logo
సినిమా

శ్రీదేవి మ‌ర‌ణంపై అనుమానాలు

శ్రీదేవి మ‌ర‌ణంపై అనుమానాలు
X
Highlights

అతిలోకసుందరి శ్రీదేవి మరణంతో యావత్ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే శ్రీదేవి మరణం తర్వాత ఓ...

అతిలోకసుందరి శ్రీదేవి మరణంతో యావత్ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే శ్రీదేవి మరణం తర్వాత ఓ విషయం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా శ్రీదేవి హఠాన్మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీదేవి మరణాన్ని జీర్జించుకోలేకపోతున్న హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ అసలు ఈ ఘటన ఎలా జరిగిందంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. దేశంకాని దేశంలో ఇన్సిడెంట్‌ జరగడంతో అసలేం జరిగి ఉంటుందోనంటూ సందేహాలు లేవనెత్తుతున్నారు.

చివరి క్షణాల్లో సైతం ఎంతో ఉల్లాసంగా కనిపించింది. పెళ్లి వేడుకలో ఎంతో సంతోషంగా తనకిష్టమైన పాటకు డ్యాన్స్ కూడా చేసింది. భర్త బోనీకపూర్‌తో కలిసి హుషారుగా కాలా ఛష్మా సాంగ్‌కు స్టెప్పులేసింది. ఐదు పదుల వయసులో కూడా తనకింకా పదహారేళ్లనన్నట్లు తనదైన డ్యాన్స్‌తో హుషారెత్తించింది. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా తిరుగుతూ తనలో అందం ఇంకా తరగలేదన్నట్లుగా కనిపించిన శ్రీదేవికి ఇంత సడన్‌గా గుండెపోటు రావడమేంటి? బాత్రూమ్‌లో అపస్మారకస్థితిలో పడిపోవడమేంటి? పైగా ఒక్కసారి గుండెపోటుకే మరణించడమేంటి? అసలు ఇది కలా? నిజమా? అంటూ మాట్లాడుకుంటున్నారు.

శ్రీదేవి అనారోగ్యంతో ఉన్నట్లు ఈ మధ్యకాలంలో ఎక్కడా వినిపించలేదు? కనీసం ఒక్క వార్త కూడా రాలేదు? మరి ఇంత సడన్‌గా ఎలా మరణించిందనే ప్రశ్నలు సామాన్యులతోపాటు పలువురు నటీనటుల్లోనూ మెదులుతున్నాయి. అందుకే శ్రీదేవి మరణంపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా సోషల్ మీడియా వేదికగా షాకింగ్‌‌ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లయితే శ్రీదేవి నటించిన సినిమాల్లో పాటలనే ఆమెకు వర్తింపజేస్తూ ‘జాబిలమ్మను దేవుడు తీసుకెళ్లాడు సిరిమల్లెపూవు నేలరాలింది అందమా అందమా అందనంటి అందమా మీరు అందనంత లోకాలకు వెళ్లిపోయారా’ అంటూ తమ అభిమానాన్ని నివాళి రూపంలో చాటుకుంటున్నారు.

అయితే శ్రీదేవి గుండెపోటుతోనే మరణించినట్లు శ్రీదేవి భర్త బోనీకపూర్‌ తమ్ముడు సంజయ్‌కపూర్‌ ప్రకటించారు అంతేకాదు శ్రీదేవికి గుండెపోటు రావడం ఇదే మొదటిసారని తెలిపారు. ఇటు డాక్టర్లు కూడా గుండెపోటు రావడంతోనే శ్రీదేవి మరణించినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు శ్రీదేవికున్న స్టార్‌డమ్ కారణంగా ముందుముందు ఎలాంటి అనుమానాలు లేకుండా పోస్టుమార్టం రిపోర్టును చాలా జాగ్రత్తగా తయారుచేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి శ్రీదేవి హఠాన్మరణం అందరినీ షాక్‌కి గురిచేసింది.

Next Story