నిన్న జగ్గారెడ్డి... నేడు రేవంత్‌‌రెడ్డి... రేపు...

x
Highlights

వరుస కేసులు, అరెస్టులు టీకాంగ్రెస్‌ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. నిన్న జగ్గారెడ్డి... నేడు రేవంత్‌‌రెడ్డి... ఇలా ఒక్కో జిల్లాలో ఒక్కో కీలక...

వరుస కేసులు, అరెస్టులు టీకాంగ్రెస్‌ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. నిన్న జగ్గారెడ్డి... నేడు రేవంత్‌‌రెడ్డి... ఇలా ఒక్కో జిల్లాలో ఒక్కో కీలక నేతను... ఏదో ఒక కేసులో ఇరికిస్తున్నారని టీకాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుత పరిణామాలు కాంగ్రెస్‌కి నష్టం చేస్తాయేమోనన్న భయం ఆ పార్టీని కలవరపెడుతున్నా కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇంతకు ఇంత వడ్డీతో సహా చెల్లిస్తామంటూ టీఆర్‌ఎస్‌ను హెచ్చరిస్తున్నారు.

వ‌రుస కేసులు తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎన్నిక‌ల సమయంలో పాత‌ కేసులు ప‌రేషాన్ చేస్తున్నాయి. రోజుకో నేతపై కేసు, అరెస్టులు ఆందోళ‌న కలిగిస్తున్నాయి. దాంతో నిన్న జ‌గ్గారెడ్డి నేడు రేవంత్‌రెడ్డి మ‌రి రేపు ఎవరనే? చర్చ గాంధీభ‌వ‌న్‌లో హాట్‌హాట్‌గా జ‌రుగుతోంది. అయితే త‌మ నేత‌లను టార్గెట్ చేయడం రాజ‌కీయ క‌క్షే అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతోంది.

మెదక్‌ జిల్లాలో బలమైన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. అయితే నకిలీ పాస్ పోర్ట్ కేసులో జగ్గారెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్‌ చేయడంతో కలకలం రేగింది. ఇక ఇటీవలే జగ్గారెడ్డి జైలు నుంచి విడుదలవగా ఇప్పుడు మరో కీలక నేత రేవంత్‌పై ఐటీ అండ్ ఈడీ ఫోకస్‌ పెట్టడం టీకాంగ్రెస్‌ నేతల్ని కలవరపాటు గురిచేసింది. ఎన్నికల టైమ్‌లో కావాలనే కాంగ్రెస్‌ నేతల మనో ధైర్యాన్ని దెబ్బతీసేందుకు కేసీఆర్‌ అండ్‌ మోడీ కలిసి ఆడుతున్న గేమ్‌ అంటూ ఆరోపిస్తున్నారు.

ఇక వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి కీలక నేతగా ఉన్న గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి‌పై టీఆర్‌ఎస్‌ నేతలు గురిపెట్టినట్లు కనిపిస్తోంది. గండ్ర తమను బెదిరిస్తున్నాడంటూ ఉమ్మడి వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రవీందర్‌రావు ఆరోపించడం కలకలం రేపింది. ఇలా ఒక్కో జిల్లాలో ఒక్కో కాంగ్రెస్‌ నేతను ఏదో ఒక కేసులో ఇరికిస్తున్నారని టీకాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందనే భయంతోనే కేసీఆర్‌ తమ నేతలను టార్గెట్‌ చేశారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇంతకు ఇంత వడ్డీతో సహా చెల్లిస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories