logo
జాతీయం

మత్తెక్కించే అమ్మాయిలతో మజా చేయండంటూ ఆఫర్లు...

X
Highlights

డేటింగ్‌ సైట్లతో టోకరా పెడుతున్న కేటుగాళ్లను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. బెంగాల్‌ కేంద్రంగా సాగుతున్న...

డేటింగ్‌ సైట్లతో టోకరా పెడుతున్న కేటుగాళ్లను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. బెంగాల్‌ కేంద్రంగా సాగుతున్న ముఠా కార్యకలాపాల గుట్టును రట్టు చేశారు. అమ్మాయిల అర్దనగ్న ఫోటోలను చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న దుండగులకు చెక్ పెట్టారు. రెండేళ్లలో ఏకంగా 150 కోట్లు వసూలు చేసిన ముఠా ఆటకట్టించారు.

డేటింగ్‌ సైట్లను నిర్వహిస్తూ కోట్లను కొల్లగొట్టిన బెంగాల్‌ ముఠా గుట్టును సైబరాబాద్‌ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. వెరైటీ పేర్లతో అట్రాక్ట్‌ చేసే టైటిల్స్‌తో సైట్లను నిర్వహిస్తూ వినియోగదారులను నిండా ముంచుతున్న టీమ్‌ను కటకటాల్లోకి నెట్టారు. ముందుగా ఆన్‌లైన్‌లో డేటింగ్‌ సైట్ల ను ఓపెన్‌ చేస్తున్నారు. గెట్‌ యువర్‌ లేడీ, మై లవ్‌ 18 డాట్‌ కమ్‌ ల వంటి పేర్లతో డేటింగ్‌ సైట్లను తెరచి కస్ట్‌మర్స్‌ను అట్రాక్ట్‌ చేస్తున్నారు.

ఇక ఇందులోకి ఎంటర్‌ అయితే చాలు అందమైన అమ్మాయిల ఫోటోలు కనిపిస్తాయి. చిరునవ్వులు చిందిస్తూ ఎంతవరకు వీలైతే అంతవరకు ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ ఉన్న ఫోటోలు ఆకట్టుకుంటాయి. ఆగకుండా లాగిన్‌ అయ్యామా ఆట ఆడిస్తారు. ఇలానే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ సైట్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. దీంతో మే నెలలో రియా అనే అమ్మాయి కాంటాక్ట్‌లోకి వచ్చింది. స్థానికంగా ఉండే అమ్మాయిలే ఉన్నారని ముందుగా సభ్యత్వ రుసం వెయ్యి రూపాయలు కట్టాలని తెలిపింది. ఇక అప్పటి నుంచి మొదలు తర్వాత క్లబ్‌ లైసెన్స్‌ అని 15 వేల 600, రిజిస్ట్రేషన్‌ అని మరో 27 వేల 600 అని లైసెన్స్‌ ఫీజు, సర్వీసు ఫీజు, అకౌంట్‌ వెరిఫికేషన్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ వెరిఫికేషన్‌, జీఎస్టీ, ఫైనల్‌ పేమెంట్‌ ఫీజ్‌ అంటూ మొత్తం 7 లక్షలకు పైగా వారు సూచించిన బ్యాంక్‌ ఖాతాలో ఆన్‌లైన్‌ ద్వారా జమ చేశాడు.

జీఎస్టీ పేరు చెప్పి వసూలు చేయడమే కాకుండా తమవన్నీ లీగల్‌ వ్యవహారాలని అందకే పర్సనల్‌ వెరిఫికేషన్‌ కూడా చేస్తామంటూ అధనంగా డబ్బులు వసూలు చేశారు. చివరి విడుతగా మరో 4 లక్షలు కట్టిన తర్వాత రియా ఫోన్‌ స్విచ్చాఫ్‌ కావడంతో సదరు వ్యక్తి సైబరాబాద్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన మన పోలీసులకు దర్యాప్తులో అవాక్కయ్యే విషయాలు తెలిశాయి. బ్యాంకు అకౌంట్ల ఆధారంగా బెంగాల్‌కు వెళ్లిన టీమ్‌ అక్కడి ఓ ముఠాను పట్టుకుంది. ముఠా సూత్రధారి దేబాశిష్‌ ముఖర్జీ అని, అతను ఫైజుల్‌ హక్‌ అలియాస్‌ విక్కీరాయ్‌తో కలిసి ఎస్కార్ట్‌ సర్వీసెస్‌ వ్యాపారాన్ని ప్రారంభించాడని దర్యాప్తులో తేల్చారు. ఇతడి నేతృత్వంలోనే సిలిగురిలో 12, కోల్‌కతాలో 8 కాల్‌సెంటర్లు ప్రారంభమైనట్లు గుర్తించారు.

అనితా డే అలియాస్‌ తనీషా టెలీ కాలర్లను ఎంపిక చేసే హెచ్‌ ఆర్‌ మేనేజర్‌గా పనిచేసి టెలీకాలర్లను రిక్రూట్ చేస్తోంది. ఒక్కో కాల్‌సెంటర్‌లో 20 మంది చొప్పున మొత్తం 400 మంది టెలీకాలర్లు పనిచేస్తున్నట్టు తేల్చారు. ఇక కస్ట్‌మర్ల నుంచి చేసే వసూళ్లను బట్టి కమీషన్‌ ఇస్తారు. ఇలా ఒక్కో కాల్‌సెంటర్లలో రోజుకు లక్ష చొప్పున వసూలు చేస్తారు. అంటే మొత్తం 20 కాల్‌సెంటర్లలో నిత్యం 20 లక్షల బిజినెస్‌ జరిగింది. అంటే నెలకు 6 కోట్లు రెండేళ్లలో ఏకంగా 150 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. రెండు కాల్‌ సెంటర్ల మేనేజర్లు సందీప్‌మిత్రా, నీతాశంకర్‌ను అరెస్ట్‌ చేశామన్న సైబరాబాద్‌ సీపీ బ్యాంకు ఖాతాలతోపాటు కీలక డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.

రోజుకు 2 వేల మంది రిజిస్ట్రర్‌ అవుతున్న ఈ సైట్లు బంపర్‌ ఆఫర్లు కూడా పెడుతున్నాయి. గోల్డ్‌, సిల్వర్‌, ప్లాటీనం కార్డులతో పేర్లతో డిస్కౌంట్లతో డేటింగ్‌ ను కూడా ఆఫర్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు ఫిర్యాదు చేసేందుకు ఆరుగురు మాత్రమే ముందుకు వచ్చారని ఇంకా ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు చెబుతున్నారు.

Next Story