అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు...

x
Highlights

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 12 తర్వాత ఏ రోజైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడొచ్చని, నవంబరు నెలాఖరులో ఎన్నికలు జరిగే అవకాశం...

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 12 తర్వాత ఏ రోజైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడొచ్చని, నవంబరు నెలాఖరులో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం ఐదు దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది. మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉన్న ఛత్తీస్‌గడ్‌ మినహా నాలుగు రాష్ట్రాల్లో ఒకరోజే పోలింగ్ జరగనుంది. తొలి దశలోనే మిజోరాం, తెలంగాణలకు ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఆయా రాష్ట్రాల్లో వచ్చే వారమే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 12న షెడ్యూల్‌ విడుదల కావొచ్చని, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసిందని అత్యున్నత అధికార వర్గాలు వెల్లడించాయి. ఐదు రాష్ట్రాల్లో మొత్తం ఐదు దశల్లో పోలింగ్‌ నిర్వహించడానికి వీలుగా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ మినహా నాలుగు రాష్ట్రాల్లో ఒక రోజే పోలింగ్‌ జరగనుంది. మొదటి దశ పోలింగ్‌ నవంబర్‌ 11న ప్రారంభమై 30న తుది దశతో పూర్తవుతుంది. ఓట్ల లెక్కింపుతో ఎన్నికల ప్రక్రియ డిసెంబర్‌ మొదటి వారంలో ముగియనుంది. శాసనసభ రద్దు దరిమిలా ముందస్తు ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో మొదటగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. నవంబర్‌ 11–17 తేదీల మధ్య రెండు దశల్లో తెలంగాణ, మిజోరంలో, నవంబర్‌ 18–24 మధ్య రెండు దశల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో, 25–30 తేదీల మధ్య ఒక దశలో రాజస్తాన్‌లో పోలింగ్‌ జరగనుంది.

అసెంబ్లీ రద్దై ఆపధర్మ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో మొదటగా ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ జారీ చేయాలన్న నిర్ణయం తీసుకున్నా మిగిలిన రాష్ట్రాలకు కూడా విడుదల చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 12న షెడ్యూల్‌ విడుదలైతే తెలంగాణ, మిజోరంలో అదే నెల 20 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ల ఘట్టం ముగియడానికి పోలింగ్‌కు మధ్య 14 రోజలు వ్యవధి ఉండేలా ఈ రెండు రాష్ట్రాల్లో పోలింగ్‌ తేదీలు ఉంటాయి. ఆ లెక్కన తెలంగాణ, మిజోరంలో నవంబర్‌ 11–17 తేదీల మధ్య పోలింగ్‌ నిర్వహిస్తారు.

మధ్యప్రదేశ్‌లో ఒకేసారి నవంబర్‌ 19 లేదా 22న, ఛత్తీస్‌గఢ్‌లో రెండుసార్లు 19 లేదా 22 ఒకసారి 24న రెండోసారి పోలింగ్‌ ఉండవచ్చని తెలుస్తోంది. రాజస్తాన్‌లో నవంబర్‌ 25 లేదా 30 తేదీల్లో ఒకే దశలో పోలింగ్‌ నిర్వహించి మొత్తం ఎన్నికల ప్రక్రియను ముగించాలన్న యోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు ప్రారంభించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ఎన్నికల షెడ్యూల్‌ను అనుకున్న తేదీల కంటే ముందుకు జరిపినట్లు తెలుస్తోంది.

నవంబర్‌ ఆఖరుకల్లా పోలింగ్‌ ప్రక్రియను పూర్తి చేస్తే డిసెంబర్‌ మొదటి వారంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. మామూలుగా అయితే డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే రీ పోలింగ్‌ వంటి సమస్యలు లేకపోతేనే ఇది సాధ్యపడుతుంది. ఏదేమైనా డిసెంబర్‌ 10కల్లా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, తెలంగాణ, మిజోరంలో 10వ తేదీ నాటికే ప్రభుత్వం ఏర్పడుతుందని ఈసీ వర్గాలు వెల్లడించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories