Top
logo

రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా

రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా
X
Highlights

రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలకు చెందిన 58 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది ...

రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలకు చెందిన 58 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌- మే నెలల్లో ముగియనుంది. దీంతో శాసనసభ్యుల కోటా కింద జరిగే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించింది.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 16 రాష్ట్రాల్లో 58 స్థానాలకు ఎన్నికల నిర్వహణకు వీలుగా ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. మార్చి 5న నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. మార్చి 23న ఓటింగ్ నిర్వహించి అదే రోజున ఓట్లు లెక్కిస్తారు.

మొత్తం 16 రాష్ర్టాల్లోని 58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణలో 3 స్థానాలు, ఏపీ 3, బీహార్ 6, ఛత్తీస్‌గఢ్ 1, ఉత్తరాఖండ్ 1, పశ్చిమబెంగాల్ 5, ఒడిశా 3, జార్ఖండ్ 2, గుజరాత్ 4, హర్యానా 1, హిమాచల్ ప్రదేశ్ 1, కర్ణాటక 4, మధ్య ప్రదేశ్ 5, మహారాష్ట్ర 6, ఉత్తరప్రదేశ్ అత్యధికంగా10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

వచ్చే ఏప్రిల్‌, మే నెలల్లో దేశవ్యాప్తంగా 57 మంది రాజ్యసభ ఎంపీలు పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్‌ నెలాఖరులో సచిన్‌ టెండుల్కర్‌, రేఖ సహా ముగ్గురు నామినేటెడ్‌ ఎంపీలు పదవీ విరమణ చేస్తున్నారు. ఏప్రిల్‌ 2, 3 తేదీల్లో 52 మంది పదవీ విరమణ చేస్తారు. ఇద్దరు మే 3న రిటైర్‌ అవుతున్నారు. వీరి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు షెడ్యూల్‌ విడుదల చేశారు. ఇటీవల వేటుకు గురైన జేడీయూ ఎంపీ అలీ అన్వర్‌ కూడా ఏప్రిల్‌లోనే రిటైర్‌ కావాల్సి ఉంది.

పదవీ విరమణ చేస్తున్న ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, ధర్మేంద్ర ప్రధాన్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, జగత్‌ ప్రకాశ్‌ నడ్డా, తావర్‌ చంద్‌ గెహ్లాట్‌, ప్రకాశ్‌ జవడేకర్‌, కాంగ్రెస్‌ నేత రహమాన్‌ ఖాన్, రాజీవ్‌ శుక్లా, కాంగ్రెస్‌ ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలు నరేశ్‌ అగర్వాల్‌, జయాబచ్చన్‌, బీజేపీ నేత వినయ్‌ కతియార్‌, కాంగ్రెస్‌ నేత ప్రమోద్‌ తివారీ ఉన్నారు.

రాజ్యసభ ఎన్నికలకు మార్చి 5న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేది మార్చి 12. 13న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల మార్చి 15లోగా దరఖాస్తులను ఉపసంహరించుకునే వీలుంది. మార్చి 23న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 23 సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. మార్చి 26న ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. పదవీ కాలం ముగిసిన 58 స్థానాలతోపాటు గతేడాది రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేరళ ఎంపీ వీరేంద్రకుమార్ స్థానానికి కూడా ఉప ఎన్నిక కూడా ఇదే షెడ్యూల్‌ ప్రకారం జరుగుతుంది.

Next Story