రెచ్చిపోయిన ఉగ్రవాదులు..235మంది దుర్మరణం

Highlights

ఈజిప్ట్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. బాంబులు, తుపాకులతో విరుచుకుపడి నెత్తుటేర్లు పారించారు. మసీదులో శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొన్న అమాయకులపై...

ఈజిప్ట్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. బాంబులు, తుపాకులతో విరుచుకుపడి నెత్తుటేర్లు పారించారు. మసీదులో శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొన్న అమాయకులపై గుళ్ల వర్షం కురిపించి 235 మంది నిండు ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ముందు మసీదులో బాంబు పేల్చి, అనంతరం భయంతో పారిపోతున్న వారిపై నలువైపుల నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇస్లామిక్‌ దేశం ఈజిప్ట్‌లోని సమస్యాత్మక ఉత్తర సినాయ్‌ ప్రాంతంలోని అల్‌–అరిష్‌ పట్టణంలో ఉన్న అల్‌–రౌదా మసీదులో ఈ ఘోరం చోటు చేసుకుంది.
ఈజిప్ట్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అల్‌ అరిష్‌ పట్టణంలోని మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్న సూఫీ ముస్లింలపై ఉగ్రవాదులు బాంబులు, భారీ ఆయుధాలతో దాడి చేశారు. 235 మందికి పైగా పొట్టనబెట్టుకున్నారు. మరో 109 మందిని గాయపరిచారు. ఈ దారుణ ఘటనతో మసీదు ప్రాంగణమంతా చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, క్షతగాత్రులు, రక్తపు ధారలతో భీతావహంగా మారింది.
నాలుగు వాహనాల్లో వచ్చిన ఉగ్రవాదులు తొలుత మసీదులోని చిన్నారుల సంరక్షణ కేంద్రం వద్ద బాంబు పేల్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరుగులు తీస్తున్న ప్రజలపై బుల్లెట్ల వర్షం కురిపించారు. విచ్చలవిడిగా కాల్పులు జరిపి మారణహోమం సృష్టించారు. గాయపడిన వారిని 50కిపైగా అంబులెన్లలో ఆసుపత్రులకు తరలించారు.
నరమేధం సృష్టించిన తర్వాత ఉగ్రవాదులు ఏమయ్యారన్న దానిపై సమాచారం లేదు. దాడి జరిగిన తీరును బట్టి ఇది ఐఎస్‌ ఉగ్రసంస్థ పని అయ్యుండొచ్చని భావిస్తున్నారు. ఈ దాడికి ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యతను ప్రకటించుకోలేదు.
ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌–సిసీ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిపై చర్చించారు. ఉగ్రవాదులపై తమ ‘క్రూర సైన్యం’ ద్వారా తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌–సిసీ శపథం చేశారు.ఈజిప్ట్‌ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది.
ఈజిప్ట్‌ లో జరిగిన ఉగ్రదాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాలకు భారత్‌ మద్దతుగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. ఈ హత్యాకాండను పిరికివాళ్ల చర్యగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అభివర్ణించారు. మనం మన సైన్యాలతోనే టెర్రరిస్టులను ఓడించాలి’ అంటూ ట్వీట్‌ చేశారు.
ఈ ఏడాది తొలి నుంచీ ఈజిప్ట్‌లో ఉగ్రదాడులు ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. తాజా ఉగ్ర దాడి ఆ దేశం గతంలో ఎన్నడూ చూడని రీతిలో 235 మందిని పొట్టనబెట్టుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories