Top
logo

అన్నదాత కుటుంబంలో అరుదైన వేడుక...తల్లిదండ్రులకు పిల్లలు ఇచ్చిన సరికొత్త కానుక

అన్నదాత కుటుంబంలో అరుదైన వేడుక...తల్లిదండ్రులకు పిల్లలు ఇచ్చిన సరికొత్త కానుక
X
Highlights

అక్కడ ఆకాశమంత పందరి లేదు ... అలాగని భూదేవి అంత అరుగు కూడా లేదు. కాని భూమిని నమ్ముకుని విజయం సాధించిన ఓ రైతు...

అక్కడ ఆకాశమంత పందరి లేదు ... అలాగని భూదేవి అంత అరుగు కూడా లేదు. కాని భూమిని నమ్ముకుని విజయం సాధించిన ఓ రైతు ఇంట పండగ మాత్రం జరుగుతోంది. కుమారులే పెద్దలుగా నిర్వహించిన ఈ మహోత్సవానికి వ్యవసాయ కూలీ దగ్గరి వ్యవసాయ మంత్రి వరకు పెద్దలయ్యారు. సాగు పోరులో విజయం సాధించిన దంపతులకు జరిపిన ఈ వేడుకకుసకుటుంబ, సపరివార సభ్యులు తరలిరాగా పంచభూతాలు దీవెనలందించాయి.

ప్రభుత్వ ఉద్యోగులు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌డమనేది అందరికి తెలిసిన ఈ విషయమే. స‌ర్వీసు పూర్తయిన త‌ర్వాత రిటైర్మెంట్ తీసుకోవ‌డం.. ఈ సంద‌ర్భంగా తోటి ఉద్యోగులు స‌న్మాన స‌త్కారాలు చేసి గౌర‌వంగా పంప‌డం ఆన‌వాయితీ. కానీ, ఖ‌మ్మం జిల్లాలో ఈ రైతు కుమారులు వినూత్నంగా తమ తల్లిదండ్రులకు వృత్తి విరమణకు శ్రీ‌కారం చుట్టారు. వ్యవ‌సాయ ప‌నులు చేస్తున్న త‌మ త‌ల్లిదండ్రులకు వ్యవసాయ విరమణ మహోత్సవం నిర్వహించారు. బంధువులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు, రాజకీయ నేతల సమక్షంలో కుటుంబ సభ్యుల ఆటపాటలు, బాజభజంత్రీల మధ్య వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం హర్యాతండాకు చెందిన బానోత్‌ నాగులు, పూర్ణ దంపతులు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ మగ్గురు కుమారులను ఉన్నత చదువులు చదివించారు. తల్లిదండ్రుల ఆశలను వమ్ము కానీయకుండా ముగ్గురు కూడా మంచి స్ధానాల్లో ఉన్నారు. పెద్ద కుమారుడు రాందాస్‌ విజయవాడలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా, రెండో కుమారుడు రవి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తుండగా... మూడో కుమారుడు శ్రీను MA బీఈడీ చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. అయినా నాగులు ఇప్పటికీ గ్రామంలో వ్యవసాయ పనులు సాగిస్తున్నాడు. ఇనేళ్లు తమ కోసం కష్టపడిన తల్లిదండ్రులకు ఇకనైనా హాయిగా ఉండాలని నిర్ణయించుకున్న ముగ్గురు కుమారులు వృత్తి విరమణ చేయించాలని నిర్ణయించారు. తల్లిదండ్రులతో చర్చించి చుట్టుపక్కలవారితో పాటు, బంధుమిత్రులను ఆహ్వానించారు. అందరి పక్షంలో ఇలా తల్లిదండ్రులతో దండలు వేయించి కొత్త మధుర క్షణాలకు నాంది పలికారు.

దశాబ్దాల పాటు తమ చెమట చుక్కలను కాలువల్లో పారించిన తల్లిదండ్రుల కోసం తాము చేసిన ఈ పని ఎంతో చిన్నదంటున్నారు నాగులు దంపతుల కుమారులు. తల్లిదండ్రులు ఇన్ని రోజులు చేపట్టిన వ్యవసాయ బాధ్యతలను తాము స్వీకరిస్తామంటూ హామి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా ఫోన్ చేసి నాగులు దంపతులను అభినందించారు. దశాబ్ధాల తరబడి వ్యవసాయంతో వేసుకున్న అనుబంధం నుంచి దూరమవుతున్నామనే బాధ ఉన్నా ... కుమారుల సమక్షంలో ఇలా వృత్తి విరమణ చేయడం ఆనందాన్ని కలిగిస్తోందని నాగులు అంటున్నారు. కోట్లు సంపాదించిన తల్లిదండ్రులను సైతం వృద్ధాశ్రమాలకు పరిమితం చేస్తున్న ప్రస్తుత సమయంలో తల్లిదండ్రులను భగవత్ స్వరూపులుగా గుర్తించి గౌరవిస్తున్న వీరిని చుట్టుపక్కల వారు అభినందిస్తున్నారు.

Next Story