ఇందూరు నుంచి ఇంకో షాక్‌... హస్తవ్యస్తంగా కాంగ్రెస్!!

ఇందూరు నుంచి ఇంకో షాక్‌... హస్తవ్యస్తంగా కాంగ్రెస్!!
x
Highlights

ఓటమి షాక్ నుంచి తేరుకోకముందే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలపడం...

ఓటమి షాక్ నుంచి తేరుకోకముందే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలపడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన ఆకుల లలిత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడం లాంఛనమే అన్న చర్చ జరుగుతోంది. త్వరలో ఆమె గులాబీ గూటికి చేరుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమెతో పాటు మరో ఎమ్మెల్యే సైతం కారెక్కేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఎమ్మెల్సీ ఆకుల లలిత కారెక్కనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆమె వియ్యంకుడు శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ పావులు కదిపారని సమాచారం. ఆకుల లలిత కాంగ్రెస్ ను వీడితే జిల్లాలో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలనుంది. 2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆకుల లలిత గతంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. 2008 ఉప ఎన్నికల్లో డిచ్ పల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆర్మూర్ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆకుల లలిత ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీగా 2021 వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ ఆమె పార్టీ మారనున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

నిజామాబాద్ జిల్లాలో బలమైన సామాజికవర్గం నాయకురాలిగా గుర్తింపు పొందిన ఆకుల లలిత పార్టీని వీడితే, జిల్లాలో తమకు భారీ నష్టం తప్పదని కాంగ్రెస్ భావిస్తోంది. ఆమెతో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే సైతం పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎల్లారెడ్డి మినహా 8 స్ధానాల్లో కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా జాజుల సురేందర్ ఎన్నికయ్యారు. ఆయన కూడా పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఐతే తాను పార్టీ మారే అవకాశం లేదని జాజుల సురేందర్ కొట్టి పారేస్తున్నారు. ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోని జిల్లా కాంగ్రెస్ నేతలకు తాజా పరిణామాలు కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల వేళ ఎమ్మెల్సీ కారెక్కితే, హస్తం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్టే.

Show Full Article
Print Article
Next Story
More Stories