తీరం దాటిన గజ తుపాను

తీరం దాటిన గజ తుపాను
x
Highlights

నైరుతీ బంగాళాఖాతంపై దూసుకొచ్చిన గజ తుపాను తీర ప్రాంతాన్ని అల్లకల్లోలం చేస్తోంది. నిన్న రాత్రి ఇది తీరం దాటుతుందని వాతావరణ అధికారులు అంచనా వేసినా, అది...

నైరుతీ బంగాళాఖాతంపై దూసుకొచ్చిన గజ తుపాను తీర ప్రాంతాన్ని అల్లకల్లోలం చేస్తోంది. నిన్న రాత్రి ఇది తీరం దాటుతుందని వాతావరణ అధికారులు అంచనా వేసినా, అది ఇవాళ ఉదయం కడలూరు-పంబన్ మధ్య తీరం దాటింది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ, తీర ప్రాంతంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.

తుపాను ప్రభావంతో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడలూరు, నాగపట్నం, పుదుకొట్టై, తిరువారూర్, తంజావూరు, రామనాథపురం జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. లోతట్టు, తీర ప్రాంత ప్రజల్ని అక్కడికి దగ్గర్లోనే ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరాలకు తరలించారు. తమిళనాడు ప్రభుత్వం, ఉన్నతాధికారులు, ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నాయి. పక్కనే ఉన్న పుదుచ్చేరిలోని కారైక్కాల్‌ జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో అక్కడి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. నిన్న, ఇవాళ తమిళనాడులోని ఆరు జిల్లాల్లో విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు ప్రకటించారు.

ప్రస్తుతం తీర ప్రాంత జిల్లాలు నిర్మానుష్యంగా మారాయి. ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డు మీదుగా కడలూరు–చెన్నైని కలిపే హైవేని తాత్కాలికంగా మూసి వేశారు. చెన్నై నుంచి మైలాడుదురై మీదుగా వెళ్లే కొన్ని రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని విరుదాచలం వైపు మళ్లించారు. భారీ వర్షాలు పడుతున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని తమిళనాడు తీర ప్రాంత భద్రతా దళం హెచ్చరించింది. తుపాను మొదట ఏపీ వైపు వస్తుందని భావించినా, అది తమిళనాడువైపు వెళ్లడంతో దక్షిణకోస్తా, రాయలసీమకు ముప్పు తప్పిందని తాజాగా వాతావరణ అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories