ప్రచారంలో తెలంగాణ రాగం...సెంటిమెంటే అస్త్రంగా కాంగ్రెస్ ప్రచారం

ప్రచారంలో తెలంగాణ రాగం...సెంటిమెంటే అస్త్రంగా కాంగ్రెస్ ప్రచారం
x
Highlights

సెంటిమెంటే అస్త్రంగా కాంగ్రెస్, ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. తెలంగాణ ఇచ్చామన్న సెంటిమెంటును ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లేందుకు వ్యూహత్మకంగా...

సెంటిమెంటే అస్త్రంగా కాంగ్రెస్, ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. తెలంగాణ ఇచ్చామన్న సెంటిమెంటును ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లేందుకు వ్యూహత్మకంగా ముందుకెళ్తోంది. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన నేతలతో ప్రచారం చేసించేందుకు సిద్ధమవుతోంది. మేనిఫెస్టోల్లోనూ సెంటిమెంట్‌ కు భారీగా ప్రాధాన్యత ఇస్తోంది హస్తం పార్టీ.

పోయిన చోటే వెతుక్కోవాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సెంటిమెంట్‌ను మరోసారి ఇక్కడి ప్రజలకు గుర్తుకు తేవాలనే వ్యూహంతో కాంగ్రెస్‌ పెద్దలు, పావులు కదుపుతున్నారు. తెలంగాణ ఇచ్చింది తామేనని పదే పదే చెప్పే హస్తం పార్టీ నేతలు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో 2014లో విఫలమయ్యారు. అదే ఈసారి మాత్రం పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణ సెంటిమెంట్ ను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేడ్చల్ లో సోనియాగాంధీతో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సభలో రాహుల్‌గాంధీ కూడా పాల్గొననున్నారు. ఈ సభలోనే తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా సోనియాకు సన్మానం చేసేందుకు టీపీసీసీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

అలాగే రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన చిదంబరాన్నీ రంగంలోకి దింపారు. ఇప్పటికే హైదరాబాద్‌ వచ్చిన చిదంబరం తెలంగాణ రాష్ట్రానికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని సెంటిమెంట్‌తో కొట్టే ప్రయత్నం చేశారు. చిదంబరంతో పాటుగా తెలంగాణ బిల్లును రూపొందించిన కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేశ్‌ కూడా హైదరాబాద్‌ వచ్చారు. వీరిద్దరితో ఎన్నికల ప్రచారం చేయించడం ద్వారా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని గుర్తు చేసే ప్రయత్నం చేస్తోంది.

మరోవైపు, సెంటిమెంటును కాంగ్రెస్‌, టీడీపీ అందిపుచ్చుకుంటున్నాయి. తమ తమ పార్టీల మేనిఫెస్టోలను సెంటిమెంట్‌ కేంద్రంగానే తీర్చిదిద్దాయి. సంక్షేమ పథకాలు అంటూనే ఆత్మ గౌరవ నినాదానికి ప్రాధాన్యతను ఇచ్చాయి. టీడీపీ తన మేనిఫెస్టోను ఇప్పటికే విడుదల చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. కానీ, ఆ పార్టీ ముసాయిదా మేనిఫెస్టోలో ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెస్‌ చేసిన కృషి, 1969 ఉద్యమం నుంచి మొదలుకొని సోనియా తీసుకున్న చారిత్రక నిర్ణయం వరకు కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో సమగ్రంగా వివరించింది. తెలంగాణ ఉద్యమానికి చుక్కానిలా నిలిచిన జయశంకర్‌ను ‘తెలంగాణ జాతిపిత’గా అభివర్ణించింది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర గీతంగా చేస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో పెట్టింది. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మేనిఫెస్టో మొదటి పేజీని ప్రారంభించింది.

టీడీపీ కూడా తన మేనిఫెస్టోలో సెంటిమెంటుకే ప్రాధాన్యం ఇచ్చింది. అమర వీరుల కుటుంబాలకూ ఇంటికో ఉద్యోగం, ఇల్లు, 10 లక్షలతో పాటు 3 ఎకరాల వ్యవసాయ భూమిని ఇస్తామని ప్రకటించింది. అమర వీరులకు శాశ్వత స్మృతి చిహ్నం ఏర్పాటు చేయడమే కాకుండా వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. జయశంకర్‌ పేరిట ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. కాళోజీ నారాయణరావు పేరిట ప్రతి జిల్లాలో సాంస్కృతిక వేదికలు ఏర్పాటు చేస్తామని ఐలమ్మ పేరిట మహిళా సాధికారత కార్యక్రమాలు నిర్వహిస్తామని దాశరథి రంగాచార్య పేరిట సాంస్కృతిక పురస్కారాలు ఇస్తామని ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ ఘట్టాలను పాఠ్యాంశాలుగా చేరుస్తామని టీడీపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories