Top
logo

అభిమానమే గట్టయ్యను కుటుంబాన్ని రోడ్డున పడేసింది...అభిమానులారా... ఒక్కసారి ఆలోచించండి.!!

అభిమానమే గట్టయ్యను కుటుంబాన్ని రోడ్డున పడేసింది...అభిమానులారా... ఒక్కసారి ఆలోచించండి.!!
X
Highlights

నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్య చనిపోయాడు. అభిమాన నాయకుడు ఆశించిన టిక్కెట్‌ రాలేదన్న బాధతోనే కన్నుమూశాడు....

నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్య చనిపోయాడు. అభిమాన నాయకుడు ఆశించిన టిక్కెట్‌ రాలేదన్న బాధతోనే కన్నుమూశాడు. స్థానికుడికి కాకుండా స్థానికేతరుడికి టిక్కెట్‌ ఎలా ఇస్తారంటూ పెట్రోలు పోసుకున్న గట్టయ్యను మృత్యుదేవత గట్టెక్కనివ్వలేదు. తనతో పాటే తీసుకుపోయింది. మొత్తంగా ఈ ఘటనలో గట్టయ్య సాధించేదేమిటి?

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 105 మందితో తొలి జాబితా విడుదల చేసినప్పుడు చెన్నూరు సీటును నల్లాల ఓదేలుకు కాకుండా బాల్క సుమన్‌కు కేటాయించారు. స్థానికంగా అప్పుడే మొదలైన అసంతృప్తి ఈనెల 12న బాల్క సుమన్‌ ఎన్నికల ర్యాలీలో నిప్పై చెలరేగింది. నియోజకవర్గంలోని ఇందారంలో బాల్క సుమన్‌ పర్యటిస్తున్న సమయంలో ఓదేలు అనుచరుడు గట్టయ్య పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గట్టయ్య మృతిచెందాడు.

గట్టయ్య నల్లాల ఓదేలుతో నడిచాడు. అడుగులో అడుగు వేశాడు. ఆకాశమంతా అభిమానాన్ని పెంచుకున్నాడు. ఓదేలు కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధమయ్యాడు. అదే గట్టయ్యలో ఆవేశాన్ని పెంచింది. ఆలోచనను చంపేసింది. చావు వైపు నడిపించింది.

అభిమానమే ఆకాశమైన అత్యుత్సాహంలో, వారం రోజుల మృత్యు పోరాటంలో గట్టయ్య సాధించేదేమిటి? తనే దిక్కుగా ఉన్న కుటుంబాన్ని, తనపైనే ఆధారపడ్డ భార్యపిల్లాలను అనాథలను చేసి వెళ్లడం తప్ప? గట్టయ్య ఏం సాధించడని గొప్పగా చెప్పడానికి?

రాజకీయాలు వేరు నిజ జీవితాలు వేరు. రెండు వేర్వేరు కోణాలు రెండు వేర్వేరు పార్శ్వాలు. అభిమానం ఉండొచ్చు. నమ్మకున్న నేతపై ఎక్కడలేని నమ్మకం ఉండొచ్చు. కానీ మరీ ఇంతలా ఇలా ప్రాణాలు తీసుకున్నేంతలా ఉండాలా అభిమానం అంటే.!

అభిమానులారా ఒక్కసారి ఆలోచించండి.!! అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోండి. గుడి కట్టుకోండి. కానీ ఆ అభిమానం మీ కుటుంబాన్ని ప్రభావితం చేసుకోకుండా చూసుకోండి. మిమ్మల్నే నమ్మకున్న భార్యను గుర్తుపెట్టుకోండి. మీరంటే ప్రాణమిచ్చే పిల్లలను తలుచుకోండి. రాజకీయ అభిమానంలో మరో గట్టయ్యలు రావద్దు. అభిమానం కోసం ప్రాణాలు పణంగా పెట్టొద్దు. ఇదే హెచ్‌ఎంటీవీ కోరుకునేది. ఇదే హెచ్‌ఎంటీవీ ఆకాంక్షించేది.!!

Next Story