితంగా అందరికీ పంపిణీ చేస్తామని బిజెపిప్రకటించింది. పార్టీలు ఇచ్చిన ప్రధాన హామీల అమలు వ్యయం లెక్కేస్తే ఖర్చు తడిసి మోపెడవుతుందని ఇవి ఆచరణలో సాధ్యం కాదనీ ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. మొత్తం మీద పార్టీలన్నీ గెలుపు కోసం నేల విడిచి సాము చేస్తున్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. అయితే అన్నీ స్టడీ చేశాకే మేనిఫెస్టో ప్రిపేర్ చేశామంటున్నాయి పార్టీలు.

Show Full Article
Print Article
Next Story
More Stories